– లోక్‌సభలో ఎనిమిది గంటలపాటు చర్చ..
– బిల్లును స్వాగతిస్తున్నాం.. తక్షణమే అమలు చేయాలి: ప్రతిపక్షాల డిమాండ్
– ఓటింగ్‌లో అనుకూలంగా 454 ఓట్లు.. వ్యతిరేకంగా ఇద్దరు
– కొత్త పార్లమెంట్‌లో ఆమోదం పొందిన తొలి బిల్లు
– నేడు రాజ్యసభ ముందుకు…
న్యూఢిల్లీ: చట్టసభల్లో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉద్దేశించిన మహిళా రిజర్వేషన్ బిల్లు లోక్‌సభలో ఆమోదం పొందింది. నారీ శక్తి వందన్ అధినియమ్ పేరుతో ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ సెప్టెంబర్ 19న ప్రవేశపెట్టగా.. బుధవారం దీనిపై చర్చ జరిగింది. దాదాపు ఎనిమిది గంటలపాటు చర్చ అనంతరం.. న్యాయశాఖ మంత్రి తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. అనంతరం ఓటింగ్ నిర్వహించారు. 454 మంది ఎంపీలు అనుకూలంగా.. ఇద్దరు వ్యతిరేకంగా ఓటేశారు. దీంతో చారిత్రాత్మక బిల్లుకు లోక్‌సభ ఆమోదం తెలిపినట్లయింది.
మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్..
మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్ నిర్వహించారు. ఎరుపు, ఆకుపచ్చ స్లిప్పులను సభ్యులందరికీ అందజేశారు. అనంతరం ఓటింగ్ జరిగే ప్రక్రియపై లోకసభ సెక్రటరీ జనరల్ వారికి వివరించారు. బిల్లుకు మద్దతు తెలిపినట్లయితే ‘ఎస్’ అని ఆకుపచ్చ స్లిప్పుపై రాయాలి. వ్యతిరేకిస్తే ఎరుపు స్లిప్పుపై ‘నో’ అని రాయాలని చెప్పారు. అనంతరం ఓటింగ్ నిర్వహించారు. రాజ్యాంగ సవరణ కూడా ఉండటంతో మాన్యువల్ పద్ధతిలో ఓటింగ్ చేపట్టారు. ఓటింగ్‌కు కొద్దిసేపటి ముందు ప్రధాని మోడీ సభలోకి వచ్చారు.
మహిళా బిల్లుపై ఆయా పార్టీల అభిప్రాయాలు…
బీజేపీ అధికారంలో ఉన్న 16 రాష్ట్రాల్లో ఒక్క మహిళ సీఎం లేరు:టీఎంసీ ఎంపీ కకోలి ఘోష్ దోస్తిదార్
టీఎంసీ ఎంపీ కకోలి ఘోష్ దోస్తిదార్ మాట్లాడుతూ ”16 రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలో ఉన్నప్పటికీ, ఒక్క రాష్ట్రంలో కూడా మహిళా సీఎం లేరు. మహిళా సీఎం ఉన్న ఏకైక రాష్ట్రం బెంగాల్” అని అన్నారు. కేంద్రంలో బీజేపీ తొమ్మిదేండ్లుగా అధికారంలో ఉందని, రెండోసారి అధికారంలోకి వచ్చిన చివరి సంవత్సరంలో మహిళా రిజర్వేషన్ బిల్లును తీసుకురావాలని ఆలోచిస్తున్నట్టు చెప్పారు.
”వారికి ఇంత సమయం పట్టిందేమిటి? 2014లో ఈ బిల్లు ఎందుకు తీసుకురాలేదు? ఎన్నికల ముందు ఎందుకు? ప్రజలకు ఏమి చెప్పాలని ప్రయత్నిస్తున్నారు?” అని ఆమె ప్రశ్నించారు. మహిళా రిజర్వేషన్ బిల్లు ఒక బూటకమని టీఎంసీ ఎంపీ మహువా మొయిత్రా మండిపడ్డారు. ”మహిళా రిజర్వేషన్ల చట్టబద్ధంగా నిర్దేశించిన వాయిదాపై చర్య తీసుకోవలసిన అవసరం లేదు. ఈ బిల్లు అమలులోకి వస్తే ప్రభుత్వం 33 శాతం మంది మహిళలను పంపాల్సిన అవసరం ఉంది. ఈరోజే ఈ బిల్లును అమలులోకి తీసుకురావాలి” అని అన్నారు.
ఓబీసీ, మైనార్టీ, ఎస్‌సీ, ఎస్‌టీ సబ్ కోటా పెట్టాలి: సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్
మహిళా రిజర్వేషన్ బిల్లు కింద ఓబీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీలకు సబ్ కోటాను ప్రవేశపెట్టాలని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ డింపుల్ యాదవ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ”విప్లవం లేకుండా, పరిణామం సాధ్యం కాదు, మన దేశంలో పరిణామం జరగాలంటే, ఓబీసీ, ఎస్‌సీ, ఎస్‌టీ, మైనారిటీల మహిళలకు రిజర్వేషన్లు పొందడం చాలా ముఖ్యం” అని ఆమె అన్నారు.
సంతోషంగా ఉంది : బీఆర్‌ఎస్ ఎంపీ మాలోతు కవిత
ప్రతిష్టాత్మకంగా మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం తనకు సంతోషంగా ఉందని బీఆర్‌ఎస్ ఎంపీ మాలోతు కవిత అన్నారు. ఈ బిల్లులో భాగస్వామ్యం కావడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. దేశం వ్యాప్తంగా హర్షం వ్యక్తం అవుతున్నప్పటికీ, అమలు తీరులో తీసుకున్న నిర్ణయం పట్ల మహిళా లోకం కొంత అసంతృప్తితో ఉందని పేర్కొన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకొని అమలు చేయాలని కోరారు.
మహిళా రిజర్వేషన్ బిల్లు ‘జుమ్లా’ : జేడీయూ ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్
మహిళా రిజర్వేషన్ బిల్లును ప్రవేశపెట్టడం కేంద్ర ప్రభుత్వం ”జుమ్లా” అని జేడీయూ ఎంపీ రాజీవ్ రంజన్ సింగ్ అన్నారు. ”మహిళా సాధికారతపై మాకు నమ్మకం ఉన్నందున మా పార్టీ జేడీయూ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతు ఇస్తుంది. . అయితే, ఈ బిల్లు భారత కూటమి ఏర్పాటుపై తీవ్ర భయాందోళనకు గురిచేస్తోంది. ఈ బిల్లు 2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఇదొక జుమ్లా” అని విమర్శించారు.
ఏకాభిప్రాయంతో ఆమోదించాలి : కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్
కేంద్ర న్యాయ శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ మాట్లాడుతూ పార్లమెంట్‌తో పాటు అసెంబ్లీలోనూ మహిళలకు రిజర్వేషన్లు వర్తిస్తాయని అన్నారు. మహిళా రిజర్వేషన్ చట్టంతో మహిళా సాధికారత సాధ్యమవుతుందని, మహిళల గౌరవం పెరగడంతో పాటు వారికి సమాన అవకాశాలు వస్తాయని పేర్కొన్నారు. 15 ఏండ్ల పాటు ఈ రిజర్వేషన్ అమల్లో ఉంటాయని తెలిపారు. మన్మోహన్ సింగ్ హయంలో బిల్లు తెచ్చి రాజ్యసభలో ఆమోదం పొందిందని, ఏకాభిప్రాయంతో బిల్లును ఆమోదించాలని అన్నారు.
అమిత్ షా జోక్యం
మహిళా రిజర్వేషన్ బిల్లుపై బీజేపీ ఎంపీ నిషికాంత్ డూబే మాట్లాడుతుండగా ఆయన ప్రసంగానికి కాంగ్రెస్ పక్షనేత అధీర్ రంజన్ చౌదరి అంతరాయం కలిగించారు. దీంతో హౌం మంత్రి అమిత్ షా జోక్యం చేసుకుని ”మహిళ ల తరఫున పురుషులు మాట్లాడకూడదా?” అని ప్రశ్నించారు. తొలుత ప్రసంగించే అవకాశం రాకపోవడంతో ఆయన అసూయ పడుతున్నట్టు కనిపిస్తోదంటూ ఛలోక్తులు విసిరారు.
‘నారీ శక్తి వందన్ అధినియం’పై కాంగ్రెస్ నేత సోనియాగాంధీ మాట్లాడిన అనంతరం బీజేపీ ఎంపీ నిశి కాంత్ దూబే ప్రసంగించేందుకు నిలబడ్డారు. ఆ వెంటనే మహిళా రిజర్వేషన్ బిల్లుపై మాట్లాడేందుకు ప్రభుత్వం ఒక మహిళా ఎంపీని నామినేట్ చేయాలని అధీర్ రంజన్, ఇతర ప్రతిపక్ష ఎంపీలు డిమాండ్ చేశారు. దీంతో సభలో కొద్దిసేపు గందరగోళం తలెత్తింది. దీంతో అమిత్‌షా జోక్యం చేసుకున్నారు.
కేంద్ర, మహిళా శిశు అభివద్ధి శాఖ మంత్రి స్మృతి ఇరానీ మాట్లాడుతూ మహిళా రిజర్వేషన్ బిల్లుపై ప్రధాని తమతో చర్చించినా ప్రతిపక్షాలు అంగీకరించాయని అన్నారు. ”ఈ రోజు, దీనిని జుమ్లా అని పిలిచేవారు. దాని కోసం అనేక లేఖలు రాసినందున ఇది జరిగిందని చెప్పారు.
బిల్లును వ్యతిరేకించిన అసదుద్దీన్ ఓవైసీ
మహిళా రిజర్వేషన్ బిల్లును తమ పార్టీ వ్యతిరేకి స్తుందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ అన్నారు. ఆ బిల్లులో కొన్ని ప్రధాన లోపాలున్నాయని అన్నారు. ఈ బిల్లులో ముస్లిం, ఓబీసీ వర్గాల మహిళల కోటాను చేర్చలేదని విమర్శించారు. ఈ బిల్లు యాంటీ బీసీ, యాంటీ ముస్లిం అని విమర్శించారు.
బీసీ లు న్యాయమైన వాటాను ఈ బిల్లు నిరాకరిస్తుందని, కేవలం ధనవంతులే చట్టసభల్లో ఉండేలా ఈ బిల్లు పెట్టారని దుయ్యబట్టారు. మహిళా రిజర్వే షన్ బిల్లులో బీసీ, ముస్లిం మహిళలకు రిజర్వేషన్ కల్పించాలని కోరారు.