రైతులను మోసం చేస్తే పీడీ యాక్ట్‌

నకిలీ విత్తనాల నివారణకు ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ టీమ్‌లు : సీపీ డీఎస్‌ చౌహాన్‌
నవతెలంగాణ-హయత్‌నగర్‌
రైతే దేశానికి వెన్నెముక.. రైతు లేనిదే దేశం లేదని.. వారిని మోసం చేస్తే పీడీ యాక్ట్‌ నమోదు చేస్తామని రాచకొండ పోలీస్‌ కమిషనర్‌ దేవేందర్‌ సింగ్‌ చౌహన్‌ హెచ్చరించారు. నకిలీ విత్తనాల సరఫరా, క్రయ విక్రయాలపై తీసుకోవాల్సిన చర్యలపై వ్యవసాయ శాఖ అధికారులతో మంగళవారం రాచకొండ సీపీ ఎల్‌బీనగర్‌లో ఉన్న సీపీ క్యాంప్‌ కార్యాలయంలో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాచకొండ కమిషనరేట్‌ పరిధిలో నకిలీ విత్తనాలను, ఎరువులు, నాసిరకం పురుగుల మందులను అంటగట్టి రైతులను మోసం చేస్తే ఎంతటి వారైనా చర్యలు తప్పవని హెచ్చరించారు. నకిలీ విత్తనాల కట్టడిలో వ్యవసాయ అధికారులకు కమిషనరేట్‌ తరపున పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. నకిలీ విత్తనాల అమ్మకం, సరఫరా వంటివి చేసినందుకు కమిషనరేట్‌ పరిధిలో ఐదేండ్లలో 14 మందిపై పీడీ యాక్ట్‌ నమోదు చేశామని తెలిపారు. రైతులు విత్తనాల ప్యాకెట్ల మీద అధీకృత సమాచారం, లోగో వంటి వాటిని బాగా పరిశీలించాకే కొనాలని సూచించారు. రైతులు నష్టపోకుండా వ్యవసాయశాఖ అధికారులు ధ్రువీకరించిన ప్రముఖ కంపెనీల విత్తనాలు మాత్రమే కొనుగోలు చేయాలని, వ్యాపారస్తుల నుంచి తీసుకున్న బిల్లులు కూడా జాగ్రత్తగా ఉంచుకోవాలని సూచించారు. నకిలీ విత్తనాలను అరికట్టడానికి ప్రత్యేక టాస్క్‌ ఫోర్స్‌ బృందాలను నియమించామని, వ్యవసాయ అధికారులతో సమన్వయం చేసుకుంటూ నకిలీ విత్తన, ఎరువుల దుకాణాలపై దాడులు నిర్వహించాలని ఆదేశించారు. ఎవరైనా తక్కువ ధరకు పత్తి విత్తనాలు కానీ మరేమైనా విత్తనాలు ఇస్తామని మాయమాటలు చెబితే వారి వివరాలను ప్రజలు పోలీసులకు చెప్పాలని కోరారు. నకిలీ విత్తనాల గురించి ఎటువంటి ముందస్తు సమాచారం తెలిసినా వెంటనే డయల్‌ 100కి కాల్‌ చేసి చెప్పాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్‌బీనగర్‌ జోన్‌ డీసీపీ సాయి శ్రీ, యాదాద్రి, మల్కాజిగిరి- మేడ్చల్‌, రంగారెడ్డి జిల్లాల అగ్రికల్చర్‌ అధికారులు తదితరులు పాల్గొన్నారు

Spread the love