పెండింగ్‌ డీఏలు, బిల్లులు విడుదల చేయాలి

– ఉప ముఖ్యమంత్రి భట్టికి ఎమ్మెల్సీ నర్సిరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
పెండింగ్‌లో ఉన్న కరువు భత్యం (డీఏ), పెండింగ్‌లోని వివిధ రకాల బిల్లులను వెంటనే విడుదల చేయాలని ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి, టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్షులు కె జంగయ్య, ప్రధాన కార్యదర్శి చావ రవి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. సోమవారం హైదరాబాద్‌లోని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కను నర్సిరెడ్డితోపాటు టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర నాయకులు కలిసి వినతిపత్రం సమర్పించారు. బకాయి ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలనీ, పెండింగ్‌ బిల్లులను మంజూరు చేయాలని కోరారు. రాష్ట్రంలో గత ప్రభుత్వం మూడు వాయిదాల డీఏలను విడుదల చేయలేదని తెలిపారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించిన జీపీఎఫ్‌, టీఎస్‌జీఎల్‌ఐ, సప్లిమెంటరీ వేతనాలు, సరెండర్‌ లీవులు, గత పీఆర్సీ బకాయిలు, మార్చి నుంచి ఉద్యోగ విరమణ పొందిన వారికి పెన్షనరీ బెనిఫిట్స్‌ తదితర వేలాది బిల్లులు ట్రెజరీల్లో ఆమోదం పొందినప్పటికీ సంబంధితుల ఖాతాల్లో జమ కావడం లేదని వివరించారు. 010 పద్దు ద్వారా వేతనాలు పొందుతున్న ఉద్యోగులకు ప్రతినెలా మొదటి తేదీన వేతనాలు ఇస్తున్నారు కానీ గురుకులాలు, మోడల్‌ స్కూళ్లు, ఎయిడెడ్‌, కేజీబీవీ, యూఆర్‌ఎస్‌ సిబ్బంది, కాంట్రాక్టు, ఔట్‌ సోర్సింగ్‌ ఉద్యోగులకు మొదటి తేదీన వేతనాలు అందటం లేదని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీ అధికా రంలోకి వచ్చిన 15 రోజుల్లో పెండింగ్‌లో ఉన్న మూడు డీఏలు ఇస్తామనీ, ఉద్యోగులందరికీ నెల మొదటి తేదీన వేతనాలు ఇస్తామనీ, పెండింగ్‌ బిల్లులన్నీ మంజూరు చేస్తామంటూ మ్యానిఫెస్టోలో ప్రకటిం చిందని గుర్తు చేశారు. పది నెలలు గడిచినా డీఏలు, పెండింగ్‌ బిల్లులు విడుదల కాకపోవడం వల్ల ఉద్యోగులు తీవ్రమైన అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. బకాయి పడిన నాలుగు వాయిదాల డీఏలు తక్షణమే విడుదల చేయాలనీ, పెండింగ్‌ బిల్లులను మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌యూటీఎఫ్‌ నాయకులు లక్ష్మారెడ్డి, రాజశేఖర్‌రెడ్డి పాల్గొన్నారు.

Spread the love