– సహాయక కార్యక్రమాల్లో పాల్గొనాలి పార్టీ శ్రేణులకు సీపీఐ(ఎం) పిలుపు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భారీ వర్షాలు పడతాయంటూ వాతావరణశాఖ హెచ్చరించిన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తంగా ఉండాలనీ, వరద ముంపు ప్రాంతాల్లో శాశ్వత చర్యలు చేపట్టాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ డిమాండ్ చేసింది. అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని కోరింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కురుస్తున్న ఎడతెరిపిలేని వర్షంతో జనజీవనం పూర్తిగా స్తంభించిందని తెలిపారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయని పేర్కొన్నారు. అనేక బస్తీలు మునిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేశారు. పలు కాలనీల్లోకి నీరు చేరడంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వివరించారు. విద్యార్థుల హాస్టళ్లకు నీరు చేరడంతో ఖాళీ చేయించాల్సిన పరిస్థితి వచ్చిందని తెలిపారు. చాలా ప్రాంతాల్లో మోకాలిలోతు నీరు నిలిచిపోయి ట్రాఫిక్ అస్తవ్యస్తమైందని పేర్కొన్నారు. చెరువులు, నాలాలు కబ్జాలకు గురికావడం, ప్రభుత్వానికి దీర్ఘకాలిక దృష్టి లేకపోవడమే ఈ పరిస్థితికి కారణమని విమర్శించారు. డ్రైనేజీ వ్యవస్థను వెంటనే మెరుగుపర్చాలని డిమాండ్ చేశారు. వరదలు వచ్చినపుడు హడావుడి చేయడం కాకుండా ముంపు నివారణకు శాశ్వత పరిష్కార మార్గాల పట్ల ప్రభుత్వం దృష్టి పెట్టాలని సూచించారు. ప్రాణనష్టం, ఆస్తినష్టం జరగకుండా చూడాలని కోరారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోను, ఇతర జిల్లాల్లోను పార్టీ నాయకత్వం, శ్రేణులు ప్రజలకు అందుబాటులో ఉండి, సహాయక కార్యక్రమాల్లో ముమ్మరంగా పాల్గొనాలని ఆయన పిలుపునిచ్చారు.