ప్రజలు నాపై చూపే ప్రేమను దూరం చేయలేరు

–  అన్ని వర్గాల ప్రజల నుండి సంపూర్ణ మద్దతు
– ప్రజలు,రైతుల్లో మంత్రి చేసిన అభివృద్ది పనులకు విశేష స్పందన
– మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి
 నవతెలంగాణ కమ్మర్ పల్లి: ఓట్ల కోసం ఎవరెన్ని రకాల కుయుక్తులు పన్నినా.. బాల్కొండ నియోజకవర్గ ప్రజలు నాపై చూపే ప్రేమను దూరం చేయలేరని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి అన్నారు. బాల్కొండ నియోజకవర్గంలో మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డికి అన్ని వర్గాల ప్రజల నుండి సంపూర్ణ మద్దతు లభిస్తోంది. అందులో భాగంగా బాల్కొండ, ఏర్గట్ల, మెండోరా మండలాల్లోని వివిధ గ్రామాలకు చెందిన పలు కుల సంఘాల కమిటీ సభ్యులు, రైతులు మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని బుధవారం మర్యాదపూర్వకంగా కలిశారు. తమకు అన్ని విధాల అభివృద్ది చేసి, అండగా నిలిచిన మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కి తమ సంపూర్ణ మద్దతు అని వారు నినదించారు. ఈ సందర్భంగా మంత్రి ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ.. ఓట్లు రాగానే ప్రజలు గుర్తుకు వచ్చే కొంతమంది తనపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, వారికి బాల్కొండ నియోజకవర్గ ప్రజలే సమాధానం చెప్తారని అన్నారు. ఓట్ల కోసం వారెన్ని రకాల కుయుక్తులు పన్నినా నియోజకవర్గ ప్రజలు తనపై చూపే ప్రేమను దూరం చేయలేరనీ స్పష్టం చేశారు. తెలంగాణకు కేసిఆర్ నాయకత్వం శ్రీరామ రక్ష అయితే బాల్కొండ ప్రజల ఆశీర్వాదమే తనకు శ్రీరామ రక్ష అని తెలిపారు. కాగా గత కొద్ది రోజులుగా అభివృద్ది వైపే ఉంటామని  బాల్కొండ ప్రజానీకం స్వచ్ఛందంగా ముందుకు వచ్చి వేములకు నీరాజనం పలుకుతున్నారు.  మంత్రి చేసిన అభివృద్ది పనులకు ప్రజలు, రైతుల్లో విశేష స్పందన వస్తోంది. మమ్మల్ని నిత్యం కంటికి రెప్పలా కాపాడుకునే నాయకుణ్ణి మేము కడుపులో పెట్టుకొని కాపాడుకుంటమని బాల్కొండ నియోజకవర్గ పల్లెలు ముక్త కంఠంతో నినదిస్తున్నాయి. నియోజకవర్గ నలుమూలల నుండి తనకు మద్దతు తెలిపేందుకు స్వచ్ఛందంగా తరలివస్తున్న ప్రజలకు,రైతులకు మంత్రి వేముల హృదయ పూర్వక ధన్యవాదాలు తెలియజేశారు.
Spread the love