డాలర్లు కాదు.. యువాన్లలో చెల్లింపులు

– యూఏఈ నుంచి ఎల్‌ఎన్‌జీ చైనా కొనుగోలు
బీజింగ్‌ : యువాన్లలో చెల్లింపులు జరిపి విదేశాల నుంచి కొనుగోలు చేసిన మొట్ట మొదటి సరుకు ఎల్‌ఎన్‌జీ (ద్రవరూపంలోని సహజ వాయువు)ని చైనా అందుకుంది. ప్రభుత్వ రంగ సంస్థ అయిన చైనా నేషనల్‌ ఆఫ్‌షోర్‌ ఆయిల్‌ కార్పొరేషన్‌ (సీఎన్‌ఓఓసీ) ఈ విషయాన్ని మంగళవారం ప్రకటించింది. యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) నుంచి 65వేల టన్ను ఎల్‌ఎన్‌జీని కొనుగోలు చేసినట్టు కంపెనీ తెలిపింది. అంతర్జాతీయ వేదికపై యువాన్‌ ఉనికి పెరుగుతోందనడానికి ఇదొక తాజా సంకేతమని కార్పొరేషన్‌ పేర్కొంది. చైనా కరెన్సీలోనే చమురు, గ్యాస్‌ వాణిజ్యం జరిగేందుకు గల పరిస్థితులు రాన్రాను మెరుగవుతున్నాయని పేర్కొంది. డాలర్లలో చెల్లింపులను పక్కన బెట్టే వ్యూహంలో భాగంగా డాలరు, యూరో కాకుండా ఇతర కరెన్సీల్లో చెల్లింపులను చైనా పెంపొందిస్తోంది. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యాపై పశ్చిమ దేశాలు తీవ్రంగా ఆంక్షలు విధించడంతో చైనా ఈ చర్యలు ప్రారంభించింది. గతేడాదిలో రష్యా, చైనాల మధ్య సరుకుల రవాణా 88బిలియన్ల డాలర్లకు చేరింది. మాస్కో నుంచి చైనా కొనుగోలు చేసే ముడిచమురు, గ్యాస్‌, బొగ్గు, కొన్ని రకాల లోహాలు ఇలా అన్నింటికీ యువాన్లలోనే చెల్లింపులు జరిపిందని బ్లూమ్‌బెర్గ్‌ తెలిపింది.

Spread the love