బైడెన్ గెలవడం కష్టమే.. పార్టీ ఫండ్‌రైజర్‌ క్లూనీ

నవతెలంగాణ – వాషింగ్టన్‌: అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డెమోక్రాటిక్‌ పార్టీ అభ్యర్థి జో బైడెన్‌కు స్వపక్షం నుంచి రోజురోజుకీ వ్యతిరేకత ఎక్కువవుతోంది. పార్టీతో సుదీర్ఘకాలంగా అనుబంధం ఉన్న ప్రముఖ హాలీవుడ్‌ నటుడు, దర్శకుడు జార్జ్‌ క్లూనీ సైతం తాజాగా బైడెన్‌ పోటీపై పెదవివిరిచారు. ఆయనతో ఎన్నికలకు వెళ్తే గెలవడం కష్టమని అభిప్రాయం వ్యక్తం చేశాడు. అదే జరిగితే డెమోక్రాటిక్‌ పార్టీ అటు ప్రతినిధుల సభతో పాటు సెనేట్‌లోనూ మెజారిటీ కోల్పోతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆ పార్టీకి పెద్దఎత్తున విరాళాలు సమకూర్చుతున్న వారిలో క్లూనీ ఒకరు కావడం గమనార్హం. అలాగే ఆయనకు బైడెన్‌తో  సుదీర్ఘకాలంగా సన్నిహిత సంబంధాలు కూడా ఉన్నాయి. ‘ఈ అధ్యక్షుడితో మనం నవంబరు ఎన్నికల్లో గెలవలేము. పైగా ప్రతినిధుల సభ, సెనేట్‌లోనూ ఓడిపోబోతున్నాం. ఇది నా ఒక్కడి అభిప్రాయం కాదు. ప్రతీ చట్ట సభ్యుడు, గవర్నర్‌ ఇదే భావిస్తున్నారు. గతంలో ఉన్న ఉత్సాహం ప్రస్తుతం బైడెన్ లో కనిపించడం లేదని అన్నారు. రిపబ్లికన్ అభ్యర్థి ట్రంప్‌తో సంవాదంలో అందరూ చూసిన వ్యక్తినే తామూ చూశామని స్పష్టం చేశారు.

Spread the love