జాతీయ పతాక నిర్మాత పింగళి వెంకయ్య

భారతదేశ ఆత్మ గౌరవ పతాక రూపశిల్పి పింగళి వెంకయ్య తెలుగు వాడు కావడం మనందరికీ గర్వకారణ అంశం. ఎక్కడో కృష్ణాజిల్లాలోని భట్లపెనమర్రు గ్రామంలో 1878వ సంవత్సరం ఆగస్టు 2 వ తేదీ వెంకటరత్నమ్మ, హనుమంతరాయుడు దంపతులకు వెంకయ్య జన్మించాడు.
ఆంగ్లో వేదిక్‌ కాలేజీలో భాష, చరిత్ర, జపనీస్‌ అధ్యయనం చేశాడు. ఆ రోజుల్లో పర దేశ భాష నేర్చుకుని పట్టు కలిగి వుండడంతో ‘జపాన్‌ వెంకయ్య’ అనేవారు. 19 సంవత్సరాలకే సైన్యంలో చేరాడు. బోయర్‌ యుద్ధంలో పాల్గొన్నాడు. అదీ దక్షిణాఫ్రికా దేశం తరుపున బలమైన డచ్‌ సైన్యంతో యుద్ధం చేశాడు. అక్కడే బారిస్టర్‌గా వున్న గాంధీజీతో పరిచయం… భారత స్వాతత్య్రం వైపు దృష్టి మరలడం జరిగింది.
భారతదేశంలో తొలి తరం కాంగ్రెస్‌ నేతలైన దాదాబాయి నౌరోజీ, బాల గంగాధర్‌ తిలక్‌, టాగూర్‌ లాంటి వారు ఏటా సభలు, దేశం కోసం పోరాడే విధానానికి వెంకయ్య ఆకర్షితుడై కార్యకర్తగా చేరి నాయకుల దృష్టిని ఆకర్షించాడు. భుక్తి కోసం మునగాల రాజా ప్రోత్సాహంతో వ్యవసాయం చేశాడు. ఆనాటి కాంగ్రెస్‌ సభల్లో అధికార ఆంగ్లేయుల జెండా ఎగరేసే స్థితి చూశాడు. మన దేశం కోసం ఒక జెండా, మనకంటూ వుండాలని, వంద దేశాల జెండాలు అధ్యయనం చేసి ‘భారత్‌కు ఒక జాతీయ జెండా’ అనే పుస్తకాన్ని వెంకయ్య ప్రచురించాడు.
బందరులో భోగరాజు పట్టాభి సీతారామయ్య స్నేహం, స్వాతంత్య్రోద్యమ భాగస్వామ్యంతో 1911లో బందరులో ఆంధ్ర జాతీయ కళాశాల స్థాపనలో వెంకయ్య పాలు పంచుకున్నాడు. పత్తితో నూలు వడికి (రాట్నంతో) ఖాదీ బట్టలు ధరించాలని కాంగ్రెస్‌ ఆనాడు పిలుపు ఇచ్చింది. విదేశీ వస్త్ర బహిష్కరణకు ఉద్యమించింది. పత్తి పంట అధికోత్పత్తి కోసం అమెరికా నుండి పత్తి విత్తనాలు తెప్పించి వాటిని దేశీయ విత్తనాలతో సంయోగింపజేసి… ప్రయోగాలు చేసి నేడు మనం వాడే హైబ్రిడ్‌ వంగడాలకు రూపకల్పన చేశాడు. అధిక పత్తి ఉత్పత్తికి వ్యవసాయ శాస్త్రవేత్తగా మారి ‘పత్తి వెంకయ్య’గా పిలువబడ్డాడు. ‘కంబోడియా కాటన్‌’ తెచ్చాడు.
అభ్రకం (మైకా), ఖనిజాలు, బొగ్గు నుండి వజ్రాలు వెలికి తీసే భూగర్భ పరిశోధనలు ఎన్నో చేశాడు. దాంతో వజ్రాల వెంకయ్యగా ఖ్యాతి నొందాడు. ప్రెసిడెన్సీ కాలేజీలో (మద్రాసు) భూగర్భ శాస్త్ర పరిశోధనలపై డిప్లొమా చేశాడు. నెల్లూరులో మైకా గురించి పరిశోధనలు చేసి బొగ్గు వజ్రంగా మారే విధానాన్ని పరిశోధించాడు. ‘తల్లిరాయి’ అనే గ్రంథం కూడా రాశాడు. నేటి మన పాలకులు అటవీ సహజ వనరుల్ని కార్పొరేట్లకప్పగిస్తున్నారు.
ఇక జెండా గురించి తెలుసుకుంటే… వెంకయ్యకు ముందే మేడం కామా, సిస్టర్‌ నివేదిత, అనిబిసెంట్‌, తిలక్‌ లాంటి వాళ్లు కొన్ని జెండాలు రూపొందించారు. 1921 బెజవాడ కాంగ్రెస్‌ సభల్లో వెంకయ్య రూపొందించిన కాషాయం, ఆకుపచ్చ రంగు, రాట్నం వున్న జెండాను అందించాడు. పదేళ్ల తర్వాత మళ్లీ 1931లో స్వయం సంపన్నతకు సూచికగా ‘రాట్నం’ గుర్తు, మైనార్టీల కోసం శాంతి ఐక్యతల ప్రతీకగా తెలుపు రంగు మధ్యలో వుండేలా నూతన జెండా ‘కరాచీ’ సభలో ఎగిరింది. ఇదే పతాకం 1947 జులై దాకా కొనసాగింది.
నిజాం కొలువులో ప్రధానిగా చేసిన అక్బర్‌ హైదరీ మేనకోడలు, చిత్రకారిణి… ఆమే సరయూ తయ్యబ్‌జీ. ఆమె భర్త బధ్రుద్దీన్‌ తయ్యబ్‌జీ నెహ్రూ వద్ద పనిచేసేవారట. మాటల సందర్భంలో ఈ దేశానికి పతాకం వుండాలన్నాడట. హోంరూల్‌ ఉద్యమంలో చరఖాతో వున్న జెండా వుందిగా అన్నాడట నెహ్రూ. ‘అదొక రాజకీయ పక్ష జండా కదా. మార్చాలి’ అనగా… గాంధీతో మాట్లాడాలి. ఆయన్ని ఒప్పించాలి అన్నాడట నెహ్రూ. సరయూ తయ్యబ్‌, ‘అశోక చక్రం’తో (రాట్నం స్థానంలో) వేసిన జెండాను గాంధీ ఓకే చేశారట. చరఖా ఇప్పటికీ కాంగ్రెస్‌ పార్టీ అధికారిక జెండాగా వుంది. అలా రాజ్యాంగ సభ ఆమోదంతో 1947 జులై 22 నుండి ధర్మచక్రం వున్న జెండా నేషనల్‌ ఫ్లాగ్‌ గా మారింది. హన్స్‌ రాజ్‌ అనే ఆయన కృషి వుంది ఈ మార్పులో. ఇలాంటి చరిత్ర గల జెండా అందించిన వెంకయ్య కటిక పేదరికంతో 1963 జులై 4 బెజవాడలో కన్నుమూశాడు.
– తంగిరాల చక్రవర్తి, 9393804472

Spread the love