నవతెలంగాణ-కెరమెరి
కరంగివాడ అనార్‌పల్లి, లక్మాపూర్ తదితర గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎంపీడీఓ అంజాద్ పాషా అన్నారు. జిల్లాలో నాలుగు రోజులుగా కురుస్తున్న భారీ వర్షాల కారణంగా నదులు ఉప్పొంగుతున్న నేపథ్యంలో ప్రజలను అప్రమత్తం చేస్తున్నామన్నారు. సోమవారం లక్మాపూర్ వద్ద పహర ఏర్పాటు చేశారు. మరో మూడు రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉండడంతో కరంజివాడ, అనార్‌పల్లి, లక్మాపూర్ గ్రామాల ప్రజలను వాగు అవతల వైపు వెళ్లకుండా చర్యలు చేపట్టారు. ఈ సందర్భంగా ఎంపీడీఓ వాగు పరిసర ప్రాంతాల ప్రజలకు పలు సూచనలు చేశారు. ఎగువ ప్రాంతాల్లో వర్షం కురిసినా, నదులు ఉదృతంగా ప్రవహించే అవకాశం ఉందని, అత్యవసర పనులుంటే తప్ప నదులు దాటే ప్రయత్నం చేయొద్దన్నారు. ఇందులో తహసీల్దార్ దత్తు ప్రసాద్ రావు, పంచాయతీ కార్యదర్శులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.