అదే ర‌కంపై మ‌క్కు‌వ‌..!

– ఒకే కంపెనీ విత్తనాల కోసం రైతుల పట్టు
– అధిక ధరలకు బ్లాక్‌లో విక్రయిస్తున్నారని ఆరోపణ
– ఇతర రకాలపై అన్నదాతల్లో కనిపించని నమ్మకం
– అవగాహన కల్పించడంలోనూ అధికారుల వైఫల్యం
గతేడాది బాగా దిగుబడి వచ్చింది..ఈ ఏడాది సైతం అదే కంపెనీ రకం విత్తనాలు కావాలి. ఇతర రకాలు విత్తుతే మొలకెత్తుతాయో లేదో.. అందుకని అదే రకం విత్తనం వేస్తేనే బాగుంటుంది.. అవే కావాలి.. ఇదీ రైతుల నుంచి వినిపిస్తున్న మాటలు. కానీ మార్కెట్‌లో వారు కోరిన విత్తనాలు సరిపడా లేకపోవడం.. వాటితో పాటు ఇతర రకాల విత్తనాలు కూడా అంటగడుతుండటం..వాటిపై అన్నదాతలకు నమ్మకం లేకపోవడం వారిలో ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యేందుకు కారణమవుతోంది. గత నాలుగు రోజులుగా ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో జరుగుతున్న పరిణామాలతో సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. మాడ పగిలేలా ఎండలు దంచి కొడుతున్నా.. పట్టువీడకుండా గంటల తరబడి విత్తనాల కోసం వరుసలో నిలబడుతున్నారు. రెండు రోజుల క్రితం భారీగా రైతులు జిల్లా కేంద్రానికి తరలిరావడంతో పోలీసులు, రైతుల మద్య స్వల్ప తోపులాట చోటుచేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా గురువారం సైతం రైతులు విత్తన దుకాణాల ముందు బారులు తీరడం పరిస్థితి తీవ్రతకు అద్ధం పడుతోంది.
నవతెలంగాణ- ఆదిలాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి
ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో విత్తనాల సమస్య తీరడం లేదు. గత నాలుగు రోజులుగా విత్తనాల కోసం రైతులు బారులు తీరుతున్న వ్యవహారం రాష్ట్రవ్యాప్త చర్చకు దారితీస్తోంది. అధికార, ప్రతిపక్ష పార్టీల మద్య చిచ్చు రేపుతోంది. ఖరీఫ్‌ సీజన్‌ సమీపించడంతో విత్తనాల సమస్య సర్వత్రా చర్చనీయాంశంగా మారుతోంది. ఒకే కంపెనీకి సంబంధించిన విత్తనాలు కావాలని రైతులు పట్టుబట్టడం.. ఈ రకం విత్తనాలు పూర్తిస్థాయిలో అందుబాటులో లేకపోవడం సమస్యగా మారుతోంది. జిల్లాకు సుమారు 2లక్షల ప్యాకెట్లు రాగా.. ఇప్పటికే చాలా వరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఈ రకం కంపెనీ విత్తనాలు తక్కువగా ఉండటంతో అదే అదనుగా భావిస్తున్న విత్తన దుకాణాలు రైతులు మక్కువ చూపిస్తున్న రకం విత్తనాలు రెండు బ్యాగులతో పాటు ఇతర రకాలు మరో నాలుగింటిని అంటగడుతున్నట్లు తెలుస్తోంది. మరోపక్క రైతులు కోరిన విత్తనాలకు డిమాండ్‌ పెరగడంతో కొందరు డీలర్లు అధిక ధరలకు బ్లాక్‌లో విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. తొలినాళ్లలో మహారాష్ట్ర రైతులకు వీటిని అధిక ధరలకు విక్రయించడం కూడా విత్తన కొరతకు కారణమైందనే వాదనలు వినిపిస్తున్నాయి. మరోపక్క ఇతర కంపెనీలకు చెందిన పత్తి విత్తనాలు కూడా ఉన్నా.. రైతులకు వాటిపై నమ్మకం లేకపోవడం కూడా సమస్యగా మారుతోంది. ఎందుకంటే ఇటీవల జిల్లా కేంద్రంలో కొన్ని కంపెనీల పేరిట నకిలీ విత్తనాలు విక్రయించడం అవి అధికారులకు పట్టుబడటంతో రైతులు ఆందోళన చెందారు. ఏవి నకిలీవి..ఏవి నిజమైనవో తెలియని పరిస్థితిలో ఉన్న రైతులు వారు మక్కువ చూపించిన రకం విత్తనాలు మాత్రమే కావాలని పట్టుబట్టేందుకు కారణమవుతున్నట్లు తెలుస్తోంది.
అవగాహన లోపం..అధికారుల వైఫల్యం..!
ఖరీఫ్‌ సీజన్‌ ముంచుకొస్తున్న తరుణంలో ముందే అధికారులు ఆయా మేలు రకం విత్తనాలపై రైతులకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంటుంది. ప్రత్యేకంగా జిల్లావ్యాప్తంగా క్లస్టర్ల వారీగా ఏఈఓలు కూడా అందుబాటులో ఉన్నారు. విత్తన కొనుగోలు కంటే ముందుగానే అధికారులు క్లస్టర్ల వారీగా సమావేశాలు ఏర్పాటుచేసి రైతులకు ఆయా మేలు రకం విత్తనాలపై అవగాహన..చైతన్యం కల్పించి ఉంటే ఈ సమస్య రాకపోయేదనే వాదన వినిపిస్తోంది. ప్రస్తుతం మార్కెట్‌లో రైతుల కోరిన విత్తనాలతో పాటు వివిధ కంపెనీలకు చెందిన మేలు రకాల విత్తనాలు కూడా అందుబాటులో ఉన్నాయి. కానీ రైతులకు వాటిపై అవగాహన లేకపోవడం కారణంగా వాటి వైపు మొగ్గుచూపడం లేదని తెలుస్తోంది. అధికారులు పట్టించుకోకపోవడం..ఆయా కంపెనీల విత్తనాలపై రైతులకు నమ్మకం లేకపోవడం కారణంగా ఈ సమస్య ఉత్పన్నమైనట్లు తెలుస్తోంది. రైతులు అందోళన చేసే వరకు వ్యవసాయశాఖ అధికారులు ఏయే దుకాణాల్లో ఎన్ని విత్తన ప్యాకెట్లు ఉన్నాయో కూడా పేర్కొనలేదు. రైతులు విత్తనాల కోసం బారులు తీరడం.. తోపులాట వంటి సంఘటన జరగడంతో మేల్కొన్న అధికారులు ప్రాంతాలు, దుకాణాల వారీగా విత్తన ప్యాకెట్ల వివరాలను బహిర్గతం చేశారనే అభిప్రాయం ఉంది. తాజాగా జిల్లా ఉన్నతాధికారులు ఈ సమస్యపై దృష్టిసారించినట్లు తెలిసింది. రైతులు మక్కువ చూపిస్తున్న సంబంధిత విత్తన కంపెనీ అధికారులతో మాట్లాడి జిల్లాకు మరో 50వేల ప్యాకెట్లు అధనంగా పంపించేలా ఏర్పాట్లు చేసినట్లు తెలిసింది.

రైతుల కోరిన విత్తనాలు తెప్పించాలి : బండి దత్తాత్రి, రైతు సంఘం నాయకుడు
ప్రభుత్వం విత్తనాల సమస్యపై వెంటనే దృష్టిసారించాలి. జిల్లా రైతులు కోరిన విత్తనాలను సరఫరా చేసేలా చర్యలు చేపట్టాలి. విత్తనాలను అధిక ధరలకు బ్లాక్‌లో విక్రయించకుండా అధికారులు దృష్టిసారించాలి. ప్రభుత్వం, ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని విత్తన కొరత సమస్యను వెంటనే పరిష్కరించి రైతులకు సరిపడా విత్తనాలు అందుబాటులోకి తీసుకురావాలి.

Spread the love