పర్సా జీవితం ఆదర్శనీయం

– ఆయన అడుగుజాడల్లో నడవాలి
– పర్సా వర్థంతి సభలో పాలడుగు భాస్కర్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
సుదీర్ఘకాలం కార్మికోద్యమంలో సేవలందించిన పర్సాసత్యనారాయణ జీవితం ఆదర్శనీయమనీ, ఆయన ఆశయాలను నెరవేర్చేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్‌ కార్మిక లోకానికి పిలుపునిచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సీఐటీయూ వ్యవస్థాపక అధ్యక్షులుగా పనిచేసిన పర్సా సత్యనారాయణ ఎనిమిదో వర్థంతి కార్యక్రమాన్ని సోమవారం హైదరాబాద్‌లోని సీఐటీయూ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించారు. ఆ యూనియన్‌ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేశ్‌ అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భాస్కర్‌ మాట్లాడుతూ..19 ఏండ్ల వయస్సులోనే పర్సా తన ఉద్యమ జీవితాన్ని ప్రారంభించారని గుర్తుచేశారు. నైజాం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలను సమీకరించి సాయుధ పోరాటానికి సిద్ధం కావడమే కాకుండా, పాల్వంచ ఏరియా దళ కమాండర్‌గా పనిచేసి నిజాం అకృత్యాలపై పోరు సలిపిన నేతగా పేరుపొందారని గుర్తుచేశారు. కార్మికుల జీవితాల్లో వెలుగు నింపడానికి ఉద్యమాలను ఆయుధంగా చేసుకున్నారని కొనియాడారు. సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం కోసం చివరి వరకు కొట్లాడారని తెలిపారు. నేడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్లు – మతోన్మాద శక్తులతో కలిసిపోయి కార్మిక, రైతు, ప్రజా వ్యతిరేక విధానాలను అమలు చేస్తున్నాయని విమర్శించారు. నయా ఉదారవాద విధానాలకు మతోన్మాదం తోడై కార్మికవర్గ ఐక్యతను విచ్చిన్నం చేస్తున్నదని వాపోయారు. ఈ పరిస్థితుల్లో మతోన్మాదానికి వ్యతిరేకంగా పోరాడటమే పర్సాకు ఇచ్చే నిజమైన నివాళి అన్నారు. ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ ఆయన నిరాడంబర జీవితాన్ని గడిపారని గుర్తుచేశారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్వీ. రమ మాట్లాడుతూ గని కార్మికుల జీవితాల్లో మార్పు కోసం చేసిన పోరాటాల్లో పర్సా తన ఉద్యోగాన్ని సైతం కోల్పోయారన్నారు. ఆయన నిరంతర అధ్యయనశీలి అనీ, విషయాన్ని ఇతరులకు అర్ధమయ్యే రీతిలో చెప్పటంలో దిట్ట అని చెప్పారు. ఆయన ఆశయాల్ని ముందుకు తీసుకు పోవడానికి మరింత పట్టుదలతో కృషి చేయాలన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఆఫీస్‌బేరర్లు కె. ఈశ్వర్‌రావు, పి. శ్రీకాంత్‌, కూరపాటి రమేష్‌, రాష్ట్ర కమిటీ సభ్యులు ఆర్‌. కోటంరాజు, ఎస్‌ఎస్‌ఆర్‌ఎ ప్రసాద్‌, యాటల సోమన్న, పి. సుధాకర్‌, ఎ. సునీత తదితరులు పర్సా చిత్రపటానికి శ్రద్ధాంజలి ఘటించారు.

Spread the love