ప్రేమ శిఖరాలు

Peaks of loveఅమ్మ
సాళ్లల్లో విత్తనం
నాయన
పొలంలో నాగలి
అమ్మ మునివేళ్లు కలుపు తీసే పటుగారలు
నాయన కాళ్లు వరికర్రలకు నీళ్లతడులు
అమ్మ కొడువలైతే చేను తలదించేది !
నాయన కల్లమైతే కంకులు గింజలు రాల్చేది
అమ్మ భూమి, నాయన ఆకాశం !!!

అమ్మ
పచ్చి కట్టెలమోపు
నాయన
చెకుముఖి రాయి
అమ్మ
పొగచూరిన సెగలో ఉడుకుడుకు రొట్టెలు
నాయన
అలిసిన కళ్లతో వాకిట్ల ఈతచాప పరిచి
వొడ్డుకు ఈదలేని బక్కమేకల కథలు విప్పి
పలకబలపం చేతికిచ్చి బతుకు దారి చూపిన
అమ్మ నాయన సూర్య చంద్రులు !

ఊపిరి పోతున్న రక్తపు ముద్దలకు ఆయువుపోసే
మానవ సష్టికర్తలు
అక్కాచెల్లీ, అన్నా తమ్ముడు
గుండె పలకపై పేగు బంధాలను పదిలపరిచి
అనుబంధాల రాఖీలను ముడేశారు
అమ్మ చూపులు అనంత అనురాగాలు!
నాయన ధైర్యాలు ఆకాశ ఆత్మగౌరవాలు!!

అమ్మ
చదువు ఎట్లుంటదో ఎరుకలేదు
నాయన బడి మొఖమెన్నడు చూడలే
బిడ్డలు కలెక్టర్‌, డాక్టర్‌ కావాలనే కలలు
నలుగుట్ల తలెత్తుకొని ఉన్నతంగా తిరుగాలని
పదుగురికి సేవచేసే
ధర్మం చేతిలో నిలువాలనే తపన
అక్షరం తెలువకపోయినా
విజ్ఞాన దీపాలకై సమిధలైన త్యాగనీయులు

అమ్మ ఒక చౌరస్త
నాయన ఒక చూపుడువేలు
అమ్మ ఒక నది
నాయన ఒక సముద్రం

కూళ్లు చేసి అమ్మ రెక్కలుడిగినవి
నిత్యం రాళ్లెత్తి నాన్న నెత్తి బట్టతలైంది
రోడ్లు, రైల్వేలు, చెరువులు బావులు
డ్యాంలూ కోటలూ బురుజులు
మహా నగర నిర్మాణాలు
అమ్మ నాన్నల శ్రామిక విజయ కేతనాలు

అమ్మ రాల్చిన కన్నీళ్ళే
నేలమీద పరుగెడుతున్న నదులు
నాయన నిలబెట్టిన సిపాయిలే
హిమాలయ పర్వతాలు
నేలమీద కన్నుతెరిచి కాతకాసింది ప్రతిదీ
అమ్మ నాయనల చెమట ధారలే

కాలానికి వారధులు
ఎదిగే కలలకు భుజమిచ్చే నిచ్చెనలు
ఎండ వానలకు నీడనిచ్చి కాపాడె గొడుగులు
చెమట కాలువలు
చిక్కుడు పూలు జోడు గువ్వలు
ప్రేమ శిఖరాలు వెలుగుపూలు
మమతల కోవెలలు మానవతామూర్తులు
అమ్మ నాయన రెండక్షరాలు
ఎంతరాసినా వొడువని కావ్యాలు
అమ్మ నాయనకు పరిపరి దండాలు

– వనపట్ల సుబ్బయ్య, 9492765358

Spread the love