ఉపాధి కూలీలకు పెండింగ్‌ డబ్బులు వెంటనే చెల్లించాలి

అధికారులు స్పందించకుంటే ఎంపీడీవో ఆఫీస్‌ను ముట్టడిస్తాం
వ్యకాస జిల్లా అధ్యక్షులు పి. అంజయ్య
నవతెలంగాణ-యాచారం
గత ఎనిమిది వారాల ఉపాధి హామీ కూలీల పెండింగ్‌ డబ్బులను ప్రభుత్వం వెంటనే చెల్లించాలని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షులు పి. అంజయ్య డిమాండ్‌ చేశారు. సోమవారం యాచారం మండల పరిధిలోని నంది వనపర్తిలో ఉపాధి హామీ కూలీలను కలిసి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండల వ్యాప్తంగా వివిధ గ్రామాల్లో ఐదు నుంచి 8 వారాల ఉపాధి హామీ కూలీల డబ్బులు చెల్లించలేదన్నారు. గత రెండు నెలలుగా ఉపాధి హామీ కూలీలు గ్రామాల్లో ఎర్రటి ఎండలో తమ పనిచేస్తున్నారని తెలిపారు. మరోపక్క పెరిగిన ధరలతో రోజువారి అవసరాలు తీరక కూలీలంతా ఇబ్బంది పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పనిచేసి కూలీ డబ్బులు ఎనిమిది వారాల నుంచి పెండింగ్‌లో ఉండడం దుర్మార్గమని మండిపడ్డారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఉపాధి హామీ చట్టాన్ని నిర్వీర్యం చేసేందుకు కుట్ర పన్నుతుందని దుయ్యబట్టారు. ఇప్పటికే బడ్జెట్లో రూ.272 కోట్ల రూపాయలు కోత వేధించిందని విమర్శించారు. కేటాయించిన రూ.100 కోట్లతో కూలీలకు డబ్బులు గిట్టుబాటు గాక కూలీలంతా తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారని తెలిపారు. ఇప్పటికైనా అధికారులు ఉపాధి హామీ కూలీల పెండింగ్‌ డబ్బులు ఖాతాలో జమ చేయకుంటే త్వరలోనే ఎంపీడీవో ఆఫీస్‌ ముట్టడిస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వ్యకాస జిల్లా నాయకులు ఎం.జంగయ్య తదితరులు పాల్గొన్నారు.

Spread the love