– ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి
– పీఆర్టీయూటీఎస్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులుగా శ్రీపాల్‌రెడ్డి, దామోదర్‌రెడ్డి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో రెండేండ్లుగా పెండింగ్‌లో ఉన్న ఉపాధ్యాయుల సరెండర్ లీవులు, జీపీఎఫ్, టీఎస్‌జీఎల్‌ఐ, మెడికల్, ఉద్యోగ విరమణ ప్రయోజనాలు, రెగ్యులర్ వేతనాలకు సంబంధించి సప్లిమెంటరీ బిల్లులు మొత్తం దసరా పండుగలోపు చెల్లించాలని ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. లేకుంటే పెండింగ్ బిల్లుల సమస్యల పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణను చేపడతామని హెచ్చరించారు. రెండురోజులపాటు హైదరాబాద్‌లో నిర్వహించిన పీఆర్టీయూటీఎస్ రాష్ట్ర 35వ కౌన్సిల్ సమావేశాలు మంగళవారంతో ముగిశాయి. పెండింగ్ బిల్లులను ఏకమొత్తంలో చెల్లించాలని రఘోత్తంరెడ్డి కోరారు. పెండింగ్‌లో ఉన్న ఐదు డీఏలను దసరా కానుకగా విడుదల చేయాలని చెప్పారు. పీఆర్సీ నివేదికను తెప్పించుకుని 50 శాతం ఫిట్‌మెంట్‌తో అమలు చేయాలని విజ్ఞప్తి చేశారు.
ఉద్యోగులకు నగదు రహిత ఆరోగ్య కార్డులను జనవరిలోగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం పీఆర్టీయూటీఎస్ నూతన కమిటీని ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షులుగా పింగిలి శ్రీపాల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పుల్గం దామోదర్‌రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని ఎన్నికల అధికారులు ప్రకటించారు. కేజీబీవీ ఉపాధ్యాయులకు కనీస వేతనం వర్తింపజేయాలనీ, గురుకుల పాఠశాలల సమయపాలనను మార్చాలనీ, మోడల్ స్కూల్ ఉపాధ్యాయులకు 010 పద్దు కింద వేతనాలను చెల్లించాలనీ, రూ.395 వేతనంతో పనిచేసిన ఉపాధ్యాయులకు నోషనల్ ఇంక్రిమెంట్లు మంజూరు చేయాలని తీర్మానం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీలు బి మోహన్‌రెడ్డి, పూల రవీందర్, పీఆర్టీయూటీఎస్ మాజీ బాధ్యులు పి వెంకట్‌రెడ్డి, బీరెల్లి కమలాకర్‌రావు, గుర్రం చెన్నకేశవరెడ్డి, గుండు లక్ష్మణ్, మనోహర్‌రావు, ఏఐఎఫ్‌టీఏ ఉపాధ్యక్షులు గీత తదితరులు పాల్గొన్నారు.