– సీఎంకు ఎమ్మెల్సీ ఏ నర్సిరెడ్డి లేఖ
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
రాష్ట్ర ప్రభుత్వ ఆర్థిక నిర్వహణలోని ఈ-కుబేర్ పెండింగ్ బిల్లుల్ని తక్షణం చెల్లించాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి ముఖ్యమంత్రి ఏ రేవంత్‌రెడ్డికి బుధవారం లేఖ రాసారు. ఈ-కుబేర్‌లో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, రిటైర్ ఉద్యోగులు, ఉపాధ్యాయుల బెనిఫిట్స్ వంటివి అనేకం పెండింగ్‌లో ఉన్నాయని తెలిపారు. జీపీఎఫ్, టీఎస్‌జీఎల్‌ఐ, మెడికల్ రీయింబర్స్‌మెంట్, సరెండర్ లీవు, సెలవు జీతం, సప్లిమెంటరీ జీతం బిల్లులు, డిఏ బకాయిలు వంటివి పెండింగ్‌లో ఉన్నాయని వివరించారు. ఈ-కుబేర్ బకాయిలు వారసత్వంగా వచ్చాయనే విషయం తెలుసనీ, అయినా జేఏసీతో చర్చల సందర్భంగా 2024 డిసెంబర్ 31లోపు చెల్లిస్తామని తమరు హామీ ఇచ్చారని గుర్తుచేశారు. అలాగే ఉద్యోగులు, ఉపాధ్యాయుల రిటైర్‌మెంట్ వయోపరిమితిని పెంచవద్దని విజ్ఞప్తి చేశారు. జీవన ప్రమాణాలు, నిరుద్యోగులను దృష్టిలో ఉంచుకోవాలన్నారు.