ఆణిముత్యాలు..

ప్రతిభ అన్నది ఏ ఒక్కరి సొత్తూ కాదు. పరికించి చూస్తే.. నిశితంగా పరిశీలిస్తే ప్రతి ఒక్కరిలోనూ ఏదో ఒక టాలెంట్‌ దాగుంటుంది. అలా ఒక్కొక్కరిలో దాగున్న ప్రతిభను వెలికితీసి.. సానబడితే మట్టిలోంచి మాణిక్యాలు బయటకొస్తాయి. ఆ ఆణిముత్యాలు.. జాతిరత్నాలవుతాయి. మంగళవారం విడుదలైన సివిల్స్‌ ఫలితాల్లో అలాంటి ఆణిముత్యాలే అద్భుతాలు సృష్టించాయి. ఇందులో 46 తెలుగు తేజాలు కూడా వికసించాయి.. వందలోపు ర్యాంకుల్లో పదింటిని సాధించి..’శభాష్‌…’అనిపించాయి. తద్వారా సరైన లక్ష్యం, కృషి ఉంటే దేన్నయినా సాధించవచ్చని ఆయా విజేతలు ప్రపంచానికి చాటి చెప్పారు. తద్వారా నేటి యువతరానికి ఆదర్శంగా నిలిచారు. ఈ టాపర్లలో మూడో ర్యాంకు సాధించిన నూకల ఉమా హారతి తెలంగాణ బిడ్డ. సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన ఈ అమ్మాయి తన వైఫల్యాల నుంచి బయటపడి విజేతగా నిలిచిన తీరుకు మనం జేజేలు పలకాల్సిందే. 2017 నుంచి సివిల్స్‌ ప్రయత్నాలు మొదలెట్టిన ఈమె.. 2019 నుంచి వరసగా సంబంధిత పరీక్షలను రాయటం.. విఫలమవటం.. నిరాశా నిస్పృహలకు లోనుకావటమనేది కొనసాగుతూ వచ్చింది. అయినా వైఫల్యాలకు వెరవకుండా, లోపాలు, లోటుపాట్లను సరిదిద్దుకుని ముందుకు సాగారు. పట్టువదలని విక్రమర్కుడిలా కఠోర శ్రమ చేసి.. ఐదోసారి గమ్యాన్ని ముద్దాడారు.. లక్ష్యాన్ని చేరుకున్నారు. ఇది ఉమా హారతి విజయగాథ. ఇక కుమురం భీం జిల్లాకు చెందిన డోంగ్రీ రేవయ్యది మరో కన్నీటి వ్యథ. బాల్యంలోనే తండ్రిని కోల్పోయినప్పటికీ అది ఆయన విద్యాతృష్ణను అడ్డుకోలేకపోయింది. మధ్యాహ్న భోజన కార్మికురాలైన ఆయన తల్లి.. తద్వారా వచ్చే డబ్బులు కుటుంబ పోషణకు సరిపోకపోవటంతో కూలి పనులకు వెళ్లేది. చిన్నతనంలోనే ఇలాంటి ఎన్నో కష్టాలు.. కన్నీళ్లను చవి చూసిన రేవయ్య.. ఏనాడూ చదువు మీద మమకారాన్ని కోల్పోలేదు. సాంఘిక సంక్షేమ వసతి గృహాల్లో చదువుకున్న ఆయన.. ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొని, మద్రాసు ఐఐటీలో 737 ర్యాంకు సాధించారు. కానీ అక్కడికి వెళ్లటానికి సైతం డబ్బుల్లేని దైన్యస్థితి. అప్పుడు మానవత్వం ఉన్న కొంతమంది దాతలు ఆదుకోవటంతో ఆయన అక్కడ కెమికల్‌ ఇంజినీరింగ్‌ పూర్తి చేసి.. తనేంటో, తన ప్రతిభేంటో చాటి చెప్పారు. ఓఎన్‌జీసీలో అత్యున్నత స్థాయి ఉద్యోగం వచ్చినా.. తన జీవితాశయాన్ని నెరవేర్చుకోవటానికి సివిల్స్‌ వైపు అడుగులేశారు. గతేడాది రెండు మార్కుల తేడాతో తృటిలో అవకాశాన్ని కోల్పోయినా నిర్లిప్తతకు, నైరాశ్యానికి ఎక్కడా చోటివ్వలేదు. ‘శ్రమ నీ ఆయుధమైతే.. విజయం నీ బానిస అవుతుంది..’ అనే రీతిలో మరోసారి ప్రయత్నించి విజయకేతనం ఎగరేశారు రేవయ్య. ఇది ఒక్క ఉమా హారతికి సంబంధించిన విషయమో.. రేవయ్యకు చెందిన అంశమో కాదు.. సివిల్స్‌లో విజయం సాధించిన అందరి విజేతల సంకల్పానికి నిదర్శనం. ‘సముద్ర కెరటం నాకు ఆదర్శం.. లేచి పడుతున్నందుకు కాదు.. ఎన్నిసార్లు పడినా మళ్లీ లేస్తున్నందుకు..’ అని ఓ కవి రాసుకున్నారు. ఇవి చూడటానికి ఐదారు పదాలే. కానీ వాటిలో జీవిత సత్యం దాగుంది. ఇటీవల ఇంటర్‌ ఫలితాలు వచ్చినప్పుడు దాదాపు పది మంది పిల్లలు.. పరీక్ష తప్పామనే కారణంతో ఆత్మహత్యలు చేసుకుని కన్నోళ్లకు కడుపుకోతను మిగిల్చారు. విషాదమేమంటే.. ఫలితాలు రాకముందే ఒక విద్యార్థి ఫెయిలవుతాననే భయంతో ‘ఉసురు’ తీసుకున్నాడు. ఫలితాలు వచ్చాక చూస్తే.. అతడు మంచి మార్కులతో పాసయ్యాడు. అప్పుడు మార్కుల మెమోను పట్టుకుని అతడి కన్నతల్లి పెట్టిన కంటతడిని ఎవరూ ఆపలేకపోయారు.. మరెవ్వరూ ఆమెను ఓదార్చలేకపోయారు. ఇలాంటి ఆత్మనూన్యతా భావంతో ఉన్న పిల్లలు, విద్యార్థులు, యువకులందరూ నేటి సివిల్స్‌ ర్యాంకర్లను ఆదర్శంగా తీసుకోవాలి. ఈ విజేతల్లో అనేక మంది తొలి ప్రయత్నంలోనే విజయం సాధించలేదనే వాస్తవాన్ని గుర్తెరగాలి. వీరేగాదు.. ఇప్పుడు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు, ఉన్నతస్థాయి అధికారుల్లో పలువురు పది, ఇంటర్‌ తప్పిన వారు కూడా ఉన్నారనే విషయాన్ని గమనించాలి. ఆ తర్వాత వారు తమ బలహీనతలను అధిగమించి, బలాలను అంచనా వేసుకుని తమను తాము మలుచుకున్న తీరును, తద్వారా ఉన్నత శిఖరాలను అధిరోహించిన వైనాన్ని స్ఫూర్తిదాయకంగా తీసుకోవాలి. అలా వారు విజయావకాశాలు ఒడిసి పట్టేలా తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, అధ్యాపకులు తగిన తోడ్పాటునందించాలి. సభ్య సమాజం ఆ రకమైన వాతావరణాన్ని కల్పించాలి. ప్రభుత్వం తన బాధ్యతగా కోచింగ్‌ సెంటర్లు, స్టడీ సర్కిళ్లు, హాస్టళ్లను సక్రమంగా, సమర్థవంతంగా నిర్వహించాలి. అందుకు తగినన్ని నిధులు కేటాయించాలి.

Spread the love