తాత్విక కెరటం వివేకానందుడు: ఎమ్మెల్యే జారే

నవతెలంగాణ – అశ్వారావుపేట
కెరటం నాకు ఆదర్శం…  లేచి పడుతున్నందుకు కాదు పడినా కూడా లేస్తున్నందుకు అంటూ యువతలో చైతన్యం నింపిన స్ఫూర్తి ప్రదాత వివేకానందుడు నిజమైన తాత్విక కెరటం అని స్థానిక ఎమ్మెల్యే జారే ఆదినారాయణ అన్నారు. వివేకానంద వికాస మండలి ఆద్వర్యంలో ప్రముఖ పారిశ్రామిక సంస్థ కెమిలాయిడ్స్ మేనేజర్ ఏలూరి సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో వివేకానందుని 61 జయంతి ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు. నియోజక వర్గం కేంద్రం అయిన  అశ్వారావుపేటలోని ప్రధాన మూడు రోడ్ల కూడలి లో గల వివేకానంద విగ్రహం వద్ద జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే జారే ఆదినారాయణ ముందుగా ధ్వజ ప్రతిష్టాపన అనంతరం వివేకానంద విగ్రహానికి పూలమాల వేసి వందన సమర్పణ చేసారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వివేకానందుని తాత్విక చింతన భారతీయ లౌకిక సంప్రదాయానికి ప్రతీక అన్నారు.ఇటువంటి వారిని యువత ఆదర్శంగా తీసుకోవడం,ఆయన ఆశయాలను ఆచరించడం ద్వారా మెరుగైన సమాజం ఏర్పాటు దిశగా అడుగులు వేయాలని కోరారు. అనంతరం వివిధ ప్రతిభాపాటవాలు ప్రదర్శించిన విద్యార్ధిని విద్యార్ధులకు ప్రశంసా పత్రాలు, రామక్రిష్ణ పరమ హంస రచనలు అందజేసారు. ఈ కార్యక్రమంలో రవికుమార్, వి కె డి వి ఎస్ రాజు స్థానిక విద్యాసంస్థలు ప్రిన్సిపాల్ వెలుగోటి శేషుబాబు, కెమిలాయిడ్స్ అసిస్టెంట్ మేనేజర్ వేణుగోపాల్, శ్రీనివాసరాజు, పి.వి రామానుజం, సర్పంచ్ అట్టం రమ్య,ఉప సర్పంచ్ కేదార్ నాధ్, కాంగ్రెస్ నాయకులు సుంకవల్లి వీరభద్రరావు,  మొగళ్ళపు చెన్నకేశవ రావు,జూపల్లి రమేష్ లు పాల్గొన్నారు.
Spread the love