ప్రజలను చైతన్యం చేయాలి

– గ్రామాల్లో ఓయూ విద్యార్థులు పర్యటించాలి
– ఉస్మానియాలో ప్రజాస్వామ్య వాతావరణాన్ని కల్పించాలి
– ‘సేవ్‌ యూనివర్సిటీ’ రౌండ్‌టేబుల్‌ సమావేశంలో వక్తలు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
‘ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేయాలి. గ్రామ గ్రామాన కాలుకు బలపం కట్టుకుని తిరగాలి. రాష్ట్రంలో జరుగుతున్న అప్రజాస్వామిక చర్యలను ప్రజలకు వివరించాలి. తెలంగాణ ఉద్యమ అకాంక్షలు నెరవేరే వరకు పోరాడాలి. తెలంగాణలోనూ, ఉస్మానియా యూనివర్సిటీలోనూ ప్రజాస్వామిక వాతావరణాన్ని కల్పించాలి’ అని పలువురు వ్యక్తలు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళీ అధ్యక్షతన ‘సేవ్‌ ఉస్మానియా యూనివర్సిటీ’ అంశంపై గురువారం రౌండ్‌టేబుల్‌ సమావేశం నిర్వహిం చారు. ఈ సందర్భంగా ప్రొఫెసర్‌ హరగోపాల్‌ మాట్లాడుతూ కర్నాటక ఎన్నికలకు ముందు ఆరునెలల పాటు 122 సంస్థలు సంయుక్తంగా గ్రామాల్లో ప్రజలను చైతన్యం చేయడానికి అనేక కార్యక్రమాలు నిర్వహించాయని తెలిపారు.ప్రధాని మోడీ, కేంద్ర మంత్రులు ప్రచారం చేసినా ఆ ఎన్నికల్లో బీజేపీ గెలవలేదని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోనూ ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలను చైతన్యం చేయాలని, అందుకు ప్రజా, సామాజిక, విద్యార్థి, యువజన, పౌరసంస్థలు ఏకతాటిపై కొచ్చి పాలకపార్టీలు గుర్తించేవిధంగా కార్యక్రమాలు నిర్వ హించాలని పిలుపునిచ్చారు. ఈ చైతన్య కార్యక్రమాలు ఎన్నికలపై తీవ్రప్రభావం చూపే అవకాశముందన్నారు. ఒకప్పుడు తెలంగాణ విద్యార్థులంటే ప్రపంచ వ్యాప్తంగా ఎంతో గౌరవం ఉండేదని, ప్రస్తుతం ఉస్మానియా యూనివర్సిటీ ఉనికి ప్రమాదంలో పడిందన్నారు. తెలంగాణ కోసం అన్ని వర్గాల ప్రజలు ఎంతో పోరాటం చేశారని, ఆ స్ఫూర్తి తెలంగాణ వచ్చిన తర్వాత కనబడలేదని అన్నారు. తెలంగాణ పోరాటంలో కీలకంగా పనిచేసిన విద్యార్థులను అణిచిపెట్టడానికి యూని వర్సిటీలకు ఐపీఎస్‌ అధికారులను వీసీలుగా నియ మించాలని కేసీఆర్‌ ప్రయత్నించారని గుర్తుచేశారు. రాష్ట్రంలో యూనివర్సిటీలను నిర్వీర్యం చేయడం, విధ్వంసం చేయడాన్ని ఎవరూ ఊహించ లేదన్నారు. విద్యాపరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తం గా కార్యక్రమాలు చేస్తే ఒక్క ఓయూలోని ప్రొఫెసర్లు మాత్రం స్పందించలేదని ఆవేదన వ్యక్తంచేశారు. విశ్వవిద్యాల యాలను కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కృషిచేయాలని, ఓయూకు పూర్వవైభవం తీసుకురావడానికి ఐక్యంగా ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. ఆకునూరి మాట్లాడుతూ యూనివర్సిటీల్లో విద్యార్థులకు ఏలాంటి సౌకర్యాలు ఉండాల్లో విదేశాల్లో విద్యనభ్యసించిన మంత్రి కేటీఆర్‌కు తెలియదా? అని ప్రశ్నించారు.
విశ్వవిద్యాలయాలను సీఎం కేసీఆర్‌ ఎందుకు సందర్శించడంలేదన్నారు. ఓయూలో ఫీజులు పెంచడానికి వీసీ ఎవరని? నిలదీశారు. టీజేఎస్‌ రాష్ట్ర అధ్యక్షులు కోదండరామ్‌ మాట్లాడుతూ ఓయూలో 2007నుంచి నియామ కాలు జరగలేదని, 800లకుపైగా ప్రొఫెసర్‌ పోస్టు లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ప్రొఫె సర్లు పూర్తి స్థాయిలో ఉంటేనే గ్రాంట్లు వస్తాయని వివరిం చారు. కాని ఖాళీలను భర్తీచేయడానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదన్నారు. నిధుల్లేకపోవడంతో విద్యార్థు లకు సరైన సౌకర్యాల్లేక తీవ్ర ఇబ్బందులు పడుతు న్నారని అన్నారు. అరుణోదయ సాంస్కృతిక సమాఖ్య అధ్యక్షులు విమలక్క మాట్లాడుతూ ప్రపంచంలోనే ఉస్మానియా యూనివర్సిటీ తలమానికం గా ఉందని, అలాంటి సంస్థను పరిరక్షించాలని సమావేశం నిర్వహించడం దౌర్బాగ్యమని అన్నారు. తెలంగాణ కోసం కాలుకు గజ్జకట్టి, పాట పాడినం, ఆట ఆడినం, పోరాటం చేసి కేసులపాలయ్యామని గుర్తుచేశారు. ప్రొఫెసర్‌ లక్ష్మినారాయణ మాట్లాడుతూ విద్యారంగానికి కొఠారీ కమిషన్‌ సిపార్సుల మేరకు బడ్జెట్‌లో 20శాతం నిధులను కేటాయించాలని, కానీ నేడు 6.5శాతం కేటాయిస్తున్నారని అన్నారు. ప్రభుత్వ యూని వర్సిటీలను ధ్వంసం చేసి ప్రయివేటు యూనివర్సిటీలను ప్రోత్సహిస్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. పాలమ్మిన మల్లారెడ్డి నేడు విద్యావేత్తగా మారాడని తెలిపారు. క్రమంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ విద్యార్థులకు ఉన్నత విద్యను అందకుండా చేస్తున్నారని, అందులో భాగంగానే ఓయూలో పీహెచ్‌డీ విద్యార్థులకు భారీగా ఫీజులు పెంచారని గుర్తుచేశారు. ఓయూ రీసెర్చ్‌ స్కాలర్‌ కోట శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఓయూలో వీసీ మనుధర్మశాస్త్రాన్ని అమలు చేస్తున్నారని అన్నారు. ఒక పక్క సీఎం కేసీఆర్‌ కేంద్రప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడుతుంటే మరోపక్క ఓయూలో వీసీ మాత్రం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన విద్యా విధానాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. డాక్టర్‌ పృథ్వీరాజు మాట్లాడుతూ సేవ్‌ తెలంగాణ, సేవ్‌ ఉస్మానియా యూనివర్సిటీ కోసం ఉద్యమించాలని పిలుపు నిచ్చారు. ప్రొఫెసర్లు మహ్మద్‌ అన్సారీ, ఖలీదాపర్వీన్‌, రమామెల్కోటే మాట్లాడారు. పీహెచ్‌డీ ఫీజుల పెంపు, మెస్‌చార్జీల పెంపు, ఓయూలోని సౌకర్యాలు, ఇబ్బందుల గురించి విద్యార్థులు ఆజాద్‌, దయాకర్‌, మహేష్‌, అఖిల్‌, సలీంపాషా వివరించారు. అనంతరం పలువురు తీర్మానాలు చేశారు.

Spread the love