– రేసులో ఆ ‘నలుగురు’ నేతలు
– అధ్యక్షుని ఎంపికలో ఆలస్యానికి కారణమిదే
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
రాష్ట్ర కాంగ్రెస్ నూతన సారథి ఎంపికపై పీటముడి పడింది. అధ్యక్షుడి ఎంపిక ఆలస్యమయ్యే కొద్దీ పార్టీలో ఉత్కంఠ నెలకొంది. సీఎం రేవంత్‌రెడ్డి తర్వాత అధ్యక్షులు ఎవరనే చర్చ పార్టీలో కొంత కాలంగా జరుగుతున్నది. అయినప్పటికీ అధిష్టానం ఇంకా తేల్చడం లేదు. అధ్యక్ష రేసులో నలుగురి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ఎవర్ని ఎంపిక చేయాలనే విషయంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సూచన, సలహాలకు అధిష్టానం అత్యంత ప్రాధాన్యత ఇవ్వనున్నట్టు పార్టీ వర్గాలు తెలిపాయి. మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మాదిగ, గిరిజన సామాజిక తరగతికి చెందిన నాయకులకు అధ్యక్ష బాధ్యతలు అప్పగించడం సరైందిగా సీఎం భావిస్తున్నట్టు తెలిసింది. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు తీర్పు రావడం వెనుక తెలంగాణ, పంజాబ్ ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాయనేది టాక్. అందులో ముఖ్యంగా తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ప్రత్యేక చొరవ ప్రదర్శించినట్టు శాసనసభలో చెప్పిన విషయం తెలిసిందే. ప్రస్తుత ఉద్యోగ నోటిఫికేషన్లలో అవసరమైతే ఎస్సీ వర్గీకరణను అమలు చేస్తామంటూ శాసనసభలో సీఎం ప్రకటించారు. తద్వారా ఆయా వర్గాలను దరి చేర్చుకునేందుకు ప్రయత్నించారు. వర్గీకరణ అంశాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నించిన సీఎం…ఆ పరంపరంలో అధ్యక్ష పదవిని ఆ సామాజిక తరగతికి చెందిన మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్‌కు అప్పగించాలని భావిస్తున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఆ పదవి సంపత్‌కు ఇవ్వడం ద్వారా ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన రేవంత్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే, పార్టీకి కీలకమైన అధ్యక్ష పదవి కూడా అదే జిల్లాకు చెందిన నేతకు అప్పగించడం ద్వారా తప్పుడు సంకేతాలు పోతాయన్న వాదన వినిపిస్తున్నది. లేకపోతే ఎస్సీ వర్గీకరణను గంపగుత్తగా బీజేపీ ఖాతాలో వేసుకునే ప్రమాదముందనేది సీఎం అంచనా. అయినా సరే ఆయన్ను నియమించడం ద్వారా బీజేపీకి దగ్గరవుతున్న నేతకు చెక్ పెట్టొచ్చని రేవంత్‌రెడ్డి ఆలోచన ఉంది. కాంగ్రెస్ అధిష్టానం మాత్రం అందుకు భిన్నంగా ఆలోచిస్తున్నట్టు పార్టీ నేతలు చెబుతున్నారు. బీసీ సామాజిక తరగతికి చెందిన నేతలకు పీఠం అప్పగించాలని భావిస్తున్నది. ఆ సామాజిక తరగతిలో టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు మహేష్‌కుమార్‌గౌడ్, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ మధుయాష్కీ గౌడ్ పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మహేష్‌కు ఎమ్మెల్సీ పదవి ఇచ్చింది. ఆయనకు మరో పదవి ఎందుకనే వాదన అధిష్టానం వద్ద వినిపిస్తున్నట్టు సమాచారం. పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులుగా మహేష్ ఎంతో సమర్థవంతంగా వ్యవహరించారనే పేరుంది. పార్టీ సంస్థాగత నిర్మాణంపై ఆయనకు మంచి పట్టు ఉందని పార్టీ నేతలు చెబుతున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు ప్రచార కమిటీ చైర్మెన్‌గా ఉన్న తనకు ఆ పదవి ఇవ్వాలని మధుయాష్కీ కోరుతున్నట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఎల్బీనగర్ నియోజకవర్గం నుంచి ఆయనకు కాంగ్రెస్ బీఫామ్ ఇచ్చిందనీ, కానీ ఆయన విజయం సాధించలేదు. ఓడిపోయిన నాయకుడికి అధ్యక్ష పదవి ఎందుకని పార్టీలో మరో చర్చ జరుగుతున్నది. తానొక్కడినే ఓడిపోలేదనీ, హైదరాబాద్ పరిధిలోని కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారని మధుయాష్కీ అంటున్నారు. ఎన్నికల ప్రచార కమిటీ చైర్మెన్‌గా ఉన్న ఆయన తన నియోజకవర్గం దాటి ఎక్కడా ప్రచారం చేయలేదనీ, ఆ బాధ్యతలను పెద్దగా పట్టించు కోలేదనే విమర్శలున్నాయి. టీపీసీసీ పీటముడి విప్పేందుకు సీఎం రేవంత్‌రెడ్డి గిరిజన నేత, ఎంపీ బలరాం నాయక్ పేరును తెరపైకి తీసుకొస్తున్నారు. ఆయన కేంద్ర మంత్రిగా పని చేశారు. పార్టీకి అత్యంత లాయలీస్ట్‌గా పేరుంది. అధిష్టానంతో మంచి సంబంధాలు కూడా ఉన్నాయి. అధ్యక్షుడు ఎవరనే చర్చకు ఆగస్టు 20 తర్వాత శుభం కార్డు పడే అవకాశం ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలో అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాల్సిందే.