ప్రజా దర్బార్ కు పొటెత్తుతున్న ప్రజలు

–  స్వయంగా వినతులు స్వీకరిస్తున్న మాజీమంత్రి ఆర్డిఆర్
– స్పాట్ లో సమస్య పరిష్కారం
– జనం కోసం ప్రత్యేక ఏర్పాట్లు
– ఇప్పటికే రెండు వేలు దాటిన దరఖాస్తులు
– అత్యధికంగా కబ్జా లు భూ సమస్యలపై వినతులు
– 80 శాతం వరకు సమస్యలు పరిష్కారం
– ఇది నిరంతర ప్రక్రియ…. దామోదర్ రెడ్డి
నవతెలంగాణ – సూర్యాపేట
తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రతి రోజూ ప్రజా దర్భార్ ఏర్పాటు చేసి ప్రజల కష్టాలు తీర్చుతామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటను స్పూర్తిగా తీసుకున్న మాజీమంత్రి రాంరెడ్డి దామోదర్ రెడ్డి తన రెడ్ హౌజ్ లో  నాటి నుంచి నేటి వరకూ కూడా ప్రజా దర్భార్‎ని ఏర్పాటు చేసి   దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. దీంతో ప్రతిరోజూ ప్రజల నుండి దరఖాస్తుల వెల్లువ కొనసాగుతోంది.సామాన్యులకు అండగా ప్రజల నుంచి ఆయన నేరుగా సమస్యలు తెలుసుకుంటున్నారు. వచ్చిన ఫిర్యాదులను పరిష్కారం కోసం రెడ్ హోజ్ లో ప్రత్యేక టీం ఏర్పాటు చేశారు. సమస్యల ను పరిశీలించి ఏ స్థాయిలో పరిష్కారం అవుతాయో గుర్తించి సంబంధిత అధికారులకు వాటిని పరిష్కరించాలని బాధితుల ఎదుటే ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. దీంతో వివిధ రకాల సమస్యలతో ప్రజా దర్బార్‎ కి వచ్చే  సామాన్యుల తాకిడి ఎక్కువైంది. కేవలం సూర్యాపేటే కాకుండా దాని చుట్టు పక్కల ప్రాంతాల నలుమూలల నుంచి ప్రజలు చేరుకుంటున్నారు. తమ సమస్యలను వినతి పత్రాల రూపంలో దామోదర్ రెడ్డి కి సమర్పించుకుంటున్నారు. ప్రజా దర్బార్ కు వస్తున్న విన్నపాలలో ఎక్కువగా బీఆర్ఎస్‌ పార్టీ అధికారంలో ఉండగా, ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు సాగించిన దౌర్జన్యాలు, భూకబ్జాలపై ఎక్కువగా ఫిర్యాదులు ఉండడం గమనార్హం. ప్రభుత్వం గతంలో ఇచ్చిన భూములు ప్రభుత్వం లాక్కుందని కొందరు ఫిర్యాదు చేశారు.డబుల్‌బెడ్రూం ఇళ్ల మంజూరులో అవకతవకలు జరిగాయని, అనర్హులకు కేటాయించారని, బీఆర్ఎస్‌ నేతలకే ఇళ్లు మంజూరు చేసుకున్నారని, తమకు అర్హత ఉన్నా ఇవ్వలేదని కొందరు, మరికొందరు ఇల్లు ఇప్పిస్తామని బీఆర్ఎస్‌ నాయకులు డబ్బులు వసూలు చేసి మోసం చేశారని ఈమేరకు ఫిర్యాదు చేశారు.అదేవిధంగా దళిత, బిసి, మైనార్టీ బంద్ లపై విచారణ జరిపించాలని ఇంకొందరు అర్జీలు పెట్టారు.
ధరణి పోర్టల్‌తో తమ భూములు తమకు దక్కకుండా పోయాయని, తమ పేరిట ఉన్న భూములను వేరేవారి పేరిట ఎక్కించారని, కబ్జాలో ఉన్నా.. ధరణిలో తమ పేరు రావడం లేదని, గతంలో అమ్మినవారి పేర్లు ధరణిలో వస్తున్నాయని బాధితులు ఆయన కు  విన్నవిస్తున్నారు.అదేవిధంగా రేషన్ కార్డులు, పింఛన్ల మంజూరు, డబల్ బెడ్ రూమ్ ఇల్లు కేటాయించాలని, వివిధ శాఖల అధికారులపై కంప్లైంట్స్ తో బాధితులు  వస్తున్నట్లు తెలుస్తోంది. డబల్ బెడ్ రూమ్ ఇల్లు, దివ్యాంగులు, నిరుద్యోగులు, ధరణి, భూ సమస్యల బాధితులు,  నిర్వాసితులు ఎక్కువగా ప్రజాదర్బార్‌కు వచ్చిన వారిలో వున్నారు. ఈ సందర్భంగా ప్రతి విజ్ఞాపన పత్రాన్ని వారు జాగ్రత్త పరుస్తున్నారు. బాధితుల సమస్య పరిష్కారం కోసం స్పాట్ లొనే ఆర్డిఆర్ సంబంధిత శాఖ అధికారులకు ఫోన్ చేసి సమస్యలను పరిష్కరిస్తున్నారు.
ప్రజాదర్భార్‎కు‎ క్యూ కడుతున్న ప్రజలు..
పలు సమస్యల పరిష్కారం కోసం ప్రజలు ఉదయం నుంచే రెడ్ హౌజ్ కు క్యూ కడుతున్నారు.దాదాపుగా 70 రోజులకు పైగా నిరంతరంగా కొనసాగుతున్న ప్రజా దర్బార్ లో దామోదర్ రెడ్డి డే&నైట్ ఇక్కడే గడుపుతూ ఎక్కువ సమయం ప్రజల కోసం కేటాయిస్తున్నారు.ఓపికగా ఆయనే నేరుగా ప్రతి దరఖాస్తు తీసుకుంటుండడంతో సమస్య పరిష్కారం పట్ల బాధితులకు భరోసా కలుగుతుంది. అదేవిధంగా  ప్రజల నుంచి వినతిపత్రాలను స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఇప్పటి వరకు దాదాపుగా రెండు వేల కు పైగా వివిధ రకాల సమస్యల పట్ల దరఖాస్తులు వచ్చాయి.కాగా వాటిల్లో ఇప్పటి వరకు 80 శాతం కు పైగా అర్జీలను పరిష్కరించినట్లు తెలుస్తోంది.ఈ విధానం అమలు తో జిల్లా కేంద్రంలో దళారి వ్యవస్థ కు చెక్ పడినట్లు అయిందని పలువురు పేర్కొంటున్నారు.ఒక రకంగా రెడ్ హౌజ్ కాస్తా  ప్రజా సమస్యల పరిష్కార్ భవన్ గా మారిందని పలువురు పేర్కొనడం గమాన్హారo.
ఇది నిరంతర ప్రక్రియ…. దామోదర్ రెడ్డి
రాష్ట్ర కాంగ్రెస్ సర్కారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రజా దర్బార్ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంలో మాత్రం నిరంతరంగా కొనసాగిస్తామని ఆయన చెప్పారు.ప్రజలు వివిధ రకాల ఇబ్బందులు, సమస్యలతో భారీగా  ప్రజాదర్బార్‌కు వస్తున్నారని తెలిపారు. అర్జీ పెట్టుకునేందుకు అవసరమైన తెల్ల కాగితాలు, పెన్నులు, కూర్చునేందుకు కుర్చీలు, తాగేందుకు నీళ్లు, వికలాంగులు, వృద్ధుల ప్రత్యేక ఏర్పాట్లు చేయడం జరిగిందని పేర్కొన్నారు. ప్రజల సమస్యల పరిష్కారం కోసం ఎల్లవేళలా అందుబాటులో ఉంటానని ఆయన స్పష్టం చేశారు.
Spread the love