చట్ట సభలో ప్రజల గొంతై నిలుస్తా

చట్ట సభలో
ప్రజల గొంతై నిలుస్తా– ఎర్రజెండా బిడ్డగా ఆదరించి.. అసెంబ్లీకి పంపండి
– ఇబ్రహీంపట్నం సీపీఐ(ఎం) అభ్యర్థి పగడాల యాదయ్య
‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పేదల అణచివేతకు వ్యతిరేకంగా నియంత రాజరిక పాలనను తరిమికొట్టేందుకు పోరాటం చేసిన చరిత్ర ఇబ్రహీంపట్నం గడ్డకు ఉంది. ప్రస్తుతం కొనసాగుతున్న బీఆర్‌ఎస్‌ నియంత పాలనకు చరమగీతం పాడడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. పోరాటాల గడ్డపై ఎర్రజెండా ఎగరడం ఖాయం’ అని సీపీఐ(ఎం) ఇబ్రహీంపట్నం అభ్యర్థి పగడాల యాదయ్య అన్నారు. ఎర్రజెండా బిడ్డగా తనను ఆదరించి అసెంబ్లీకి పంపించాలని కోరారు. చట్ట సభల్లో ప్రజల గొంతై నిలుస్తానని తెలిపారు. విద్య, వైద్య రంగాన్ని ప్రభుత్వం గాలికి వదిలేసిందన్నారు. 15 ఏండ్లు స్థానిక ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి ప్రజలను మోసం చేస్తున్నాడని మండిపడ్డారు. పగడాల యాదయ్య మాటల్లోనే…
కమ్యూనిస్టు పాలనలో ఈ ప్రాంతం బాగుంది?
ఈ ప్రాంత ప్రజలకు ఎర్రజెండాతో వీడదీయలేని బంధం ఉంది. వేల ఎకరాలల్లో భూములు పంపిణి చేసింది ఎర్రజెండా. మూడు ధపాలుగా ఈ ప్రాంతానికి కమ్యూనిస్టు ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహించారు. నిరుపేదలకు కమ్యూనిస్టులు ఇచ్చిన జాగాలు తప్పా ఇప్పటి వరకు ఒక గుంట జాగా ఇచ్చింది లేదు. ఈ ప్రాంతానికి కృష్ణ జలాలు తీసుకువచ్చి.. ఈ ప్రాంత ప్రజల గొంతు తడిపింది ఎర్రజెండా. దీని ఫలితంగా హైదరాబాద్‌లో తాగు నీటి సమస్య పరిష్కారమైంది.
ఈ ప్రాంత ఎమ్మెల్యే చేసింది ఏమీ లేదు ?
కమ్యూనిస్టులు పేదలకు పంపిణీ చేసిన మిగులు భూములు, సీలింగ్‌, అసైన్డ్‌ భూములను పరిశ్రమల పేరుతో పేదల నుంచి స్థానిక ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డి లాక్కొని పెట్టుబడుదారులకు ధారాదత్తం చేస్తున్నారు. ల్యాండ్‌ పూలింగ్‌ పేరుతో పేదల నుంచి భూములు గుంజుకుని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారం చేస్తోంది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మాయ మాటలతో కాలం వెళ్లదిస్తోంది. ఇక ఆ పార్టీకి కాలం చెల్లినట్టే.
మీరు గెలిస్తే ఏం చేస్తారు?
ఈ ప్రాంతంలో సెజ్‌ల పేరుతో ప్రభుత్వం నుంచి పరిశ్రమల కోసం తీసుకున్న వేల ఎకరాలు ఉన్నాయి. నిరూపయోగంగా ఉన్న ఆ భూములను పీవోటీ యాక్ట్‌ కింద ఆ భూములను తీసుకుని భూమి లేని నిరుపేదలకు పంపిణీ చేస్తాం. ఫార్మాసిటీ భూబాధితులకు అందాల్సిన పరిహారం అందించేందుకు కృషి చేస్తా. ప్రతీ మండల కేంద్రంలో 30 పడకల ప్రభుత్వ ఆస్పత్రి, జూనియర్‌, డిగ్రీ కళశాలను ఏర్పాటు చేయిస్తా. కృష్ణ జలాలతో ఇబ్రహీంపట్నం బీడు భూములకు సాగు నీరు అందిస్తాం.

Spread the love