ప్రమాదకర బిల్లులకు పార్లమెంట్‌ ఆమోదం!

ప్రజలతో, పర్యావరణంతో ఎలాంటి సంబంధం లేకుండా ప్రయివేటు పెట్టుబడి దారులు జాతీయ వనరులను యథేచ్ఛగా దోపిడీ చేసుకోవడానికి అనుమతించిన విధానాన్నే కొనసాగిస్తూ, మోడీ ప్రభుత్వం రెండు బిల్లులను పార్లమెంట్‌లో ప్రవేశపెట్టి, ఆమోదించింది. వీటివల్ల భవిష్యత్తులో తీవ్ర పర్యవసానాలు ఏర్పడే ప్రమాదముంది. అందులో ఒకటి అటవీ (సంరక్షణ) చట్టాన్ని (ఎఫ్‌సిఎ) సవరించడం కాగా, రెండవది గనులు, ఖనిజాలు (అభివద్ధి, నియంత్రణ) (ఎంఎండిఆర్‌) చట్టం. అడవులుగా పేర్కొనబడిన భూముల రిజర్వేషన్‌ను ఏకపక్షంగా తొలగించడాన్ని నివారించేందుకు 1980లో ఆమోదించబడిన అటవీ సంరక్షణ చట్టంలో కఠినమైన నిబంధనలు ఉన్నాయి. నిర్లక్ష్యపూరిత దోపిడీ నుండి అడవులను సంరక్షించుకోవాలన్నది దీని ఉద్దేశ్యం. అయితే ఆ తర్వాత 2006లో గిరిజన తెగలకు భూమి హక్కులు ఇవ్వడానికి, వారికి మౌలిక సౌకర్యాలు కల్పించడానికిగాను ఎఫ్‌ఆర్‌ఎగా తెలిసిన షెడ్యూల్డ్‌ తెగలు, ఇతర సాంప్రదాయ అటవీవాసుల (అటవీ హక్కుల చట్టం గుర్తింపు) చట్టం ద్వారా కొన్ని మినహాయింపులను చేర్చారు. రోడ్డు, రైల్వే లైన్లు, భద్రతాపరమైన సదుపాయాలు, రక్షణ శిబిరాలు, వైర్‌లెస్‌ స్టేషన్లు, వంతెనలు, కందకాలు, పైప్‌లైన్లు, జంతు ప్రదర్శన శాలలు, సఫారీలు, పర్యావరణ హితమైన పర్యాటక సదుపాయాల నిర్మాణం కోసం కొన్ని మినహాయింపులను ఇవ్వడం ద్వారా… ప్రస్తుతమున్న చట్టం యావత్‌ నియంత్రణా నిర్మాణాన్ని నిర్వీర్యం చేయడానికి, అడవుల నిర్వచనాన్ని నీరుగార్చడానికి… మోడీ ప్రభుత్వం ఈ బిల్లును ప్రవేశపెట్టింది.
అడవిగా నిర్వచించని ప్రాంతాలను ‘డీమ్డ్‌ ఫారెస్ట్‌’గా పరిగణించాలని పేర్కొంటూ 1996లో సుప్రీంకోర్టు నిర్దేశించినట్లుగా అడవుల భావనను తిరిగి నిర్వచించింది. గ్రామసభలు, ఇతర పర్యవేక్షక కమిటీల సమ్మతిని, అంగీకారాన్ని తప్పనిసరిగా తీసుకోవాలని పేర్కొంటున్న ఎఫ్‌ఆర్‌ఎ నిబంధనలను ఈ బిల్లు పక్కనబెట్టింది. సమ్మతి తెలియచేయాల్సిన అంశాన్ని గిరిజన కమ్యూనిటీలకే వదిలిపెట్టడంతో తమ భూములను లాక్కోవడానికి వ్యతిరేకంగా వారు ఏమీ చేయలేని నిస్సహాయులవుతున్నారు. ఒక్క దెబ్బతో, అడవుల విధ్వంసానికి సిద్ధమవుతోంది. అంతేకాదు! అడవుల్లో నివాసమేర్పరచుకున్న వారు నిర్వాసితులు కానున్నారు. అటవీ భూములను స్వాధీనం చేసుకోవడానికి చట్టాల ద్వారా, సుప్రీం కోర్టు ఉత్తర్వుల ద్వారా విధించిన క్రమబద్ధీకరణ పరిమితులను వదిలించుకోవడానికి ఇదంతా జరిగిందన్నది సుస్పష్టం.
మోడీ ప్రభుత్వం గత దశాబ్ద కాలంలో పర్యావరణ క్రమబద్ధీకరణ యంత్రాంగాన్ని అదేపనిగా ధ్వంసం చేస్తూ వచ్చింది. భవిష్యత్తులో జరిగే మార్పులు, ఏర్పడే పర్యవసానాలను దాని కొనసాగింపుగానే చూడాలి. గతంలో తీసుకున్న (గతంలో సవరణలుగా లేదా ఆఫీసు ఉత్తర్వులుగా ప్రవేశపెట్టిన) చర్యల్లో పర్యావరణ ప్రభావం అంచనా నిబంధనలు, కోస్తా ప్రాంత నియంత్రణలు తదితరాలు వున్నాయి. అటవీ సంరక్షణ చట్ట సవరణతో పాటుగా, ప్రభుత్వం జీవ వైవిధ్య చట్ట సవరణను కూడా ఇదే తరహాలో తీసుకువచ్చింది. ఈ చట్టం కింద జరిగే నేరాలను ఈ మార్పు నేరరహితం చేస్తుంది. ‘క్రోడీకరించ బడిన సాంప్రదాయ విజ్ఞానం’ నిర్వచనాన్ని మసకబారుస్తుంది. ఆయుష్‌ ప్రాక్టీషనర్లను చట్టపరిధి నుండి మినహాయిస్తుంది. ఇదంతా కలిసి కార్పొరేట్‌ ప్రయోజనాలకు ముఖ్యంగా కార్పొరేట్‌ ఔషధ సంస్థల ప్రయోజనాలకు అవసరమయ్యే రీతిలో అడవుల్లోని వృక్ష, జంతుజాలాన్ని అడ్డూ అదుపు లేకుండా దోచుకోవడానికి మార్గాన్ని సుగమం చేస్తుంది.
ఇక ఈ వర్షాకాల సమావేశాల్లో పార్లమెంట్‌ ఆమోదించిన రెండవ సవరణ చట్టం గనులు, ఖనిజాల క్రమబద్ధీకరణను నీరుగారుస్తుంది, మార్చేస్తుంది. వాస్తవానికి ఈ చట్టం పరిధిలో… ఖనిజాల అన్వేషణ క్రమం కొన్ని కఠినమైన పరిస్థితుల్లో మినహా తవ్వడం, డ్రిల్లింగ్‌ చేయడం వంటి విధ్వంసకర చర్యలను నిషేధిస్తుంది. అయితే, సవరణ తీసుకువచ్చిన తర్వాత, ప్రాథమిక సర్వే క్రమంలో గుంటలు, కందకాలు తవ్వడం, డ్రిల్లింగ్‌ చేయడం, ఉపరితలంపైన తవ్వకాలు వంటివి అనుమతించబడ్డాయి. అటవీ ప్రాంతాల్లో ఈ తరహా అన్వేషణ ప్రాజెక్టులను ప్రారంభించేందుకు ఇకపై అటవీ అనుమతులు తప్పనిసరి కాదు.
మన దేశంలో ఖనిజ సంపద పెద్ద మొత్తంలో అటవీ ప్రాంతాల్లో వుందన్నది అందరికీ తెలిసిన విషయమే. ఇలా చట్టాల్లో మార్పులు తీసుకురావడంతో, ఏ కార్పొరేట్‌ సంస్థ అయినా అటవీ ప్రాంతం లేదా ఆ ప్రాంతంలో నివసించే ప్రజలతో సంబంధం లేకుండా పూర్తి స్థాయి విధ్వంసక అన్వేషణను ప్రారంభించవచ్చు. ఇందుకు సంబంధించి, ఎఫ్‌సిఎ, ఎంఎండిఆర్‌ ఈ రెండు సవరణ చట్టాల విలీనంతో స్పష్టమైంది. పైగా, ఏవో కొన్ని నిర్దిష్ట కేసుల్లో కేంద్ర ప్రభుత్వ ప్రమేయం ఉంటుంది మినహా సాధారణంగా గనుల హక్కుల వేలం అనేది రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది. కానీ ఈ సవరించిన చట్టం లిథియం, కోబాల్ట్‌, నికెల్‌, పొటాష్‌, తగరం, ఫాస్పేట్‌ వంటి వ్యూహాత్మక ఖనిజాలకు సంబంధించి హక్కులను కేంద్రీకృతం చేసింది. అదనంగా బంగారం, వెండి, రాగి, తదితరాలతో సహా 29 ఖనిజాలకు ప్రత్యేక తవ్వకాల లైసెన్సులను జారీ చేసే అధికారాన్ని కొత్త చట్టం కేంద్ర ప్రభుత్వానికే కట్టబెట్టింది. ఆరు లోహాలు-లిథియం, బెరీలియం, నియోబియం, టైటానియం, టాంటాలమ్‌, జిక్రోనియమ్‌లను ‘ఆటోమేటిక్‌ మినరల్స్‌’ జాబితా నుండి తొలగించారు. వాటి కోసం గనుల తవ్వకాలు, అన్వేషణ చేపట్టేందుకు ప్రయివేటు సంస్థలను అనుమతించారు. ఖనిజాల సగటు అమ్మకం ధర (ఎఎస్‌పి) లెక్కింపు నుండి వివిధ సుంకాలు, లెవీలను (గనుల వెలుపల ధర) కొత్త ఎంఎండిఆర్‌ నిబంధనలు మినహాయిస్తున్నాయి. ప్రయివేటు పెట్టుబడులను ఆకర్షించేందుకు, అలాగే ఈ రోజుల్లో బాగా డిమాండ్‌ ఉన్న లిథియం వంటి లోహాలతో పాటూ సహజ వనరులను లాభదాయకమైన రీతిలో దోపిడీ చేసేందుకు వీలు కల్పించడమే ఈ కొత్త నిబంధనల ఉద్దేశ్యంగా ఉంది.
మోడీ ప్రభుత్వం నిస్సిగ్గుగా అనుసరించే ఈ కార్పొరేట్‌ అనుకూల వైఖరి, అన్ని విధానాల్లోనూ (పన్నుల్లో కోతలు, రాయితీలు ఇవ్వడం నుండి లాభాలు ఇబ్బడిముబ్బడిగా పెంచుకునేందుకు దోహదపడేలా… రక్షణాత్మక కార్మిక చట్టాలను నీరు గార్చడం వరకు) విస్తరిస్తోంది. అలాగే ప్రభుత్వ రంగ ఆస్తులు, మౌలిక సదుపాయాలను అప్పగించడం నుండి బొగ్గు తవ్వకాలు, అణు ఇంధనం వంటి వ్యూహాత్మక రంగాలకు ప్రయివేటు సంస్థలకు ద్వారాలు తెరవడం వరకు చివరకు రక్షణ రంగంలో కూడా దేశ విదేశాల నుండి ప్రయివేటు పెట్టుబడులను అనుమతించడం వరకు వ్యాప్తి చెందుతోంది. పర్యావరణ చట్టాలకు, నిబంధనలకు నిర్లక్ష్యంగా చేసిన మార్పులను ఇంత విస్తృతమైన చట్ర పరిధిలో చూడాల్సి ఉంది. పర్యావరణ పరిరక్షణ గురించి పైకి విపరీతమైన ఆందోళనను కనబరుస్తూ, వాతావరణ మార్పులపై పోరాడుతున్నామని చెప్పుకునే ఈ ప్రభుత్వం… వాస్తవానికి, ప్రజలను పణంగా పెట్టి మరింత పర్యావరణ విధ్వంసానికి దారితీసేలా దేశాన్ని నడిపిస్తోంది.
(‘పీపుల్స్‌ డెమోక్రసీ’ సంపాదకీయం)

 

Spread the love