ప్ర‌జ‌ల హృద‌యాలు గెలిచింది

People's hearts wonపోరాటం ఆమెకు కొత్త కాదు. తన ఆటకు అడ్డుపడ్డ ఊరితో, బంధువులతో చిన్నతనంలోనే పోరాడింది. ఆపై క్రీడాకారిణుల జీవితాలతో ఆడుకునే రాజకీయ కామాంధులతో పోరాడింది. పారిస్‌ ఒలింపిక్స్‌లో దేశానికి ఒక్క బంగారు పతకమైనా అందించేందుకు ఆ రాత్రంతా తనతో తాను పోరాడింది. పతకాల పట్టికలో దేశాన్ని ముందుకు నిలపడానికి తన ఆరోగ్యాన్ని ఫణంగా పెట్టింది. ఆమే వినేశ్‌ ఫోగాట్‌. తుదకు వంద గ్రాముల బరువు దేశం గుండెలు బరువెక్కేలా చేసింది. ఇదంతా ఎవరు పన్నిన కుట్రో..! ఆమె మాత్రం ఓడినా ప్రజల మనసు గెలిచింది. ఈ రోజు ఆ మల్ల యోధురాలి పుట్టిన రోజు సందర్భంగా ఆమె స్ఫూర్తిదాయక పరిచయం నేటి మానవిలో…
వినేశ్‌ ఫోగట్‌ 1994 ఆగస్టు 25న హర్యానాలోని చర్కీ దాద్రిలో పుట్టింది. మల్లయోధుడు రాజ్‌పాల్‌ ఫోగట్‌ ఈమె తండ్రి. ఆమె చెల్లెలు ప్రియాంక ఫోగట్‌. గీతా ఫోగట్‌, రీతూ ఫోగట్‌, బబితా కుమారి వరుసకు ఈమెకు అక్క,చెల్లెళ్లు. వీరందరూ మల్లయోధులే. పెదనాన్న మహావీర్‌ సింగ్‌ ఫోగట్‌ దగ్గర వినేశ్‌ శిక్షణ తీసుకుంది. అయితే ఆడపిల్లలను కుస్తీ పోటీలకు పంపుతున్న వీరి కుటుంబం మొత్తం మొదట్లో గ్రామం నుండి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవలసి వచ్చింది. అయితే తండ్రి, పెదనాన్న ప్రోత్సాహంతో వినేశ్‌ ఊరితో పోరాటం చేసి మల్ల యోధురాలిగా రాష్ట్రానికి గొప్ప పేరు తీసుకొచ్చింది. ఇప్పుడు ఊరిలో వారందరికీ ఆ ఆడపిల్లలు ఆదర్శంగా నిలుస్తున్నారు. గ్రామీణ మహిళల పట్ల సమాజానికి ఉన్న అభిప్రాయాలను వీరు సాధించిన విజయాలు మార్చివేశాయి. 2018 డిసెంబర్‌ 13న, ఆమె జిందా జిల్లాకు చెందిన తోటి మల్లయోధుడు సోమవీర్‌ రాఠీని వివాహం చేసుకుంది. వీరిద్దరూ భారతీయ రైల్వేలో ఉద్యోగం చేస్తున్నారు.
నిజమైన దేశభక్తురాలు
2020లో 53 కిలోల బరువున్న రెజ్లర్ల పోటీల్లో పాల్గొన్న వినేశ్‌, 2024లో 50 కిలోల క్యాటగిరీలో పాల్గొంది. 50 కిలోల ఈవెంట్‌లో వినేశ్‌ పాల్గొంటే, మరో క్రీడాకారిణి 53 కిలోల ఈవెంట్‌లో పాల్గొంటుందని అధికారులు చెబితే ఏమాత్రం సందేహించకుండా క్రీడా స్ఫూర్తితో, దేశానికి ఇంకో పతకం వస్తే చాలని అంగీకరించి 50 కిలోల క్యాటగిరీలో పోటీకి దిగిన నిజమైన దేశభక్తురాలు వినేశ్‌. అయితే ఆమె స్థానంలో 53 కిలోల ఈవెంట్‌లో పాల్గొనాల్సిన యోధురాలు పోటీలో పాల్గొనకుండానే ఇంటి దారి పట్టింది. దీనంతటికి కారణం ఎవరు? ఇదంతా ఎందుకు జరిగింది? సెమీ ఫైనల్స్‌లో పాల్గొనేటప్పుడు 50 కిలోల లోపు వుండి, రాత్రికి రాత్రే 52.8 కిలోలకు ఎలా పెరిగింది?
మహిళా రెజ్లర్లకు అండగా…
2016లో 48 కిలోలు, 2020లో 53 కిలోలు, 2024లో 50 కిలోలు అనే మూడు వేర్వేరు బరువు తరగతుల్లో పోటీ చేసింది. 2019లో లారెస్‌ వరల్డ్‌ స్పోర్ట్స్‌ అవార్డులకు నామినేట్‌ అయిన ఆమె ఈ అవార్డుకు నామినెట్‌ అయిన మొదటి భారతీయురాలు. క్రీడల్లో అగ్ర భాగంలో ఉండటమే కాదు తన తోటి వారికి అన్యాయం జరిగితే చూస్తూ ఊరుకునే మనస్తత్వం కాదు ఆమెది. కాబట్టే 2023లో అప్పటి ఇండియన్‌ రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షుడు, బీజేపీ ఎంపి బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌ పలువురు మహిళా రెజ్లర్లను లైంగిక వేధింపులకు గురిచేయడంతో అతనికి వ్యతిరేకంగా ఢిల్లీలో భారత రెజ్లర్లు చేసిన పోరాటంలో ఆమె కీలకపాత్ర పోషించింది.
హృదయాలు జయించింది
వినేశ్‌ను పారిస్‌ ఒలింపిక్స్‌కు పంపడానికి డెభ్బై లక్షలు ఖర్చు చేశామని కేంద్ర క్రీడల మంత్రి, మహిళలు తమ బరువును అదుపులో పెట్టుకోకపోతే ఎలా అంటూ మరొకరు నోటికొచ్చినట్టు మాట్లాడారు. ఏ మాటల వెనుక ఎవరి ప్రయోజనం దాగుందో దేశ ప్రజలందరికీ బాగా తెలుసు. అందుకే ప్రముఖులతో పాటు, కోట్ల మంది వినేశ్‌కు అండగా నిలిచారు. మా హృదయాలను గెలిచావంటూ ఆమెను అభినందనలతో ముంచేశారు. ఇలా పతకాన్ని గెలవకపోయినా కోట్ల మంది హృదయాలు జయించింది. ఆధునిక సమాజంలో కూడా ఆడపిల్లలు అణచివేతకు గురవుతున్న తీరును నిరసిస్తూ, అందుకు ఆటలు కూడా మినహాయింపు కాదని, తన పోరాటం ద్వారా ఆమె తెలియచెప్తుంది. మార్పు కోసం నిత్య పోరాటం తప్పదని చెప్పేందుకు వినేశ్‌ జీవితమే చక్కటి ఉదాహరణ. అందుకే కోటానుకోట్ల యువతకు, మహిళలకు ఆమె స్ఫూర్తిగా నిలిచింది.
కుట్ర ఎవరిది..?
2024 ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరుకున్న మొదటి భారతీయ మహిళా రెజ్లర్‌ వినేశ్‌. ఒలింపిక్‌ ఛాంపియన్‌ యుయి సుసాకి ఓడించిన మొదటి అంతర్జాతీయ రెజ్లర్‌గా నిలిచింది. అయితే ఫైనల్స్‌ ఉదయం వెయిట్‌-ఇన్‌ సమయంలో నిర్ణీత బరువు కంటే 100 గ్రాములు ఎక్కువగా ఉందన్న సాకుతో పోటీకి అర్హత లేదు పొమ్మన్నారు. దీంతో న్యాయం కోసం ఆమె ‘కోర్ట్‌ ఆఫ్‌ ఆర్బిట్రేషన్‌ ఫర్‌ స్పోర్ట్స్‌’లో ఫిర్యాదు చేసింది. దీని వెనుక ఉన్నది ఎవరంటే కోటానుకోట్ల కళ్ళు ఒకేవైపు చూశాయి. తమను ప్రశ్నించినా, ఎదిరించినా ఎలా వెంటాడి వేధిస్తారో, ఎలా అణచివేస్తారో, ఎలా నిర్బంధిస్తారో, ఎంత క్రూరంగా వ్యవహరిస్తారో కళ్లెదుట స్పష్టంగా కనిపిస్తోంది. సాటి క్రీడాకారిణుల రక్షణ కోసం ఢిల్లీ వీధుల్లో ఏడాది పాటు ఎవరితో పోరాడిందో దేశానికి బాగా గుర్తుంది.
మూడు సార్లు ఒలింపిక్స్‌లో
వినేశ్‌ 2014, 2018, 2022 క్రీడలలో బంగారు పతకాలు గెలుచుకున్న విజేత. 2018 తర్వాత కామన్వెల్త్‌, ఆసియా క్రీడల్లో బంగారు పతకం గెలుచుకున్న భారతీయ మహిళా రెజ్లర్‌గా ఆమె నిలిచింది. ప్రపంచ రెజ్లింగ్‌ ఛాంపియన్‌షిప్‌లో కూడా ఆమె రెండు కాంస్య పతకాలు గెలుచుకుంది. దేశ ఖ్యాతిని నిలపడానికి ఆమె చేసిన కృషి వల్లే 2016లో అర్జున అవార్డు దక్కేలా చేసింది. 2018లో పద్మశ్రీ అవార్డుకు నామినేట్‌ అయ్యేటట్లు చేసింది. మూడు సార్లు ఒలింపిక్స్‌లో పాల్గొంది. అంతర్జాతీయ పోటీల్లో ఇప్పటి వరకు ఐదు బంగారు, మూడు వెండి, ఏడు కాంస్య పతకాలు సాధించి, పారిస్‌ ఒలింపిక్స్‌లో పతకం గ్యారంటీ చేసుకుంది. దేశ ప్రజలు ఆశించినట్లు జరిగి వుంటే ఒలింపిక్స్‌లో మొదటి స్వర్ణం గెలిచిన యోధురాలిగా ఈ పాటికి కీర్తి ప్రతిష్టలను పొంది వుండేది.

Spread the love