– ఢిల్లీకి అఖిలపక్షాన్ని తీసుకెళ్లి కేంద్రంపై రాష్ట్ర సర్కారు ఒత్తిడి తేవాలి : సీఐటీయూ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సింగరేణి సంస్థకే రాష్ట్రంలోని శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌ను కేటాయించాలని సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ డిమాండ్ చేసింది. ప్రభుత్వ రంగంలోని సింగరేణి సంస్థ ప్రయివేటు కంపెనీలతో పోటీ పడాలని కేంద్రం వాదించడం దుర్మార్గమన్నది. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్టు తెలిపింది. బొగ్గు గనుల వేలాన్ని ఆపాలని డిమాండ్ చేసింది. బొగ్గు బ్లాకుల సాధన కోసం సీపీఐ(ఎం) తలపెట్టిన సింగరేణి పరిరక్షణ బస్సు యాత్రకు సంపూర్ణ మద్దతు ప్రకటించింది. రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు, కార్మిక సంఘాలు, ప్రజాసంఘాలు తమ రాజకీయ అనుబంధాలకతీతంగా సింగరేణి పరిరక్షణ ఉద్యమానికి ఐక్యంగా కలిసిరావాలని కోరింది. ప్రజలే సింగరేణిని కాపాడుకోవాలని పిలుపునిచ్చింది. శ్రావణపల్లి బొగ్గు బ్లాక్‌తో పాటు గతంలో ప్రయివేటు సంస్థలకు కేటాయించిన బ్లాకులను తిరిగి సింగరేణికి అప్పగించాలనే డిమాండ్‌పై అఖిలపక్షాన్ని ఢిల్లీకి తీసుకెళ్లి కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించింది. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో శని, ఆదివారాల్లో సీఐటీయూ కౌన్సిల్ సమావేశాలు జరిగాయి. ఈ సందర్భంగా సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ మాట్లాడారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ అధికారంలో ఉన్నప్పుడు నాలుగు బొగ్గు బ్లాక్‌లను మోడీ ప్రభుత్వం ప్రయివేటు సంస్థలకు అప్పగించిందన్నారు. ఆ తర్వాత సింగరేణి క్రమంగా బలహీనపడుతూ వస్తున్నదని చెప్పారు. కేంద్ర ప్రభుత్వ ప్రమాదకర నిర్ణయం వల్ల సింగరేణి ప్రాంత ప్రజలతో పాటు తెలంగాణ రాష్ట్రం యవత్తూ నష్టపోయే ప్రమాదముందని హెచ్చరించారు. 75 వేల మంది పర్మినెంట్, కాంట్రాక్టు కార్మికులు, ఉద్యోగుల నిరంతర శ్రమ, ఉన్నతాధికారుల కృషితో సింగరేణి లాభాల బాటలో ఉందని చెప్పారు. ఈ పదేండ్ల కాలంలో సింగరేణి సుమారు 49వేల కోట్ల రూపాయలను డివిడెంట్ రూపంలో చెల్లించిందనీ, ఏటా రెండు, మూడు వేల కోట్ల రూపాయల లాభాలతో ఉందని వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం సింగరేణికి 30 వేల కోట్ల రూపాయలు బకాయి పడి ఉందని తెలిపారు. అలాంటి సింగరేణిని కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టేందుకు మోడీ సర్కారు చూస్తున్నదని విమర్శించారు. సింగరేణి పరిరక్షణ ఉద్యమంలో అందరూ కలిసి రావాలని పిలుపునిచ్చారు.
వాయనాడ్ బాధితులకు సీఐటీయూ రాష్ట్ర కౌన్సిల్ అండ
కేరళలోని వాయనాడ్ ప్రాంతంలో జరిగిన ప్రకృతి విపత్తులో తీవ్రంగా నష్టపోయిన బాధితులను ఆదుకునేందుకు సీఐటీయూ తెలంగాణ రాష్ట్ర కమిటీ ముందుకొచ్చింది. రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తొలివిడత సహాయంగా లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేశారు. అందుకు సంబంధించిన చెక్కును సీఐటీయూ అఖిలభారత అధ్యక్షులు డాక్టర్ కె.హేమలత, కోశాధికారి ఎం.సాయిబాబుకు అందించారు. ఈ నెల నాలుగో తేదీ నుంచి ఎనిమిదో తేదీ వరకు నిధి సేకరణ క్యాంపెయిన్ చేపట్టాలని కార్మికులకు సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షులు చుక్కరాములు, ప్రధాన కార్యదర్శి పాలడుగు భాస్కర్ పిలుపునిచ్చారు.