నవతెలంగాణ-హైదరాబాద్: తెలంగాణ డ్రైవర్లూ… ఏపీ వారిపై మానవత్వం చూపండని ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ విజ్ఞప్తి చేశారు. ఉమ్మడి రాజధాని గడువు తీరగానే హైదరాబాద్‌లో ఉండకూడదంటూ తెలంగాణవారు అడ్డుకుంటున్నట్లుగా తెలిసిందని, ఇది సరికాదన్నారు. ఇది రెండువేల కుటుంబాలకు సంబంధించిన అంశమన్నారు. ఏపీలో రాజధాని పనులు ప్రారంభం కాగానే ఇక్కడి డ్రైవర్లకు ఉపాధి మెరుగవుతుందని ఆకాంక్షించారు. అప్పటి వరకు సాటి ఏపీ డ్రైవర్లపై మానవతా దృక్పథంతో చూడాలని విజ్ఞప్తి చేశారు. పవన్ కల్యాణ్ మంగళగిరిలోని జనసేన పార్టీ కేంద్ర కార్యాలయంలో ప్రజల నుంచి అర్జీలు తీసుకున్నారు. ఆలిండియా పర్మిట్‌తో తెలంగాణ తాత్కాలిక పర్మిట్ తీసుకొని క్యాబ్‌లు నడుపుతున్న తమను తెలంగాణ డ్రైవర్లు అడ్డుకుంటున్నారని పలువురు ఏపీ డ్రైవర్లు జనసేనాని దృష్టికి తీసుకువెళ్లారు. జూన్ 2తో ఉమ్మడి రాజధాని గడువు ముగిసిందంటూ ఇబ్బంది పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారి అర్జీని స్వీకరించిన పవన్ కల్యాణ్… తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి సమస్య పరిష్కారమయ్యేలా చొరవ తీసుకుంటానని హామీ ఇచ్చారు.
పవన్‌కు అర్జీ ఇచ్చిన అనంతరం ఓ క్యాబ్ డ్రైవర్ మాట్లాడుతూ… ఏపీ క్యాబ్ కనిపిస్తే తగలుబెట్టండని హైదరాబాద్‌లో అంటున్నారని, ఇందుకు సంబంధించిన వీడియో క్లిప్స్‌ను శంషాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇచ్చామని చెప్పారు. ఏపీకి చెందిన ఓ క్యాబ్ డ్రైవర్‌పై మ్యాన్ హ్యాండ్లింగ్ చేశారని, ఇందుకు సంబంధించి సీసీటీవీ ఫుటేజీ ఉందన్నారు. తెలంగాణ ప్రభుత్వంతో మాట్లాడి న్యాయం చేస్తానని పవన్ కల్యాణ్ హామీ ఇచ్చారన్నారు. అమరావతి అభివృద్ధి జరిగితే తెలంగాణ వారికి కూడా ప్రయోజనం కలుగుతుంది కాబట్టి కాస్త ఓపిక పట్టాలని తెలంగాణవారికి ఆయన విజ్ఞప్తి చేశారన్నారు. పవన్ కల్యాణ్ సానుకూలంగా స్పందించారన్నారు.