రోగులకు సపోర్ట్‌ సరే…మరి సిబ్బందికి సాయమేది?

– రూ.10 వేలతో పట్నంలో బతికేదెట్లా?
– బస్తీ దవాఖానాల్లో ఇబ్బంది పడుతున్న సహాయక సిబ్బంది
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
బస్తీ దవాఖానాల్లో కాంట్రాక్టు, అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన పని చేస్తున్న సపోర్టింగ్‌ స్టాఫ్‌ జీతాలు సరిపోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అరకొర జీతాలతో పట్టణాల్లో నెట్టుకురావడం కష్టంగా మారుతుండటంతో తమ జీతాలను పెంచాలని వేడుకుంటున్నారు. పెరిగిన ధరలు, ఇంటి అద్దెలు, స్కూళ్ల ఫీజులు, నెలవారీ చెల్లింపులు తదితర వాటితో సతమతమవుతున్నారు. బస్తీ దవాఖానాల ద్వారా ప్రభుత్వానికి మంచి పేరు వచ్చిందనీ, అందులో తామందించిన సేవలు కూడా కారణమని గుర్తుచేస్తున్నారు. 2018, 2019లో కాంట్రాక్టు ప్రాతిపదికన, 2020, 2021, 2022లో పొరుగుసేవల ప్రాతిపదికన సపోర్టింగ్‌ స్టాఫ్‌ను నియమించుకున్నారు. పట్టణ ప్రాంతాల్లోని బస్తీవాసులకు ప్రాథమిక వైద్యం అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ఏర్పాటు చేసిన వాటిలో ఒక మెడికల్‌ ఆఫీసర్‌, ఒక స్టాఫ్‌ నర్సు, సపోర్టింగ్‌ స్టాఫ్‌ సేవలందిస్తున్నారు. బోధనాస్పత్రులు, జిల్లా, ఏరియా ఆస్పత్రులపై భారం తగ్గించడం, చిన్న, చిన్న రోగాలకు బస్తీవాసులకు అందుబాటులోనే వైద్యమందించడం వీటి లక్ష్యం. ఢిల్లీలో అక్కడి ప్రభుత్వం నిర్వహిస్తున్న మొహల్లా క్లినిక్‌లను స్ఫూర్తిగా తీసుకుని అందుబాటులోకి తెచ్చిన బస్తీ దవాఖానాలు ఆ లక్ష్యం దిశగా పని చేస్తున్నాయి. జాతీయ పట్టణ ఆరోగ్య మిషన్‌ పథకం కింద ఏర్పాటు చేసిన ఈ బస్తీ దవాఖానాలు ప్రజలు, రోగుల నుంచి ప్రశంసలందుకుంటున్నాయి. 2018లో జీహెచ్‌ఎంసీ పరిధిలో ప్రారంభమై రాష్ట్రంలో దాదాపు 400కు విస్తరించాయి. మున్సిపాల్టీలలోని బస్తీలే కేంద్రంగా వీటిని అందుబాటులోకి తెస్తున్నారు. మరో వంద బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసి వీటి సంఖ్యను 500కు పెంచాలని సర్కారు లక్ష్యంగా పెట్టుకున్నది. తమ ప్రాంతంలో ఏర్పాటు చేయాలని పలువురు ప్రజా ప్రతినిధుల నుంచి పెద్ద ఎత్తున వినతులు వస్తున్నాయి. ప్రతి ఏడాది 50 లక్షల మంది రోగులు వీటి సేవలు పొందుతున్నట్టు గణాంకాలు చెబుతున్నాయి. పూర్తిస్థాయి సేవలందిస్తున్న అదే స్థాయిలో జీతాలు మాత్రం పెరగడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మెడికల్‌ ఆఫీసర్లకు రూ.35 వేల నుంచి రూ.52 వేలకు (రూ.17 వేలు), స్టాఫ్‌ నర్సుకు రూ.14 వేల నుంచి రూ.29,700కు (రూ.15,700) పెరిగాయి. 2018లో నియమితులైన సపోర్టింగ్‌ స్టాప్‌కు రెండేండ్లకు ఐదు శాతం ఇంక్రిమెంటులతో కలిపి 30 శాతం పీఆర్సీ ఇంక్రిమెంటు 30 శాతం ఇవ్వగా రూ.10 వేల నుంచి రూ.13 వేలకు (కేవలం రూ.3,000) మాత్రమే పెరిగింది. ఇక 2019లో చేరిన వారికి ఐదు శాతం ఇంక్రిమెంటు మంజూరు చేసి రూ.10 వేల నుంచి రూ.10,500 (కేవలం రూ.500) మాత్రమే పెంచారు. 2020, 2021, 2022లో ఉద్యోగుల్లో చేరిన వారికి వేతనాల పెరుగుదలే లేకపోవడం వారింకా రూ.10 వేలకే పని చేస్తున్నారు. వేతన పెరుగుదలకు సంబంధించి ప్రభుత్వ ఉత్తర్వులు తమకు వర్తింపజేయకపోవడం, జీవో 510తో లబ్ది జరగలేదని వాపోతున్నారు. శానిటేషన్‌ వర్కర్లకు లభించే వేతనం కూడా సపోర్టింగ్‌ స్టాఫ్‌కు ఇవ్వడం లేదని చెబుతున్నారు. అన్ని విషయాలను పరిశీలించి తమ వేతనాలు పెంచాలని వారు కోరుతున్నారు.

Spread the love