మూడోసారి అరుణాచల్‌ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ ప్రమాణ స్వీకారం..

న‌వ‌తెలంగాణ‌-హైద‌రాబాద్ : అరుణాచల్‌ప్రదేశ్ ముఖ్యమంత్రిగా పెమా ఖండూ వరుసగా మూడోసారి బాధ్యతలు చేపట్టనున్నారు. బుధవారం జరిగిన బీజేపీ శాసనసభా పక్ష సమావేశంలో ఎమ్మెల్యేలు పెమా ఖండూని తమ నేతగా మరోసారి ఎన్నుకున్న విషయం తెలిసిందే. దీంతో గురువారం ఉదయం 11 గంటలకు ఆయన సీఎంగా ప్రమాణం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హాజరుకానున్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ 46 స్థానాల్లో విజయం సాధించింది. నేనషల్​ పీపుల్స్​ పార్టీ(ఎన్​పీఈపీ) ఐదు స్థానాల్లో గెలుపొందింది. ఎన్​సీపీ మూడు, పీపుల్స్ పార్టీ ఆఫ్ అరుణాచల్ (పీపీఏ) రెండు, కాంగ్రెస్ ఒక స్థానంలో, స్వతంత్ర అభ్యర్థులు మూడు స్థానాలను కైవసం చేసుకున్నాయి. మొత్తం 60 స్థానాల్లో ఎన్నికలకు ముందే 10 స్థానాల్లో బీజేపీ ఏకగ్రీవంగా ఎన్నికైంది. వారిలో సీఎం పెమా ఖండూ, ఉప ముఖ్యమంత్రి చౌనా మెయిన్ కూడా ఉన్నారు. 44 ఏండ్ల పెమా ఖండూ 2011లో జరిగిన హెలికాప్టర్‌ ప్రమాదంలో తన తండ్రి, మాజీ సీఎం దోర్జీ ఖండ్‌ మరణంతో రాజకీయాల్లో ప్రవేశించారు. తన తండ్రి స్థానం నుంచి పోటీచేసిన ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 2016లో అప్పటి ముఖ్యమంత్రి నబం టుకీపై తిరుగుబాటు చేసిన తన వర్గం ఎమ్మెల్యేలతో బీజేపీలో చేరారు. దీంతో మెజార్టీ కోల్పోవడంతో కాంగ్రెస్‌ ప్రభుత్వం కూలిపోయింది. అనంతరం రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఖండూ బాధ్యతలు చేపట్టారు. 2019లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన ఆయన మళ్లీ సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి అరుణాచల్‌ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేస్తున్నారు.

Spread the love