శాంతియుత పోరాటాలను ఓడించలేరు

 కాంట్రాక్ట్‌ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి : సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌
 నిమ్స్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ ఆధ్వర్యంలో ర్యాలీ
నవతెలంగాణ – బంజారా హిల్స్‌
శాంతియుత పోరాటాలను, నిరసన కార్యక్రమాలను ఎవరూ ఎన్నటికీ ఓడించలేరని సీఐటీయూ రాష్ట్ర కార్యదర్శి జె.వెంకటేష్‌ అన్నారు. హైదరాబాద్‌లోని నిమ్స్‌ కాంట్రాక్ట్‌ కార్మికులకు ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. శుక్రవారం నిమ్స్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లా యీస్‌ యూనియన  (సీఐటీయూ) ఆధ్వర్యంలో బంజారాహిల్స్‌లోని ఆస్పత్రి అవుట్‌ గేట్‌ నుంచి పంజాగుట్ట ఇన్‌గేట్‌ వరకు నల్లబ్యాడ్జీలు ధరించి ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికులకు హామీలను మీరే నెరవేర్చడంలో విఫలమైతే ఎలా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఏప్రిల్‌ 25వ తేదీ నుంచి కార్మికులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నా నిమ్స్‌ యాజమాన్యం, ప్రభుత్వం పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. యాజమాన్యం వెంటనే యూనియన్‌ నాయకత్వంతో చర్చలు జరపాలని కోరారు. సమస్యల పరిష్కారం కోసం రాతపూర్వకంగా హామీ ఇవ్వాలన్నారు.
నిమ్స్‌ హాస్పిటల్లో పనిచేస్తున్న కార్మికులకు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, రెగ్యులరైజ్‌ చేయాలని, రిటైర్‌ అయిన కార్మికులకు ఉచితంగా వైద్యం అందించాలని డిమాండ్‌ చేశారు. ఈ నెల 15వ తేదీ వరకు సమస్యలను పరిష్కరించాలని లేకపోతే కార్మికులు, సీఐటీయూ అనుబంధ సంఘాలు, ఇతరుల మద్దతు కూడగట్టి పోరాటం ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో నిమ్స్‌ కాంట్రాక్ట్‌ ఎంప్లాయీస్‌ యూనియన్‌ అధ్యక్షులు ఎం.వెంకటేష్‌, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ బాలయ్య, నిమ్స్‌ సెక్యూరిటీ యూనియన్‌ కార్యదర్శి శశి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Spread the love