విప్ల‌వ ప‌థ‌గామి

భరతమాత స్వేచ్ఛకోరకు సమరగీతమైనవాడు
పీడిత జన విముక్తికి మార్క్సిజమై భాసిల్లినవాడు అరుణోదయాలను తన చూపుడు వేలితో ఈ నేల నలు చెరుగులకూ నడిపించినవాడు
సుందరయ్య కేవలం కాదొక పేరు.. ఈ దేశ విముక్తి పోరు. అతడొక కార్యకర్త, వ్యూహకర్త, గెరిల్లా యోధుడు, ఉద్యమకారుడు, యుధ్ధనిపుణుడు, ప్రజానాయకుడు, పాలనాదక్షుడు, కవి, రచయిత, కళాకారుడు, మేధావి,… ఇలా అనేకుడు. మంచి కమ్యూనిస్టు ఎలా ఉండాలో తెలుసుకోవడానికి మనం లీషావ్‌చీ పుస్తకం చదువుతాం. కానీ అసంఖ్యాకులైన శ్రామిక ప్రజలు సుందరయ్యను చూసి తెలుసుకుంటారు. అంతటి అత్యున్నత కమ్యూనిస్టు దిగ్గజమతడు.
”సుందరయ్య కమ్యూనిస్టుగా మారి ఉండకపోతే ఏం జరిగేది..?” అన్న ప్రశ్న ఆ రోజుల్లో చాలా పత్రికల్లో చాలా సందర్భాల్లో పతాకశీర్షిక! ఆ ప్రశ్నకు సమాధానం కూడా వారే రాసేవారు. ”భారత ప్రధాని అయ్యుండేవాడు.. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి అయ్యుండేవాడు.. లేదా అఖిల భారత కాంగ్రెస్‌కు అధినేత అయ్యుండేవాడు” అని. అది నిజమే అయ్యుండవచ్చు… (అప్పట్లోనే ఆయన ఎ.ఐ.సి.సి సభ్యుడు) కానీ దానికి ఆ తరువాత సుందరయ్యే చక్కని వివరణ ఇచ్చాడు. ఏమనీ..? ”సుందరయ్య కమ్యూనిస్టు అయ్యుండకపోతే ఏం జరిగేదంటే… ఆరోజు కాకపోతే మరుసటిరోజో ఆ మరుసటిరోజో తప్పకుండా కమ్యూనిస్టే అయ్యుండేవాడు” అని. నిజంగానే ఆయన ప్రధానమంత్రో, ముఖ్యమంత్రో కావాలని కోరుకుంటే కావడం పెద్ద విశేషమేమీ కాదు..! కానీ ఆయన అధికారం కోరుకోలేదు. ప్రజలను కోరుకున్నాడు. దోపిడీ పీడనల నుంచీ, అసమానతలూ అణచివేతల నుంచీ భారత ప్రజల విముక్తిని కోరుకున్నాడు. అందుకే ఆయన ప్రజల హృదయాలను గెలుచుకుని ఓ చరిత్రగా నిలిచిపోయాడు.
సోవియట్‌ విప్లవ స్ఫూర్తితో ఈ దేశంలో కష్టజీవుల కోసం కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణానికి పూనుకున్నారాయన. కానీ ఏ పరిస్థితుల్లో..? ఎలాంటి రోజుల్లో..? అప్పటికి దేశంలో సోషలిజం ఓ వింత. ఆచరణ సాధ్యంకాని ఊహ. సమానత్వమన్నది ఓ కల. దున్నేవాడికే భూమి, పేదలకు భూపంపిణీ, కనీస వేతనాలు, కార్మిక హక్కులవంటివన్నీ సమాజంలో విచ్ఛిన్నకర పోకడలని భావించే కాలమది! మరోవైపు కాంగ్రెస్‌ తప్ప మరే పార్టీ ఏర్పడినా అది జాతీయోద్యమాన్ని చీల్చడానికేననే భావనలు ప్రచారంలో ఉన్న రోజులవి! అటువంటి అనేక ప్రతికూలతల మధ్య, ఆ విపత్కర పరిస్థితులను ఓ సవాలుగా తీసుకుని దేశానికో ‘విప్లవపార్టీ’ని నిర్మించారు సుందరయ్య.
ఏ కోణం నుంచి చూసినా ఆయన జీవితం శిఖర సమానమైనదిగానే దర్శనమిస్తుంది. ఆయన జీవనయానంలో అది స్వాతంత్య్ర సంగ్రామమైనా, తెలంగాణ సాయుధ పోరాటమైనా, పార్టీ నిర్మాణమైనా, పార్లమెంటరీ రాజకీయాలైనా ప్రతి దశలోనూ ఆయన ప్రజలతో మమేకమైన తీరు మనలను ఉత్తేజపరుస్తుంది. అతని ఔన్నత్యం హిమగిరి శిఖరం… అతని ఆలోచన అనంత సాగరం.. ఆయన జీవితమే ఓ విప్లవ సందేశం. అయితే కేవలం నిరాడంబర జీవనశైలో, నిబధ్ధతతో కూడిన అతని పోరాట పటిమో, లేక ఆయనలోని సుగుణాలో మాత్రమే సుందరయ్యను అంతటి మహోన్నతుడిని చేయలేదు.. ఈ దేశానికి కమ్యూనిస్టు చైతన్యం అవసరమైన వేళ.. ఆ చారిత్రక సందర్భం రూపుదిద్దింది సుందరయ్యను. చరిత్ర మనకు అనేక అవకాశాలను అందిస్తుంది. వాటిని అందిపుచ్చుకుని తదనుగుణంగా తమను తాము నిర్మించుకోవడమే విప్లవకారుల లక్షణం. సుందరయ్య చేసిందీ, ఆయన జీవితం నుంచి నేర్చుకోవాల్సిందీ అదే.
సమాజ గమనంలో ఓ సంపూర్ణ మానవుణ్ణి కలగన్నాడు సుందరయ్య. ఆ కల సాకారానికి తల్లీ తండ్రీ, ఇల్లూ వాకిలీ, కులం మతం, ఊరు పేరు అన్నీ వదులుకుని… అదిగో నా ఆప్తులు అంటూ ఈ భూగోళాన్ని తమ శిరస్సులపై మోస్తున్న అసంఖ్యాకమైన శ్రామికశక్తిని ఆలింగనం చేసుకున్నాడు. చీకటికి చిరునవ్వులు అద్దాడు.. ఆకలికి యుద్దం నేర్పాడు.. రేపటికి మార్గం చూపాడు.. అందుకే సరిగ్గా 38ఏండ్ల క్రితం ఇదే రోజున ఆయన ఊపిరి ఆగిపోయినప్పుడు యావత్‌ శ్రామికలోకం తల్లడిల్లింది. కానీ చరిత్రకు మరణముంటుందా? ఆశయాలకు మరణముంటుందా? సుందరయ్య ఓ ఎరుపెక్కిన చరిత్ర. ఓ ఎర్రెర్రని ఆశయం. హృదయంలో నదీ నదాలను నిక్షిప్తం చేసుకుని గుండె గుండెకూ ప్రవహించిన విరామమెరుగని ప్రయాణమతడు. ఆ ప్రయాణమెప్పుడూ సాగేదే కానీ ఆగేది కాదు. ఎందుకంటే.. విప్లవం ప్రకృతి ధర్మం.
– రాంప‌ల్లి ర‌మేష్‌

Spread the love