– రైతు భరోసా పథకం కోసం ప్రభుత్వం కసరత్తు
– 20కి పైగా జిల్లాల్లో మండలానికి ఓ గ్రామంలో సర్వే
– ఉమ్మడి ఖమ్మం జిల్లాలో 44 గ్రామాల్లో 42వేల ఎకరాల్లో..
– నేటి నుంచి మూడు రోజులు కొనసాగనున్న సర్వే
నవతెలంగాణ – ఖమ్మం ప్రాంతీయ ప్రతినిధి
రైతు భరోసా పథకం కింద పెట్టుబడి సాయం అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ముమ్మరం చేసింది. శనివారం నిర్వహించిన మంత్రిమండలి సమావేశంలో జనవరి 26వ తేదీ నుంచి సాగులో ఉన్న భూములకే రైతు భరోసా ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా అర్హుల నిర్ధారణకు శాటిలైట్ సర్వేను ప్రామాణికంగా తీసుకోవాలని తొలుత భావించింది. దీనిపై భిన్నాప్రాయాలు వ్యక్తం కావడంతో మండలానికో గ్రామం చొప్పున పంటల నమోదు ప్రక్రియ చేపట్టనుంది. ఆ వివరాలను యాప్‌లో నమోదు చేసి శాటిలైట్ సర్వేతో సరిపోల్చాలని భావిస్తోంది. దీని ప్రకారం ఈ నెల 8వ తేదీలోగా ఖమ్మం, భద్రాద్రి జిల్లాల్లో మొత్తం 44 గ్రామాల్లోని 42,000 ఎకరాల్లో సర్వే చేస్తారు. సోమవారం నుంచి ఈ సర్వే ప్రారంభమవుతుంది. వ్యవసాయ అధికారుల పర్యవేక్షణలో విస్తరణ అధికారులు పంటల నమోదు చేపడతారు. ఖమ్మం జిల్లాలో 41 గ్రామాల్లో 20,500 ఎకరాలు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 43 గ్రామాల్లో 21,500 ఎకరాలను పైలెట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 20కి పైగా జిల్లాల్లో ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే నిర్వహిస్తారు.
పైలట్ ప్రాజెక్టుగా సర్వే
గతంలో పంటల నమోదు కోసం ప్రత్యేక యాప్‌ను అందుబాటులోకి తీసుకొచ్చిన ప్రభుత్వం.. 20 జిల్లాల్లో పైలట్ ప్రాజెక్టు కింద శాటిలైట్ సర్వే నిర్వహించింది. గతేడాది డిసెంబర్ 20 నుంచి 23 వరకు.. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, ఆదిలాబాద్, నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, జగిత్యాల, వరంగల్, హనుమకొండ, మహబూబాబాద్, ములుగు, భూపాలపల్లి, వికారాబాద్, మహబూబ్‌నగర్, నారాయణపేట్, నాగర్‌కర్నూల్, వనపర్తి, గద్వాల, నల్లగొండ, సూర్యాపేట జిల్లాల్లో ఈ సర్వే జరిగింది. మొత్తం 144 మండలాల్లోని 318 క్లస్టర్లలో ఈ ప్రక్రియ పూర్తిచేసి, సాగు భూములను పక్కాగా లెక్కించారు.
శాస్త్రీయంగా పంటల నమోదు
రాష్ట్రంలో ఇప్పటివరకు పంటల నమోదు ప్రక్రియ పూర్తి అశాస్త్రీయంగా జరుగుతున్నది. వ్యవసాయాధికారులు మాన్యువల్‌గా ఏయే పంటలు ఎన్ని ఎకరాల్లో సాగయ్యాయో లెక్కిస్తున్నారు. రైతులు చెప్పిన వివరాలపైనే ఆధారపడుతున్నారు. దీనివల్ల వివిధ రకాల పథకాల అమలు, పంట నష్ట పరిహారం అంచనాలో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాటిలైట్ సర్వేకు సర్కారు మొగ్గు చూపింది. ఈ శాటిలైట్ సర్వే ద్వారా క్లస్టర్ల వారీగా ప్రతి 300 మీటర్ల రేడియస్‌లో ఏయే పంటలు, ఎంత విస్తీర్ణంలో సాగయ్యాయో కచ్చితంగా లెక్కించారు. పైలెట్ ప్రాజెక్టు కింద ఎంపికైన గ్రామాల్లో సర్వే నిర్వహించి ఈ శాటిలైట్ సర్వేతో సరిపోల్చుతారు.
రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా అంచనా..
సాగుభూముల గుర్తింపు కోసం శాటిలైట్ సర్వే దృష్ట్యా వ్యవసాయ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఇటీవల వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశమయ్యారు. రిమోట్ సెన్సింగ్ డేటా ఆధారంగా సాగు విస్తీర్ణాన్ని ఈ కంపెనీలు అంచనా వేశాయి. ఏఈవోల ద్వారా ఎప్పటికప్పుడూ రైతు వారీగా సాగు వివరాలను నమోదు చేసి, కచ్చితత్వం కోసం గ్రామాల్లో సర్వే నంబర్లవారీగా సాగు భూముల విస్తీర్ణం, అందులో ఏ పంట ఎంత విస్తీర్ణంలో సాగైందన్న వివరాలను సేకరించాయి. రైతు భరోసాతో పాటు పంటల బీమా అమలు, పంటల స్థితి, ఎదుగుదల, చీడపీడలను గుర్తించడం, వరదలు, తుఫానుల వల్ల జరిగే పంటనష్టాన్ని అంచనా వేయడానికి కూడా ఇదే టెక్నాలజీ వినియోగిస్తారు. కాగా.. ఇప్పటికే తాము రూపొందించిన పంటల వివరాలను వివిధ కంపెనీల ప్రతినిధులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సాగుకు అనువు గానీ ప్రాంతాలను గుర్తించాయి. పంటలకు వచ్చే చీడ పీడలను గుర్తించేందుకు ఏఐ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు.
సర్వే ఎలా..!
పైలట్ ప్రాజెక్టు కింద ఎంపికైన గ్రామాల్లో సర్వే ఎలా ఉంటుందనే దానిపై సందేహాలు నెలకొన్నాయి. ఎంపిక చేసిన గ్రామాల్లో సర్వే నెంబరు, దాని పరిధిలోని మొత్తం విస్తీర్ణం, ప్రస్తుత రబీ సీజన్‌లో ఏయే పంటలు సాగు చేస్తున్నారు? అనే వివరాలను నమోదు చేస్తారు. సర్వేకి సంబంధించిన యాప్ అందుబాటులోకి వచ్చాక క్షేత్రస్థాయిలో పంటల వివరాలు, మార్గదర్శకాల ప్రకారం నమోదు చేయనున్నట్టు ఉమ్మడి జిల్లా వ్యవసాయ అధికారులు ప్రకటించారు. ఈ మూడు రోజులపాటు సర్వే జరిగే అవకాశం ఉంది.