12నెలలకు వేతనాలివ్వండి

– ఎమ్మెల్సీ పల్లాకు తెలంగాణ డిగ్రీ లెక్చరర్స్‌ ఫోరం వినతి
నవతెలంగాణ-సిటీబ్యూరో
రాష్ట్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పనిచేస్తున్న అతిథి అధ్యాపకులకు (గెస్ట్‌ లెక్చరర్స్‌) గంటల ప్రాతిపదికన కాకుండా నెలవారీగా 12నెలల పాటు వేతనాలివ్వాలని తెలంగాణ డిగ్రీ లెక్చరర్స్‌ ఫోరం ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు ఆదివారం హైదరాబాద్‌లో ఎమ్మెల్సీ డాక్టర్‌ పల్లా రాజేశ్వర్‌ రెడ్డిని టీడీఎల్‌ఎఫ్‌ వ్యవస్థాపక అధ్యక్షులు డాక్టర్‌ చింతల కిషోర్‌ కుమార్‌, వైస్‌ ప్రెసిడెంట్‌ జె. నాగేశ్వరరావు, డి.కరుణాకర్‌, జె.సంతోష్‌, బండి శ్రీనివాస్‌ పి. వెంకటేశ్వరరావు, శేఖర్‌, సతీష్‌ కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. గంటకు రూ.390 చొప్పున కాకుండా ఏకీకృతమైన (కన్సాలిడేటెడ్‌) వేతనాన్ని 12 నెలలకు ఇచ్చే విధంగా చూడాలని కోరారు. రాష్ట్రంలోని 132 ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో పదేండ్ల నుంచి 1940 మంది అతిథి అధ్యాపకులు విధులు నిర్వహిస్తున్నారని, వారంతా చాలీచాలని వేతనాలతో కుటుంబాలను గడుపుతున్నారని గుర్తుచేశారు. ప్రస్తుతం గెస్ట్‌ లెక్చరర్స్‌కి గంటకు రూ.390 చొప్పున నెలకు 72 క్లాసులు రూ.28,080 మాత్రమే చెల్లిస్తున్నారని తెలిపారు. గంట చొప్పున ఇవ్వడం ద్వారా ప్రభుత్వం సెలవులు ప్రకటించినప్పుడు, పరీక్షలు నిర్వహిస్తున్నప్పుడు తమకు వేతనాలు రావడం లేదని తెలిపారు. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి 12నెలలకు వేతనాలు ఇవ్వాలని కోరారు.

Spread the love