– కార్మికులపై అదనపు పనిభారం
– ఎస్‌డబ్ల్యూఎఫ్ (సీఐటీయూ) రీజియన్ సెక్రెటరీ సుధాకర్
నవతెలంగాణ-సత్తుపల్లి
టీఎస్‌ఆర్టీసీ కార్మికులకు రెండు పీఆర్సీలు చెల్లించకుండా పెండింగ్‌లో ఉంచి ఇబ్బందులకు గురి చేస్తోందని సీఐటీయూ అనుబంధ సంఘమైన స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ (ఎస్‌డబ్ల్యూఎఫ్) రీజియన్ కార్యదర్శి పిట్టల సుధాకర్ ఆవేదన వ్యక్తం చేశారు. బుధవారం సత్తుపల్లిలోని ప్రజా సంఘాల కార్యాలయంలో ఆ సంఘ ముఖ్య బాధ్యులతో ఏర్పాటు చేసిన సమావేశంలో సుధాకర్ మాట్లాడారు. 2019, 2021 సంవత్సరాలకు సంబంధించి రెండు వేతన ఒప్పందాలను పక్కనబెట్టడంతో పాటు 2013లో 30శాతం పీఆర్సీ ఇచ్చిన యాజమాన్యం 10 యేండ్లు గడిచినా ఆ మిగతా బకాయిని ఇంత వరకు చెల్లించలేదన్నారు. టీఎస్‌ఆర్టీసీ సంఘాలను పక్కనబెట్టి 8 గంటల పని విధానం ఉన్నప్పటికి కార్మికులపై పనిభారం పెంచుతూ సెలవులు లేకుండా అదనపు డ్యూటీలు వేస్తూ ఇబ్బందుల పాల్జేస్తోందన్నారు. గతంలో 8 సంఘాలతో జేఏసీ ఉండేదని, 2019లో జేఏసీ నేతృత్వంలో సమ్మె చేసినా ప్రభుత్వం దిగిరాలేదన్నారు. ప్రస్తుతం ఐఎన్‌టీయూసీ జేఏసీని కాదని ఒంటెద్దు పోకడలు అవలంభిస్తోందని ఆరోపించారు. కేంద్రప్రభుత్వం తీసుకొచ్చిన ఎంవీ యాక్ట్‌తో కాంట్రాక్ట్, స్టేజ్ క్యారియర్ల విధానంతో సంస్థ మనుగడ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. ఈ సమావేశంలో సంఘ సత్తుపల్లి డిపో కార్యదర్శి సీహెచ్‌వీకే రెడ్డి, నాయకులు వెంకటయ్య, దొరబాబు, మహేశ్వరరావు, సీఐటీయూ నాయకులు మోరంపూడి పాండురంగారావు, కొలికపోగు సర్వేశ్వరరావు, రైతుసంఘ నాయకులు రావుల రాజబాబు పాల్గొన్నారు.