– వెబ్‌స్టార్ వర్సిటీ ప్రెసిడెంట్ జులియన్ షూస్టర్
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భారత్‌తో భాగస్వామ్యం మరింత బలోపేతం కావాల్సిన అవసరముందని అమెరికాకు చెందిన ప్రతిష్టాత్మక వెబ్‌స్టార్ విశ్వ విద్యాలయం ప్రెసిడెంట్, ప్రముఖ ఆర్థికవేత్త జులియన్ షుస్టర్ చెప్పారు. మంగళవారం హైదరా బాద్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ భారత్, తెలంగాణకు చెందిన విద్యార్థులు గతంలో ఎక్కువ మంది చదివే వారని చెప్పారు. మిస్సోరి, టెక్సాస్ ప్రాంగణాల్లో సైన్స్, టెక్నాలజీ, ఇంజినీరింగ్, మ్యాథ్స్ (స్టెమ్), బిజినెస్ కోర్సులను 16 నుంచి 18 నెలల్లో పూర్తి చేయొచ్చని సూచించారు. అమెరికాలో ఉన్నత ప్రమాణాలతో ఉన్న వర్సిటీల్లో చదవాలనుకునే భారతీయ విద్యార్థులు చేరొచ్చని కోరారు. ఉత్తమ ప్రతిభ ఉన్న భారతీయ విద్యార్థులకు అమెరికాలోని వర్సిటీల్లో చదివేందుకు అవకాశముందని వివరించారు. పట్టభద్రులను తయారు చేయడమే కాకుండా వారిని ఉద్యోగులుగా తీర్చిదిద్దే అనేక కోర్సులున్నాయని చెప్పారు. భవిష్యత్తులో పరిశ్రమకు అవసరమైన కోర్సులను అందుబాటులో ఉంచామని అన్నారు. తమ వర్సిటీలో చదివే విద్యార్థులకు అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో అంతర్జాతీయ స్టూడెంట్ ఎన్‌రోల్‌మెంట్ వైస్ ప్రెసిడెంట్ సామ్రాట్ రారు చౌదరి తదితరులు పాల్గొన్నారు.