న్యూఢిల్లీ : దేశంలో మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏ) కింద తక్కువ వేతనాలను పార్లమెంటరీ ప్యానెల్ ఎత్తి చూపింది. ఉపాధి వేతనాలను పెంచాలని సూచించింది. ప్రస్తుత ద్రవ్యోల్బణానికి అనుగుణంగా ఇది ఉండాలని వివరించింది. ఈ మేరకు గ్రామీణాభివృద్ధి విభాగాన్ని కోరింది.
”పట్టణమైనా, గ్రామమైనా.. ద్రవ్యోల్బణం, జీవన వ్యయం అనేక రెట్లు పెరిగింది. ఇది అందరికీ సుస్పష్టం” అని వివరించింది. ఇప్పటికీ, ఎంజీఎన్‌ఆర్‌ఈజీఏలో నోటిఫై చేసిన వేతన రేట్ల ఆధారంగా చాలా రాష్ట్రాల్లో రోజుకు దాదాపు రూ.200 అనేది.. అవే రాష్ట్రాల్లోని అధిక లేబర్ రేట్లకు తగ్గట్టుగా లేదని పార్లమెంటరీ ప్యానెల్ వివరించింది. గ్రామీణాభివృద్ధిపై కాంగ్రెస్ ఎంపీ సప్తగిరి శంకర్ ఉలక నేతృత్వంలోని ప్యానెల్ ఈ విషయాలను లేవనెత్తింది.దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో వేతనాల్లో అసమానతలు మరొక ఆందోళనకరమైన అంశమని ప్యానెల్ నివేదిక పేర్కొన్నది.
స్త్రీ, పురుషులకు సమాన పనికి, సమాన వేతనాన్ని అందించాలని రాజ్యాంగంలోని ఆర్టికల్ 39 క్లాజ్ (డి)ని ఉటంకించింది. పని దినాల సంఖ్యను 100 నుంచి 150కి పెంచాలని సూచించింది. ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ కింద వేతనాలను గత ఏప్రిల్‌లో సవరించారు. ఇది పలు రాష్ట్రాల్లో నాలుగు నుంచి పది శాతం మధ్య పెంపును చూసింది. ఈ పథకం కింద హర్యానాలో అధికంగా రూ.374, అరుణాచల్‌ప్రదేశ్, నాగాలాం డ్‌లలో అత్యల్పంగా రూ.234గా లభిస్తున్నాయని ప్రభుత్వ నోటిఫికేషన్ ఒకటి వివరిస్తున్నది.కరోనా లాంటి విపత్కర సమయంలో అనేక రంగాలు కుదేలయ్యాయి. అలాంటి సమయంలో పని దొరకక ఇబ్బందులు పడుతున్న గ్రామీణ భారతాన్ని ఉపాధి హామీ పథకం కొంత వరకు ఆదుకోగలిగింది. ఎంతో మందికి ఉపాధిని చూపెట్టింది. కరోనా మహమ్మారి వంటి కష్ట కాలం లోనూ జీవితాన్ని నెట్టుకురావటానికి తోడ్పాటు నందించింది. వలసకార్మికులకు దారిని చూపెట్టింది. అయితే, కేంద్రంలో మొదటి సారి అధి కారంలోకి వచ్చినప్పటి నుంచీ ఈ పథకాన్ని చిన్న చూపు చూస్తున్నది మోడీ సర్కారు. బడ్జెట్‌లో కోతలు, చెల్లింపుల్లో ఆంక్షలు, తక్కువ పని దినాలు, వేతనాలు వంటివి ఈ పథకం మీద ఆధారపడే లక్షలాది మందిని ఎన్నో ఇబ్బందులకు గురి చేస్తున్నాయని సామాజికవేత్తలు కొన్ని గణాంకాలను ఉటంకి స్తున్నారు. కేంద్రంలోని మోడీ సర్కారు ఈ విషయంలో ఇప్పటికైనా సానుకూల వైఖరితో వ్యవహరించాలనీ, పార్లమెంటరీ ప్యానెల్ సూచన లను పాటించి వేతనాలను పెంచాలని సూచిస్తున్నారు.