సమయ పాలన పాటించని వైద్య సిబ్బంది.. ఇబ్బందుల్లో రోగులు

నవతెలంగాణ – జయశంకర్: మండల కేంద్రమైన తాడిచెర్లలోని ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రములో వైద్యాధికారితోపాటు సిబ్బంది సమయ పాలన పాటించకపోవడంతో మండలంలోని ఆయా గ్రామాల నుంచి వైద్యం కోసం వచ్చే రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు.పల్లెల్లో అసలే విష జ్వరాలు ప్రబలడంతో కొందరు ప్రయివేటు ఆసుపత్రులను, మరికొందరు తాడిచెర్ల ప్రభుత్వ ఆరోగ్య కేంద్రానికి పరుగులు తీస్తున్నారు. ఆరోగ్య కేంద్రములో వైద్య సేవలందించాల్సిన వైద్యాధికారి,ల్యాబ్ టెక్నీషియన్, సిబ్బంది సమయ పాలన పాటించకుండా అందుబాటులో ఉండటం లేదని పలువురు ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇందుకు నిదర్శనమే బుధవారం మధ్యాహ్నం 12 గంటలు దాటిన వైద్యాధికారి,ల్యాబ్ టెక్నీషియన్ రాకపోవడమే. రోగులు అక్కడ ఉన్న సిబ్బందిని తమము పరీక్షించి మందులు ఇవ్వాలని అడుగగా వైద్యాధికారి రాలేదని,చిటి రాస్తేనే మందులు ఇస్తామని సిబ్బంది చెప్పినట్టుగా రోగులు వాపోయారు. ఆరోగ్య కేంద్రములో 24 గంటలు వైద్యాధికారి, సిబ్బంది అందుబాటులో ఉంటూ ప్రజలకు సేవాలందించాలని,లేదంటే శాఖాపరమైన చర్యలు తప్పవని ఇటీవల భూపాలపల్లి జిల్లా కలెక్టర్ భవేస్ మిశ్రా,జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ ఆదేశాలు జారీ చేసినప్పటికి,ఆదేశాలు బేఖాతర్ చేయడం గమనార్హం.

Spread the love