సంధి ప్రేలాపనలు

Peace talks– భారత్‌పై విషం చిమ్ముతూ ఎక్స్‌లో విద్వేష పోస్టులు
– భావోద్వేగాలను రెచ్చగొట్టేలా వ్యాఖ్యలు
– అమెరికాలో ట్రంప్‌ మద్దతుదారుల దుశ్చర్య
వాషింగ్టన్‌ : గత సంవత్సరం చివరి వారాల్లో సామాజిక మాధ్యమం ఎక్స్‌లో భారత్‌కు వ్యతిరేకంగా విద్వేష ప్రచారం జరిగింది. ఈ ప్రచారానికి అమెరికా అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేయబోతున్న డొనాల్డ్‌ ట్రంప్‌ మద్దతుదారులు ఆజ్యం పోస్తున్నారు. వీరంతా హెచ్‌-1బీ వీసా కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తున్న వారే. భారత్‌పై విషం కక్కుతూ సాగుతున్న ఈ ప్రచారం వ్యవస్థీకృతంగా, ఓ పద్ధతి ప్రకారం జరుగుతుండడం గమనార్హం. ఎక్స్‌లో భారత్‌ వ్యతిరేక పోస్టుల సంఖ్య పెరుగుతోందని వాషింగ్టన్‌కు చెందిన సెంటర్‌ ఫర్‌ స్డడీ ఆఫ్‌ ఆర్గనైజ్డ్‌ హేట్‌ సంస్థ తెలిపింది. దీనికి సంబంధించిన నివేదికను గురువారం విడుదల చేశారు.
గత సంవత్సరం డిసెంబర్‌ 22, ఈ నెల 3వ తేదీ మధ్య భారత్‌కు వ్యతిరేకంగా పెట్టిన 128 పోస్టులను ఎక్కువ మంది వీక్షించారని, షేర్‌ చేశారని ఆ సంస్థ తెలియజేసింది. ఈ నెల 3వ తేదీ నాటికి ఈ పోస్టులను 138.54 మిలియన్ల మంది చూశారు. వీటిలో 36 పోస్టులకు సంబంధించి ఒక్కో దానిని పది లక్షల మందికి పైగా చూడడం జరిగింది. ఈ పోస్టులు 85 ఖాతాల నుండి వచ్చాయి. వీటిలో మూడో వంతు ప్రీమియర్‌ ఖాతాలే. భారత్‌కు వ్యతిరేకంగా వివాదాస్పద, విద్వేషపూరిత, చట్టవిరుద్ధ, సంచలనాత్మక పోస్టులు పెడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన ముఖ్య విషయమేమంటే ఈ పోస్టులు ఎక్స్‌ నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నాయి. అయినప్పటికీ నేటికీ 125 పోస్టులు ఆ వేదికలో దర్శనమిస్తూనే ఉన్నాయి. వీటిలో ఎనిమిది పోస్టులను సమస్మాత్మకమైనవిగా చూపారు. నివేదికలో విశ్లేషించిన 85 పోస్టుల్లో కేవలం ఒక దానిని మాత్రమే తొలగించారు.
లారా పోస్ట్‌తో మొదలు
ట్రంప్‌ మద్దతుదారు లారా లూమర్‌ ఎక్స్‌లో భారతీయ అమెరికన్లను లక్ష్యంగా చేసుకొని పోస్ట్‌ పెట్టినప్పటి నుండీ విద్వేష ప్రచారం మొదలైంది. త్వరలో ఏర్పడబోయే ట్రంప్‌ ప్రభుత్వంలో ఏఐ సలహాదారుగా శ్రీరామ్‌ కృష్ణన్‌ను నియమించడంతో ఈ ప్రచారం మరింత ఊపందుకుంది. నైపుణ్యం కలిగిన సాంకేతిక సిబ్బందిని తయారు చేయడంలో అమెరికా
విఫలమైందంటూ అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థిత్వం కోసం పోటీపడిన వివేక్‌ రామస్వామి విమర్శించడం అగ్నికి ఆజ్యం పోసినట్లయింది. ట్రంప్‌ మద్దతుదారుడు, ఎక్స్‌ వేదిక అధిపతి ఎలన్‌ మస్క్‌ హెచ్‌-1బీ వీసా కార్యక్రమాన్ని సమర్ధించారు. ఆ కార్యక్రమం ద్వారానే తాను అమెరికా వచ్చానని గుర్తు చేశారు. ఈ పరిణామాలన్నీ భారత్‌ పట్ల విద్వేష ప్రచారానికి దోహదపడ్డాయి. జాత్యాహంకార, విద్వేష ప్రచారానికి అడ్డూ అదుపూ లేకుండా పోయింది.
ఇవేం పోస్టులు?
భారతీయులు శ్వేతజాతి ఉద్యోగుల జీవనోపాధిని దెబ్బతీస్తున్నారంటూ 47 పోస్టుల్లో సెంటిమెంటును రగిల్చే ప్రయత్నం చేశారు. భారతీయుల్లో పరిశుభ్రత కన్పించదని, వారి మనసులు స్వచ్ఛమైనవి కావని 35 పోస్టులు విషం చిమ్మాయి. భారతీయులు బహిరంగ ప్రదేశాల్లో మల మూత్ర విసర్జన చేస్తారని, గో మూత్రాన్ని, ఆవు పేడను ఉపయోగిస్తారని పాతిక పోస్టుల్లో అవాకులూ చవాకులూ పేలారు. భారతీయులు పశ్చిమ దేశాల పౌరులు…ముఖ్యంగా అమెరికా వారితో పోలిస్తే నాసిరకంగా ఉంటారని కొన్ని పోస్టుల్లో సంధి ప్రేలాపనలు కన్పిస్తున్నాయి. శ్వేత జాతీయులతోనే కాకుండా ఇతర ఇమ్మిగ్రెంట్‌ ప్రజలతో పోల్చినా భారతీయుల్లో తెలివితేటలు తక్కువేనని కొన్ని పోస్టుల్లో వితండవాదం చేశారు. కొన్ని పోస్టులకు చిత్రాలు జోడించి వాటిలో మన దేశంలోని మురికివాడలను చూపారు. విద్వేష ప్రచారం కేవలం హిందువులను లక్ష్యంగా చేసుకొని సాగుతున్నది మాత్రమే కాదు…సిక్కు సమాజం సహా మొత్తం భారత సమాజం పైనే దాడి జరుగుతోంది.

Spread the love