నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సీట్ల పెంపునకు రాష్ట్ర ఉన్నత విద్యా శాఖ అనుమతివ్వడం లేదంటూ పలు ప్రయివేటు ఇంజనీరింగ్ కాలేజీలు దాఖలు చేసిన పిటిషన్లను హైకోర్టు డిస్మిస్ చేసింది. సీట్ల పెంపుదల, సీట్ల తగ్గింపు వంటి అధికారం రాష్ట్రానికే ఉందని జస్టిస్ భాస్కర్‌రెడ్డి తీర్పు చెప్పారు. ఇది ప్రభుత్వ విధాన నిర్ణయమని పేర్కొన్నారు. ఆయా కాలేజీల్లో ఏ కోర్సులకు అనుమతివ్వాలో, ఏ కాలేజీలకు అనుమతి ఇవ్వరాదో, ఏ సీట్లను పెంచాలో, ఏ సీట్లను తగ్గించాలో అనేది పూర్తిగా రాష్ట్ర ప్రభుత్వ అధికారమని తీర్పు చెప్పారు. తమ అప్లికేషన్లను ఉన్నత విద్యాశాఖ తిరస్కరించిందని దాఖలైన 25కుపైగా కాలేజీల పిటిషన్లను కొట్టివేశారు. కంప్యూటర్ కోర్సు, దాని అనుబంధ కోర్సులను, సీట్లను పెంచుకోవడానికి జెన్‌టీయు ఎన్వోసీ ఇచ్చిందనీ, ఆ తర్వాతే ఏఐసీటీఈకి దరఖాస్తు చేసుకుంటే.. అది తనిఖీలు నిర్వహించి మౌలిక వసతులు, బోధనా సిబ్బంది ఉన్నారని చెప్పి పర్మిషన్లు ఇచ్చిందన్నారు. ఉన్నత విద్యా శాఖ అనుమతితో వాటిని ప్రారంభించాలన్న షరతు కారణంగా అప్లికేషన్లు పెట్టుకుంటే ప్రభుత్వం తిరస్కరించదని పిటిషనర్ల న్యాయవాదులు వాదన. అవసరాలకు అనుగుణంగా డిమాండ్‌కు తగ్గట్టుగా సీట్ల పెంపు, కుదింపు వంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకుంటుందని ప్రభుత్వ న్యాయవాది వాదన. అనంతరం పిటిషన్లను హైకోర్టు కొట్టివేసింది.
యావజ్జీవ శిక్ష రద్దు చేసిన హైకోర్టు
హత్య కేసు నిందితుడికి మహబూబ్‌నగర్ కోర్టు 2015లో విధించిన యావజ్జీవ శిక్షను హైకోర్టు రద్దు చేసింది. శాంతమ్మ అనే మహిళ మృతదేహాన్ని అప్పాయిపల్లిలో 2014లో గుర్తించారు. వడ్డె రాజు అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఆమెకు చెందిన వస్తువులను సీజ్ చేశారు. ఈ కేసులో పోలీసులు రాజును విచారించి ఇతర మహిళల హత్య కేసులో కూడా పాల్గొన్నట్టు అతను ఒప్పుకున్నట్టుగా తేల్చారు. దీనిపై దాఖలు చేసిన చార్జిషీట్ మేరకు ప్రాసిక్యూషన్ వాదనను కింది కోర్టు ఆమోదించింది. దీనిపై రాజు దాఖలు చేసిన అప్పీల్‌ను అనుమతిస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది. కింది కోర్టు తీర్పును రద్దు చేసింది. కింది కోర్టు తీర్పుతో పదేళ్లుగా జైల్లోనే ఉన్న రాజును విడుదల చేయాలని ఉత్తర్వులు జారీ చేసింది.