ప్రజలే ఎర్రజెండాగా మారి.. సాయుధ పోరాటం

People become a red flag.. armed struggle– చరిత్రను వక్రీకరిస్తున్న బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌: సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య
నవతెలంగాణ-మంచిర్యాల
ప్రజలే ఎర్రజెండాగా మారి సాగించిన పోరుబాటే తెలంగాణ సాయుధ రైతాంగ పోరాటమని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు ఎస్‌.వీరయ్య అన్నారు. మంచిర్యాల జిల్లా కేంద్రంలో చార్వక ట్రస్ట్‌ భవనంలో శుక్రవారం తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్‌.వీరయ్య మాట్లాడుతూ.. ఓవైపు స్వాతంత్య్ర సంబరాలు చేసుకుంటుంటే.. మరోవైపు తెలంగాణలో మా భూములు మాకు కావాలి అంటూ కమ్యూనిస్టుల ఆధ్వర్యంలో సాయుధ రైతాంగ పోరాటం ఉవ్వెత్తున సాగిందని గుర్తుచేశారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం కమ్యూనిస్టులపై, ప్రజలపైన దాడి చేయించిందన్నారు. ఇందులో 3వేల మందికి పైగా కమ్యూనిస్టులు అమరులయ్యారని తెలిపారు. మూడు లక్షల ఎకరాల భూమిని పంపిణీ చేసిన ఘన చరిత్ర తెలంగాణ సాయుధ పోరాటానిదని తెలిపారు. కమ్యూనిస్టుల పోరాటాన్ని తట్టుకోలేక నిజాం సర్కారు సెప్టెంబర్‌ 17న తెలంగాణ ప్రాంతాన్ని భారతదేశంలో విలీనం చేసిందని వివరించారు. కానీ దీన్ని బీజేపీ, ఆర్‌ఎస్‌ఎస్‌ వక్రీకరించి ముస్లిం రాజుపై హిందువుల పోరా టంగా, విద్రోహదినంగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు చేస్తోందని విమర్శిం చారు. ఇందులో భాగంగానే ఈ నెల 17న కేంద్ర హోంమంత్రి అమిత్‌షాను ఆహ్వానించారని తెలిపారు. ఇక్కడ కూడా హిందూ, ముస్లింల మధ్య విభే దాలు పెట్టి అల్లర్లు సృష్టించాలని ప్రయత్నాలు సాగిస్తున్నారన్నారు. తెలం గాణ సాయుధ రైతాంగ పోరాట స్ఫూర్తితో మతోన్మాద చర్యలను తిప్పికొట్టే విధంగా ముందుండాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి సంకె రవి, కార్యదర్శివర్గ సభ్యులు గోమాస ప్రకాష్‌, దుంపల రంజిత్‌ కుమార్‌, నాయకులు దూలం శ్రీనివాస్‌, బోడెంకి చందు, రవి, ఉమారాణి, ప్రేమ్‌ కుమార్‌, మహేష్‌, సరిత, రేణుక, భూదక్క, సమ్మక్క పాల్గొన్నారు.

Spread the love