– ఫైనల్లో తెలంగాణ బాక్సర్
– లవ్లీనా, నీతూ, స్వీటీ సైతం..
– కనీసం 4 రజతాలు ఖాయం
– ప్రపంచ బాక్సింగ్ చాంపియన్‌షిప్స్
నవతెలంగాణ-న్యూఢిల్లీ
ఐబీఏ ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో భారత్ కనీసం నాలుగు రజత పతకాలు ఖాయం చేసుకుంది. న్యూఢిల్లీలోని ఇంధిరాగాంధీ ఇండోర్ స్టేడియంలో గురువారం జరిగిన ఐబీఏ వరల్డ్ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్స్ సెమీఫైనల్స్‌లో నలుగురు భారత బాక్సర్లు సత్తా చాటారు. నీతూ (48 కేజీలు), నిఖత్ జరీన్ (50 కేజీలు), లవ్లీనా బొర్గొహైన్ (75 కేజీలు), స్వీటీ (81 కేజీలు) సెమీఫైనల్స్‌లో పదునైన పంచ్‌లు విసిరారు. ఫైనల్లోకి ప్రవేశించి.. కనీసం రజత పతకం ఖాయం చేసుకున్నారు. ఎదురులేని నిఖత్ జరీన్ : నాకౌట్ విజయాలతో నిరుడు ప్రపంచ చాంపియన్, కామన్‌వెల్త్ చాంపియన్‌గా నిలిచిన నిఖత జరీన్.. ప్రపంచ మహిళల బాక్సింగ్ చాంపియన్‌షిప్స్‌లో అదే జోరు చూపిస్తోంది. పదునైన, చురుకైన, తెలివైన, వేగవంతమైన పంచ్‌లతో ప్రత్యర్థులను ఉక్కిరి బిక్కిరి చేస్తోంది. గురువారం జరిగిన మహిళల 50 కేజీల సెమీఫైనల్లోనూ నిఖత్ జరీన్ 5-0తో విజయం సాధించింది. కొలంబియా బాక్సర్ ఇంగ్రిట్ వెలాన్సియను చిత్తు చేసిన నిఖత్ జరీన్ అంచనాలను నిజం చేస్తూ పసిడి పోరుకు చేరుకుంది. మూడు రౌండ్లలోనూ వాలెన్సియపై తిరుగులేని ఆధిపత్యం చాటిన నిఖత్ ఐదుగురు న్యాయమూర్తుల ఏకగ్రీవ విజేతగా నిలిచింది. ఇక మహిళల 48 కేజీల విభాగంలో యువ చాంపియన్ నీతూ అదరగొట్టింది. దిమ్మదిరిగే పంచ్‌లతో ప్రత్యర్థులను హడలెత్తించి, రిఫరీలు మ్యాచ్‌ను నిలిపివేసి తనను విజేతగా ప్రకటించటం నీతూకు పరిపాటిగా వస్తోంది. కానీ సెమీఫైనల్లో నీతూ భిన్నమైన పోటీ ఎదుర్కొంది. 5-2తో కజకిస్థాన్ బాక్సర్‌ను ఓడించి ఫైనల్లోకి ప్రవేశించింది. టోక్యో ఒలింపిక్స్ మెడలిస్ట్ లవ్లీనా బొర్గొహైన్ సైతం సెమీఫైనల్లో సత్తా చాటింది. చైనా బాక్సర్ లీ క్వియాన్‌పై 4-1తో గెలుపొందింది. ఈ టోర్నీలో కొత్త విభాగంలో పోటీపడుతున్న లవ్లీనా బొర్గొహైన్ గొప్పగా రాణించింది. చైనా బాక్సర్‌ను చిత్తు చేసి ఫైనల్స్‌కు చేరుకుంది. 81 కేజీల విభాగంలో స్వీటీ సైతం చెలరేగింది. ఆస్ట్రేలియా బాక్సర్‌పై 4-3తో పైచేయి సాధించింది. కానీ చివరి రౌండ్లో ఆధిపత్యం చూపిన స్వీటీ ఫైనల్స్ బెర్త్‌ను ఎగరేసుకుపోయింది.