పట్లోళ్ల కుటుంబం ఐదుసార్లు విజయం

– నాలుగుసార్లు తండ్రి, ఒకసారి తనయుడు
– ప్రజల మన్ననలు పొందిన పట్లోళ్ల కుటుంబం
నవతెలంగాణ-నారాయణఖేడ్‌ రూరల్‌
నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో 16సార్లు ఎన్నికలు జరిగితే ఐదుసార్లు పట్లోళ్ల కుటుంబం విజయం సాధించింది. నియోజకవర్గం ప్రజలు నాలుగుసార్లు పట్లోళ్ల కిష్టారెడ్డిని ఎమ్మెల్యేగా ఎన్నుకున్నారు. 2023 ఎన్నికల్లో పట్లోళ్ల సంజీవరెడ్డి సమీప బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహారెడ్డి భూపాల్‌రెడ్డిపై 5766 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. 10 సంవత్సరాలుగా పట్లోళ్ల సంజీవరెడ్డి నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో ప్రతిపక్ష నేతగా ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. పట్లోళ్ల కిష్టారెడ్డి తనయుడిగా నారాయణఖేడ్‌ రాజకీయాల్లో సంచలనం సష్టించారు సంజీవరెడ్డి. పట్లోళ్ల కిష్టారెడ్డి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా పని చేసి సామాన్యులు, బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఎన్నో సేవలందించారు. 2015లో కిష్టారెడ్డి గుండెపోటుతో మరణించారు. 2016లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి పట్లోళ్ల సంజీవరెడ్డి ఓడిపోయారు. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి మహారెడ్డి భూపాల్‌రెడ్డి 50 వేల మెజారిటీతో గెలుపొందారు. నియోజకవర్గంలో ప్రతిపక్ష నేతగా పట్లోళ్ల సంజీవరెడ్డి ఏడు సంవత్సరాలు ప్రజల పక్షాన ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాలు చేశారు.
నిరాహార దీక్ష
సింగూర్‌ జలాలను శ్రీరామ్‌ ప్రాజెక్టుకు తరలించడంతో సింగూర్‌ జలాలను జిల్లాకు కేటాయించాలని కోరుతూ పట్లోళ్ల సంజీవరెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. చాప్టకె, నిజాంపేట్‌, రామోజీపల్లి, సిర్గాపూర్‌ గ్రామాలలో పేదల ఇండ్లు కూల్చివేతపై సంజీవరెడ్డి ప్రజలకు అండగా నిలిచారు. సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ప్రజలను చైతన్యం చేశారు. నిరంతరం ప్రజల పక్షాన నిలబడి వారికి అండగా నిలబడ్డారు.
సేవా కార్యక్రమాలు
నిరుద్యోగులకు ఉపాధి కల్పించడం కోసం పట్లోళ్ల సంజీవరెడ్డి జాబ్‌ మేళా ద్వారా 1500 మందికి ఉద్యోగాలు ఇప్పించారు. ఉచిత వైద్య శిబిరాలు నిర్వహించారు. పీకేఆర్‌ ట్రస్ట్‌ ద్వారా బ్లడ్‌ క్యాంపులు నిర్వహించారు.
కాంగ్రెస్‌లో గ్రూపు తగాదాలు
గ్రూపు రాజకీయాల వల్ల నారాయణఖేడ్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ రెండుసార్లు గెలిచే అవకాశాలను చేజార్చుకుంది. 2016లో పట్లోళ్ల కిష్టారెడ్డి తనయుడు సంజీవరెడ్డి; సురేష్‌షెట్కార్‌ల మధ్య గ్రూపు రాజకీయాలు జోరుగా సాగాయి. రాజకీయ తగాదాలతో ఇద్దరూ విడిపోవడంతో రెండు పర్యాలు కాంగ్రెస్‌ విజయం సాధించలేకపోయింది. 2023లో కార్యకర్తల అభిప్రాయంతో ఇద్దరూ కలవడంతో ఈ ఎన్నికల్లో అఖండ విజయం సాధించారు.
ప్రజా సేవకే జీవితం అంకితం
భారీ మెజార్టీతో గెలిపించిన ప్రజలకు ఎళ్లవేళలా అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరించడానికి కృషి చేస్తానని ఎమ్మెల్యే పట్లోళ్ల సంజీవరెడ్డి తెలిపారు. ప్రజా సేవకే తన జీవితం అంకితమన్నారు. యువతకు ఉపాధి కల్పనకు కృషి చేస్తానని తెలిపారు. కాంగ్రెస్‌ ఇచ్చిన ఆరుగ్యాంటీలను అందిరికీ అమలు చేస్తామన్నారు. స్థానిక సమస్యలను పరిష్కరిస్తామన్నారు.

పేరు: డాక్టర్‌ పట్లోళ్ల సంజీవరెడ్డి
జననం: 14-05-1963
తల్లిదండ్రులు: మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల కిష్టారెడ్డి, గాలెమ్మ
భార్య: అనుపమ సంజీవ రెడ్డి
చదువు: ఎంబీబీఎస్‌
వత్తి: డాక్టరు
రాజకీయ ప్రస్థానం: 2006 కాంగ్రెస్‌ జెడ్పీటీసీగా ఎన్నికై 2014 వరకు సేవలందించారు. 2014 నుండి 2018 వరకు ఎంపీపీగా పని చేశారు. 2016లో ఉప ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2018 సాధారణ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. 2023 సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్‌ ఎమ్మెల్యేగా విజయం సాధించారు. ఈ ఎన్నికల్లో 5,766 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

Spread the love