– అనుహ్యాంగా 43 మంది రాజీనామా
– వేతన ఒప్పంద ఉల్లంఘనలపై ఆగ్రహం
– సంక్షోభంలో విమాన సంస్థ..!
– 700 విమానాల రద్దు
న్యూఢిల్లీ : బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఆకాశ ఎయిర్ సంక్షోభంలో పడింది. ఆ సంస్థ తీరును నిరసిస్తూ 43 మంది పైలట్లు వైదొలిగారు. తమ వేతనాల ఒప్పంద విధానాన్ని సంస్థ ఉల్లంఘించడంతో అనుహ్యాంగా పైలట్లు రాజీనామా చేశారు. దీంతో వందలాది విమానాలను రద్దు చేసుకుంది. జులై నుంచే అంతరంగంగా పైలట్ల తిరుగుబాటు ప్రారంభమైనట్లు తెలుస్తోంది. ఈ పరిణామం ఆ సంస్థతో పాటు పౌర విమానయాన రంగం పరిశ్రమను తీవ్ర ఆందోళనకు గురి చేసింది. ఆకాశ ఎయిర్ ఏ విధమైన వేతన ఒప్పంద ఉల్లంఘనలకు పాల్పడిందనే విషయం పూర్తిగా బయటికి రావాల్సి ఉంది.
దివంగత రాకేష్ ఝున్‌ఝున్‌వాలా ప్రధాన వాటాదారుగా గతేడాది ఆగస్టులో దేశీయంగా విమాన సేవలను ప్రారంభించిన ఆకాశ ఎయిర్.. ఇటీవలే అంతర్జాతీయ విమానయాన సేవలకు అనుమతి పొందింది. ఇందుకోసం బోయింగ్ 737 మ్యాక్స్ విమానాన్ని అందుకుంది. తన 20వ ఎయిర్‌క్రాప్ట్‌ను జోడించుకోవడంతో పాటుగా అంతర్జాతీయ సేవలకు అనుమతులు పొందడంతో వేడుకలు జరుపుకుంది. ఇంతలోనే సంస్థ తమ వేతన ఒప్పందం అంశంలో పైలట్లు తిరుగుబాటు చేయడంతో సంస్థ సంక్షోభంలోకి జారుకున్నట్లయ్యింది. కాగా.. ఎలాంటి నోటీసు ఇవ్వకుండా అనుహ్యాంగా వైదొలిగిన పైలట్లపై చర్యలు తీసుకునేలా డిజిసిఎకు ఆదేశాలు ఇవ్వాలని ఢిల్లీ హైకోర్టును ఆకాశ ఎయిర్ ఆశ్రయించింది. పైలట్ల రాజీనామా వల్ల ఆగస్ట్‌లో 600 విమానాలను రద్దు చేసినట్లు ఆకాశ ఎయిర్ ఢిల్లీ హైకోర్టుకు తెలిపింది. సెప్టెంబర్‌లో దాదాపు 700 విమానాలు రద్దు చేసుకున్నామని పేర్కొంది.
పైలట్ల రాజీనామా పరిణామంతో తాత్కాలికంగా పలు విమానాలను కుదించుకుంటున్నామని ఆకాశ ఎయిర్ సిఇఒ వినరు దుబే పేర్కొన్నారు. సంస్థను మూసివేయమని ఆయన ఉద్యోగులకు పంపిన ఇ-మెయిల్‌లో హామీ ఇచ్చారు. కొద్ది మంది పైలట్లు ఉన్నట్టుండి రాజీనామా చేయడంతో పలు విమాన సర్వీసులను రద్దు చేసుకున్నామన్నారు. నోటీసు ఇవ్వకుండానే చట్టవిరుద్ధంగా వెళ్లిపోయారన్నారు. సంబంధిత పైలట్‌లపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. సంస్థ దీర్ఘకాల కార్యకలాపాల కొనసాగింపునపై తమకు విశ్వాసం ఉందని ఇమెయిల్‌లో దుబే పేర్కొన్నారు. 43 మంది పైలట్ల నిష్క్రమణతో స్వల్ప కాలం సేవలకు మాత్రమే అంతరాయం ఏర్పాడిందన్నారు. కొంతమంది పైలట్ల నిర్ణయం కారణంగా జులై, సెప్టెంబర్ మధ్య విమానాలకు అంతరాయం జరిగిందన్నారు. పలు విమానాలను చివరి నిమిషంలో రద్దు చేయవలసి వచ్చిందని పేర్కొన్నారు. దీర్ఘకాలం సేవలందించేందుకు సిద్దంగా ఉన్నామన్నారు. డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డిజిసిఎ) గణాంకాల ప్రకారం.. ఆకాశ ఎయిర్ మార్కెట్ వాటా జులైలో 5.2 శాతంగా ఉండగా.. ఆగస్ట్‌లో 4.2 శాతానికి పడిపోయింది.