సిద్ధిపేట బాలసాహిత్యంలో కొత్త పుట పిడపర్తి అనితా గిరి

సిద్ధిపేట ‘కమాన్‌’ లోంచి బాల సాహిత్య లోకంలోకి ఎందరో లబ్ధప్రతిష్టితులైన కవులు, రచయితలతో పాటు అనేక మంది యువకులు, కొత్తవాళ్ళు ప్రవేశిస్తున్నారు. పిడపర్తి అనితా గిరి కొత్త రచయిత్రి కాదు కానీ సిద్ధిపేట నేల మీద తన చిరునామాను బాల సాహిత్య ప్రపంచంలో పదిలపరుచు కుంటోంది. ‘పిడపర్తి అనితా గిరి’ పేరుతో రచనలు చేస్తున్న శ్రీమతి అనిత 15 మార్చి, 1975న నేటి సిద్ధిపేట జిల్లా నంగునూరు గ్రామంలో పుట్టింది. తల్లితండ్రులు శ్రీమతి గుండోజు లక్ష్మి-శ్రీ రామస్వామి దంపతులు. ఇంటర్మీడియట్‌ వరకు చదువుకుని గృహిణిగా ఉంటూ బాలల కోసం రచనలు చేస్తోంది అనితాగిరి
పుస్తకాలు చదవడం, బొమ్మలు దించడం యిష్టమైన వ్యాపకంగా పెట్టుకున్న అనిత యిప్పటికి రెండు పుస్తకాలు బాలల కోసం ప్రచురించింది. అంటే సాహిత్య ప్రపంచంలోకి ఎంట్రీ బాల సాహిత్యంతోనే చేసింది అనిత. వివిధ సాహిత్య సాంస్కృతిక సంస్థలతో సన్నిహిత సంబంధాలు కలిగిన వీరు జాతీయ సాహిత్య పరిషత్‌, సిద్ధిపేట, శ్రీవాణి సాహిత్య పరిషత్‌ సిద్ధిపేట వంటి సంస్థల ప్రోత్సాహంతో రాస్తున్నానని చెబుతారు. ప్రపంచ తెలుగు మహాసభల్లోని కవయిత్రుల సమ్మేళనంలో పాల్గొన్నారు. బతుకమ్మ ఫౌండేషన్‌ నుండి బతుకమ్మ పురస్కారం, మణిపూసల కవిభూషణ, శతాధిక మహిళా కవి సమ్మేళనంలో పాల్గొని తెలుగు బుక్‌ ఆఫ్‌ రికార్డ్స్‌లో నమోదుతో పాటు ఏడుపాయల సంస్థాన్‌, మల్లినాథ సూరి కళాపీఠం కార్యక్రమాలతో పాల్గొన్నారు. వీరి రచనలు బతుకమ్మ ఉయ్యాల పాట, మెదక్‌ జిల్లా పెద్దలు రాసిన కథలు, కూడవెల్లి రామలింగేశ్వరస్వామి, శౌర్యభారతం దేశభక్తి పాటల సంకలనం వంటి వాటిలో అచ్చయ్యాయి.
ఆటపాటలకు నేటి పిల్లలు దూరమౌతున్నారని, పిల్లలు ఆడి పాడినప్పుడే ఆనందం, అరోగ్యం అని నమ్మిన అనితాగిరి తన వంతు ప్రయత్నంగా అందుకోసం గేయాలు రాస్తునాన్ననని అంటారు. పిడపర్తి అనితా గిరి కవయిత్రే కాకుండా చిత్రకారిణి కూడా. తన గేయాలకు తానే బొమ్మలు గీసుకుంటారీవిడ. తానే చెప్పుకున్నట్టు శ్రీమతి యెడ్ల లక్ష్మిగారి ప్రోత్సాహం రెండు రంగాల్లోనూ దక్కింది అనితా గిరికి. అనితా గిరి తొలి బాల గేయ సంపుటి ‘పిట్టగూళ్ళు’. యిందులో అనితా గిరి కట్టిన గేయాల గూళ్ళు పిల్లలకు నచ్చడమే కాకుండా వాళ్ళు పాడుకునేందుకు ఎంతో అనువుగా ఉంటాయి. పర్యావరణం, సమాజ హితం రెండు ఈమె గేయాల్లో కనిపిస్తాయి. ఆ కోవలోనే ‘వినాయక చవితి వచ్చింది/ పిల్లలు అందరూ చేరారు/ జట్టుగ వారు నిలిచారు/ మట్టి గణపయ్యను చేశారు’ అంటూ గణపతుల్లో మట్టి గణపతి గురించి పిల్లలకు తొలి గేయంలోనే పరిచయం చేస్తారు. బాల్యం నుండే పిల్లలకు కొన్ని అంశాలను తప్పనిసరిగా అవగాహన కల్పించాల్సిన అవసరముంది. యిది అటువంటి ప్రయత్నమే. సంపుటికి పేరు పెట్టిన పిట్టగూళ్ళు పేరుతో గేయం రాశారు అనితా గిరి. అందులో- ‘అమ్మా అమ్మా చూడమ్మ/ చిట్టి చెల్లిని చూడమ్మ/ ఇసుక లోన ఆడింది/ పిట్టగూళ్ళు కట్టింది/ పిల్లల నేమో పిలిచింది/ పందిర్లెన్నో వేసింది/ పిట్టల్లా రారండి…’ అంటూ పిల్లల ఆటలను గురించి రాసిన కవయిత్రి పుస్తకంలో అంతే చక్కని బొమ్మలను గీసింది. ఇంకా కుక్క గురించి, రంగుల టోపి గురించి, వన భోజనం గురించి, మన ఊరు, చిట్టి చెల్లి వంటి అనేక గేయాలు యిందులో ఉన్నాయి. ప్రతి గేయానికి అనిత వేసిన బొమ్మలు బాలల పట్ల, వారి సాహిత్యం పట్ల ఆవిడకున్న అసక్తిని, చిత్తశుద్ధిని తెలుపుతాయి. గేయాలే కాక పిల్లల కోసం ‘బంగారు భవిత’ పేర చక్కని నాటకాన్ని కూడా రాసింది అనితా గిరి.
తెలుగు పంచాంగం అనగానే గుర్తొచ్చేది ‘పిడపర్తి పంచాంగం’, అనితాగిరి కూడా తాను మణిపూసల రూపంలో రాసిన బాలల రామాయానికి ‘పిడపర్తి బాల రామాయణం’ అని పేరు పెట్టింది. ‘మరల యిదేల రామాయణం’ అని అనలేం, రామాయణం ఎవరు ఎప్పుడు రాసినా కొత్తగానే ఉంటుంది. అనితా గిరి పిల్లలకు యిందులో ‘సీతారాముల గురించి/ నీతి మనకు రంగరించి/ తెలిపెను వారి చరితను’ తెలిపెను. అలతి అలతి పదాలతో రాయడం అనితాగిరికి బాగా తెలుసు, ‘రాజు ఎదురు వెళ్లెను/ ముని నాహ్వానించెను’, ‘సీతకు కళ్యాణము/ చేయటకు నిర్ణయము/ రాజు తీసుకున్నాడు/ తగిన వరుడు కోసం’, ‘ఈడ్చు కొచ్చెనప్పుడు/ బతిమిలాడె నప్పుడు/ కైకేయి మందరను/ వదలమనెను యప్పుడు’, ‘సైన్యఘోష వినబడింది/ అడవియె దద్దరిల్లింది’ వంటివి చక్కగా కుదిరాయి. యింకా యిందులో సీతాపహరణం, రామ సుగ్రీవుల స్నేహం, హనుమంతిని సముద్ర లంఘనం, సేతువు నిర్మాణం, సీతారాముల పట్టాభిషేకం వంటి వివిధ ఘట్టాలను సుందరంగా రాశారు అనితా గిరి. రాముని గురించి చెబుతూ, పిల్లలకు సులభంగా అర్థమయ్యేలా యిలా రాస్తారు, ‘ఒకే మాటని యన్నాడు/ ఒకే బాణం అన్నాడు/ ఒక సతియని అందరికి / అదర్శమాయె రాముడు’. గృహణిగా, చిత్రకారిణిగా, బాల సాహితీవేత్తగా చక్కని రచనలు చేస్తున్న అనితాగిరికి అభినందనలు.
– డా|| పత్తిపాక మోహన్‌
9966229548

Spread the love