లోక్‌సభలో వ్యక్తిగత డేటా బిల్లు ఆమోదం

–  మరో నాలుగు బిల్లులు కూడా…
– కొనసాగిన ప్రతిపక్షాల ఆందోళన
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
లోక్‌సభలో ప్రతిపక్షాల ఆందోళన మధ్యే ఐదు బిల్లులు ఆమోదం పొందాయి. సోమవారం లోక్‌సభ ప్రారంభం కాగానే మణిపూర్‌పై ప్రతిపక్షాలు ప్లకార్డులు చేబూని ఆందోళన చేపట్టారు. నినాదాల హౌరెత్తించారు. అలాగే అధికార పక్షనేతలు కూడా నినాదాలు ఇచ్చారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది. అధికార, ప్రతిపక్షాల నినాదాల మధ్యే స్పీకర్‌ ఓం బిర్లా ప్రశ్నోత్తరాలు నిర్వహించారు. అయితే గందరగోళం కొనసాగడంతో రెండు నిమిషాల్లోనే సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ప్రతిపక్షాలు తమ ఆందోళన కూడా కొనసాగింది. మరోవైపు స్పీకర్‌ చైర్‌లో ఉన్న ప్యానెల్‌ స్పీకర్‌ కీర్తి ప్రేమ్‌జీ సోలంకి బీజేపీ ఎంపీ నిషికాంత్‌ దుబే అవకాశం ఇచ్చారు. ఆయన న్యూస్‌ క్లిక్‌ సంస్థ, కాంగ్రెస్‌, చైనా వంటి నిరూపితంకాని, ఆధారాలు లేని న్యూయార్క్‌ టైమ్స్‌ రాసిన కథనం గురించి లేవనెత్తారు. వెంటనే అధికార పక్ష ఎంపీలు లేచి నినాదాలు, అరుపులతో తీవ్ర గందరగోళాన్ని సృష్టించారు. వెంటనే మూడు నిమిషాల్లోనే సభను మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేశారు. వరుసగా ఐదు బిల్లులను ఆమోదించుకున్నారు. ఇందులో కీలకమైన డిజిటల్‌ పర్సనల్‌ డేటా ప్రొటెక్షన్‌ బిల్లుతో పాటు తీర ఆక్వాకల్చర్‌ అథారిటీ (సవరణ) బిల్లు, అనుసంధన్‌ నేషనల్‌ రీసెర్చ్‌ ఫౌండేషన్‌ బిల్లు, ఫార్మసీ (సవరణ) బిల్లు, మధ్యవర్తిత్వ బిల్లులను మూజువాణి ఓటుతో ఆమోదించారు. మరోవైపు రాజ్యసభలో మణిపూర్‌ కాలిపోతుందని ప్రతిపక్షాలు లేవనెత్తాయి. అలాగే మణిపూర్‌పై చర్చ జరగాలని ప్రతిపక్షాలు నినదించాయి. దీంతో ప్రారంభం అయిన 14 నిమిషాల్లోనే సభను మధ్యాహ్నం 2 గంటలకు చైర్మెన్‌ జగదీప్‌ ధన్కర్‌ వాయిదా వేశారు. తిరిగి ప్రారంభమైన సభలో ఢిల్లీ పౌరు సేవల సవరణ బిల్లుపై చర్చ జరిగింది. బిల్లు ఆమోదం పొందింది.

Spread the love