– న్యాయపర అంశాలు పరిశీలిస్తున్నట్లు సురేష్ గోపి వెల్లడి
– వాయనాడులో పర్యటించిన కేంద్ర సహాయ మంత్రి
తిరువనంతపురం : కేరళలోని వాయనాడ్‌లో చోటుచేసుకున్న మహా విపత్తుపై దేశమంతా స్పందిస్తున్నా కేంద్రంలోని బీజేపీ నేతృత్వం ఎన్‌డిఎ ప్రభుత్వం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టుగా వ్యవహరిస్తోంది. ప్రకృతి ప్రకోపానికి సర్వం కోల్పోయి వేలాది మంది నిరాశ్రయులుగా ఎదురుచూస్తున్నా కేంద్రం కనికరించడం లేదు. ఈ మహా విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఇప్పటికే కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ విజ్ఞప్తి చేశారు. అయితే జాతీయ విపత్తుగా ప్రకటించాలంటే న్యాయపర అంశాలను పరిశీలించాల్సివుందని కేరళకు చెందిన బీజేపీి నేత, కేంద్ర పర్యాటకశాఖ సహాయ మంత్రి సురేష్ గోపి చెప్పారు. ప్రమాద ప్రాంతంలో ఆదివారం ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మీడియాతో ఆయన మాట్లాడుతూ కేంద్రం ఏదైనా ఒక ప్రకటన చేసే ముందు అనేక విధి విధానాలకు కట్టుబడి ఉండాల్సివుంటుందన్నారు. వయనాడ్ విపత్తుపై కేరళ ప్రభుత్వం డిమాండ్ చేస్తున్న జాతీయ విపత్తుగా ప్రకటించే అంశంపై న్యాయపర అంశాలను కేంద్రం పరిశీలిస్తోందని ఆయన తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థించాలని సురేష్ గోపి విజ్ఞప్తి చేశారు. ఈ ప్రమాదంలో నిరాశ్రయులైన కుటుంబాలకు వేగంగా పునరావాసం కల్పించడానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఆయన తెలిపారు. భారత సైన్యం, ఎన్‌డిఆర్‌ఎఫ్ అధికారులతో కలిసి ప్రమాద ప్రాంతంలో సురేష్ గోపి పర్యటించారు. ఈ పర్యటన తరువాత కేరళ రాష్ట్ర ప్రజా పనుల శాఖ మంత్రి మహ్మద్ రియాజ్‌తో సురేష్ గోపి సమావేశమయ్యారు.