నవతెలంగాణ -హైదరాబాద్
హైదరాబాద్ శివారులోని శేరిలింగంపల్లి మండలం ఖానామెట్‌లోని 6.35 ఎకరాల ప్రభుత్వ భూమిని కాపు కుల సంఘాల సమాఖ్యాకు కేటాయించటాన్ని సవాల్ చేసిన కేసులో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. విశ్వ బలిజ, కాపు, తెలగ, ఒంటరి, తూర్పు కాపు సంఘాల సమాఖ్యకు ఖానామెట్‌లో సర్వే నెంబర్41/14లోని ఎకరం భూమిని కేవలం వంద రూపాయలకు కేటాయిస్తూ ఐదు నెలల క్రితం జీవో 87ను జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ హైదరాబాద్‌కు చెందిన ఎస్.నరేశ్ హైకోర్టులో సవాలు చేశారు. ఈ పిల్‌ను చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాదే, జస్టిస్ జె అనిల్ కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. అదే ఏరియాలో కమ్యూనిటీ బిల్డింగులకు ప్రభుత్వం ఇచ్చిన భూమిలో నిర్మాణాలను నిలిపివేస్తూ గతంలో ఇచ్చినట్టుగానే ఇపన్పుడు కూడా నిర్మాణాలు నిలిపివేయాలని పిటిషనర్ తరుపు న్యాయవాది కోరారు. ప్రభుత్వ వాదనలు విన్న తర్వాతే ఉత్తర్వుల అంశాన్ని పరిశీలిస్తామని హైకోర్టు ఈ సందర్భంగా తెలిపింది. కౌంటర్ దాఖలు చేయాలని రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, భూపరిపాలన శాఖ చీఫ్ కమిషనర్, రంగారెడ్డి జిల్లా కలెక్టర్, వివిధ కాపు సంఘాల సమాఖ్యలను ఆదేశించింది. తదుపరి విచారణను వాయిదా వేసింది.
పిల్లల అదృశ్యంపై వివరాలివ్వండి: పోలీసులను ఆదేశించిన హైకోర్టు
రాష్ట్రంలో చిన్న పిల్లలు అదృశ్యమైన కేసులు, వాటి పురోగతిని వివరించాలని రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. పిల్లల అక్రమ రవాణా, బలవంతంగా యాచక వృత్తిలోకి దించే ముఠాలు, లైంగికవేధింపులు వంటి వాటి నివారణకు తీసుకున్న చర్యలు తెలియజేయాలని చీఫ్ సెక్రటరీ, డీజీపీ, ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫే˜ర్, హోం శాఖల ముఖ్యకార్యదర్శులను ఆదేశించింది. ఇందుకు సంబంధించి ఒక ఇంగ్లీషు పత్రికలో వచ్చిన స్టోరీని హైకోర్టు పిల్‌గా పరిగణించింది. దీనిని జస్టిన్ అలోక్ అరాథే, జస్టిస్ జె. అనిల్ కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ విచారించింది. రోజుకు పది మంది పిల్లలు అదృశ్యమవుతున్నారనీ, నాలుగు వేలమంది ఆచూకీ తెలియటం లేదని కోర్టు పేర్కొంది. 2022లో 854 మంది అదృశ్యమైతే అందులో 391 మంది ఆడపిల్లలున్నారనీ, పిల్లల మిస్సింగ్‌లో తెలంగాణ దేశంలో 8వ స్థానంలో ఉందంటూ ఆ కథనం వివరించిందని పేర్కొంది. ఈ అంశాలపై హైకోర్టు ఆవేదన, ఆందోళన వ్యక్తం చేసింది. నాలుగు వారాలకు విచారణను వాయిదా వేసింది.
తలసాని ఓఎస్టీ ముందస్తు బెయిల్ పిటిషన్ : కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశం
పశు సంవర్ధక శాఖ ఆఫీసులో డాక్యుమెంట్లను ధ్వంసం చేశారనే కేసులో ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ మాజీ మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ ఓఎస్‌డీగా చేసిన గుండమరాజు కళ్యాణ్ కుమార్ వేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం విచారించింది.ఈ అంశంపై పోలీసుల వైఖరిని తెలియజేయాలని జస్టిస్ కె.సురేందర్ ఆదేశించారు. పశు సంవర్ధక శాఖ కార్యాలయంలో పత్రాలను ధ్వంసం చేశారంటూ అక్కడి వాచ్‌మెన్ ఎం. లక్ష్మయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈ నెల 9న నాంపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. ఆఫీసులోని పత్రాలన్నీ సెక్రటేరియట్‌లోకి ఎప్పుడో తీసుకువెళ్లారనీ, ధ్వంసం అయ్యాయనేది ఊహాజనితమని పిటిషనర్ వాదన. అనంతరం కోర్టు విచారణను ఈ నెల 16కి వాయిదా వేసింది.
మిగిలిన మెడికల్ సీట్ల భర్తీ చట్టబద్ధమే : హైకోర్టు ఉత్తర్వులు
కాళోజీ నారాయణరావు మెడికల్ యూనివర్సిటీలో ఎంబీబీఎస్, బీడీఎస్‌ల్లో రెండు విడతల కౌన్సెలింగ్ అయ్యాక మిగిలిన సీట్ల భర్తీ ప్రక్రియలో అక్రమాలు, అవతవకలు జరగలేదని హైకోర్టు స్పష్టం చేసింది. కౌన్సెలింగ్ తర్వాత గత సెప్టెంబరు 27నాటికి మిగిలిన సీట్ల భర్తీలో అక్రమాలు జరిగాయంటూ కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన కె.టి. సాయి రేవంత్ రెడ్డి, మరొక విద్యార్థి వేసిన పిటిషన్లను కొట్టివేసింది. పిటిషన్‌లోని అభియోగాలకు ఆధారాలు చూపలేదని చీఫ్ జస్టిస్ ఆలోక్ అరాదే, జస్టిస్ జె.అనిల్‌కుమార్లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. కౌన్సెలింగ్స్ అయ్యాక మిగిలిన సీట్ల భర్తీకి ఆ కౌన్సెలింగ్‌లో సీట్లు పొందిన వారికి అనుమతించకూడదంటూ డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్, సుప్రీంకోర్టు జారీ చేసిన గైడ్‌లైన్స్‌ను అమలు చేయలేదనే విషయాన్ని పిటిషనర్ల తరఫు సీనియర్ లాయర్ పి తిరుమలరావు న్యాయస్థానం దృష్టికి తెచ్చారు. మొదటి రెండు రౌండ్లలో వెబ్ ఆప్షన్‌లో పాల్గొన్న వాళ్లకు తర్వాత కౌన్సెలింగ్‌లో ఆప్షన్ ఇచ్చేందుకు ఆస్కారం ఉందని వర్సిటీ లాయర్ ఎ.ప్రభాకర్‌రావు తెలిపారు. రెండు కౌన్సెలింగుల తర్వాత మిగిలిన సీట్ల భర్తీ చట్ట ప్రకారమే జరిగిందని హైకోర్టు తేల్చి చెప్పింది.