– ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి
నవతెలంగాణ-మిర్యాలగూడ
సీపీఎస్ అమలుకు కారణమైన పీఎఫ్‌ఆర్‌డీఏ చట్టాన్ని వెంటనే రద్దు చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం నల్లగొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం కమిటీల పేరుతో కాలయాపన చేయకుండా పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ డెవలప్‌మెంట్ (పీఎఫ్‌ఆర్‌డీఏ)ను రద్దుచేసి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ పాత పెన్షన్ విధానాన్ని వర్తింపచేయాలని కోరారు. ప్రభుత్వ సొమ్మును కార్పొరేట్లకు అప్పనంగా అందించడం మంచిది కాదన్నారు. ఏ రకంగా చూసినా కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానం.. ఉద్యోగులకు, ప్రభుత్వానికి నష్టం కలిగిస్తుందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం 2023 ఎన్నికల మేనిఫెస్టోలో సీపీఎస్‌ను రద్దుచేసి ఓపీఎస్‌ను అమలు చేస్తానని ప్రకటించిందని.. దాన్ని అమలుచేసేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సెప్టెంబర్ 1, 2004 ముందు ఉద్యోగ నోటిఫికేషన్ వచ్చి ఆ తర్వాత నియమించబడిన 2002, 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పాత పెన్షన్ వర్తింపచేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలన్నారు. సెప్టెంబర్ 1, 2004 తర్వాత ఉద్యోగాల్లో చేరి ఉద్యోగ విరమణ చేసిన వారికి కనీస పెన్షన్ చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ సమావేశంలో టీఎస్ యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి పి.వెంకటేశం, జిల్లా ఉపాధ్యక్షులు బి.శ్రీనివాస్‌చారి, జిల్లా కార్యదర్శి శ్రీనివాస్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.