– అనేక రెట్లు పెరిగిన పేదరికం, నిరుద్యోగం
– ధరల పెరుగుదల.. ప్రజల కష్టాలు పట్టించుకోని ప్రభుత్వాలు
– ‘ఉపాధి’ని రద్దు చేసేందుకు కుట్ర
– ఆయనను మళ్లీ గెలిపిస్తే దేశం నాశనమే..: అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు విజయ రాఘవన్
– నాగార్జునసాగర్‌లో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాలు ప్రారంభం
నవతెలంగాణ- మిర్యాలగూడ
”ప్రధాని మోడీకి విదేశీ పర్యటనలు, విమానాల కొనుగోలు తప్ప.. ప్రజల కష్టాలు, ధరల పెరుగుదలపై పట్టింపు లేదు.. 9 ఏండ్ల కాలంలో మోడీ ప్రగతి తప్ప ప్రజల ప్రగతి కనిపించడం లేదు.. ఆయన్ని మళ్లీ గెలిపిస్తే దేశం నాశన మౌతుంది” అని అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం అధ్యక్షులు విజయ రాఘవన్ అన్నారు. నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్‌లోని విజరు విహార్‌లో రెండు రోజులపాటు జరగనున్న అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కమిటీ సమావేశాలు మంగళవారం ప్రారంభమ య్యాయి. ముందుగా సంఘం జెండాను విజయ రాఘవన్ ఆవిష్కరించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ.. 9 ఏండ్లలో దేశంలో నిరుద్యోగం, పేదరికం అనేక రెట్లు పెరిగిందని, ఉపాధి అవకాశా లు లేక పేద ప్రజలు అల్లాడుతున్నారని అన్నారు. పోరాటాలతో సాధించుకున్న ఉపాధి హామీ చట్టానికి బడ్జెట్లో నిధులు తగ్గిస్తూ నిర్వీర్యం చేస్తున్నారని, భవిష్యత్తులో ఈ చట్టం లేకుండా చేయాలనే లక్ష్యంతోనే మోడీ ప్రయత్నాలు చేస్తున్నారని విమర్శించారు. ఉపాధి హామీ చట్టంతోనే గ్రామీణ పేదలు కూలి చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారని చెప్పారు.
ఒకవైపు కార్పొరేట్ శక్తులకు మద్దతు ఇస్తూ మరోవైపు ప్రభుత్వరంగ సంస్థలను అప్పనంగా వారికే కట్టబెడుతూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. ప్రాంతాలు, మతాల పేరిట బీజేపీ ప్రభుత్వం ప్రజల మధ్య విద్వేషాలు సృష్టిస్తూ రాజకీయంగా లబ్ది పొందాలని చూస్తోందని విమర్శించారు. అనేక రాష్ట్రాలలో ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టి ప్రతిపక్ష ప్రభుత్వాలను పడగొట్టా రన్నారు. మీడియాను, సోషల్ మీడియాను మోడీ గుప్పెట్లో పెట్టుకొని అసత్యాలను ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెడుతున్నారని వివరించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటివరకు గ్రామీణ పేదలకు చేసింది ఏమీ లేదని చెప్పారు.
బీజేపీి ప్రభుత్వం అవలంబిస్తున్న రైతాంగ, కార్మిక, ప్రజావ్యతిరేక విధానాలను ఎప్పటికప్పుడూ వివరించి ప్రజలను చైతన్యపర్చాలని కార్యకర్తలకు సూచించారు. దేశ వ్యాప్తంగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఉద్యమాలు, పోరాటాలపై చర్చించి భవిష్యత్తు ఉద్యమ కార్యాచరణ రూపొందించేందుకు ఈ సమావేశాలు నిర్వ హిస్తున్నామని తెలిపారు. రైతన్న, ఉపాధి కూలీలు, కార్మికు లను సమీకరించి ఉద్యమాలు చేపట్టాలని పిలుపు నిచ్చారు. అనంతరం రాష్ట్రాల వారీగా సమీక్ష నిర్వహించారు. ఆ సంఘం కేంద్ర కమిటీ సభ్యులు నారి ఐలయ్య అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం ప్రధాన కార్యదర్శి బి.వెంకట్, ఆల్ ఇండియా సహాయ కార్యదర్శి, ఎంపీ శివ దాసన్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్.వెంకట్రాములు, సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నాయకులు పాలడుగు ప్రభావతి, పాలడుగు నాగార్జున, కూన్ రెడ్డి నాగిరెడ్డి, బొజ్జ వెంకులు తదితరులు పాల్గొన్నారు.
ప్రారంభ ఉపన్యాసంలో జూలకంటి
కష్టజీవులతో నిర్మించిన నాగార్జునసాగర్
శ్రమజీవుల సంఘటిత శక్తికి, దేశ సమైక్యతకు, భారతీయ ఇంజినీర్ల ప్రతిభకు నిలువెత్తు నిదర్శనం నాగార్జునసాగర్ ప్రాజెక్టు అని మాజీ ఎమ్మెల్యే, ఆహ్వాన సంఘం అధ్యక్షులు జూలకంటి రంగారెడ్డి అన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాల్లో ఆయన ప్రారంభ ఉపన్యాసం చేశారు. 60 ఏండ్ల కిందట నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారన్నారు. 22 లక్షల ఎకరాలకు నీరు అందిస్తున్న ఈ ప్రాజెక్టు నిర్మాణంలో కమ్యూనిస్టుల పాత్ర మరువలేనిదని చెప్పారు. భూమి, భుక్తి, విముక్తి కోసం ఆనాడు జరిపిన తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటం చరిత్రలో నిలిచిపోయిందన్నారు. ఆ స్ఫూర్తితో పేదల పక్షాన వ్యవసాయ కార్మిక సంఘం వర్గ పోరాటాలు నిర్వహించాలని పిలుపునిచ్చారు. దేశంలో మోడీ ప్రభుత్వం పేదలకు అన్యాయం చేస్తూ అనేక సంస్కరణలను తీసుకొస్తోందని విమర్శించారు. దేశంలో నిరుద్యోగం పెరిగిపోయిందని, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఉపాధి లేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అన్నారు. మోడీ ప్రభుత్వం పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండి వచ్చే ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని కోరారు. దీనికోసం వ్యవసాయ కార్మిక సంఘం కూలీలను సమీకరించి వారిలో చైతన్యం తీసుకొచ్చి ఉద్యమాలు చేపట్టాలని సూచించారు. దేశవ్యాప్త ఉద్యమాలకు ఈ సమావేశాలు నాంది పలకాలన్నారు.