– సైన్స్ ధనవంతుల చేతిలో బానిస కావొద్దు
– విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం
– మూఢ నమ్మకాలు జన జీవనానికి ప్రమాదం
– సైన్స్ నిరంతరం రియాల్టీని నేర్పుతుంది :ప్రొఫెసర్ నాగేశ్వర్‌రావు
– ముగిసిన జేవీవీ రాష్ట్ర ఐదో మహాసభలు
నవతెలంగాణ-సిటీబ్యూరో
సైంటిఫిక్ పేటెంట్ల ద్వారా దోపిడీ జరుగుతోందనీ, ఫార్మాస్యూటికల్ కంపెనీలు చాలా ఆకృత్యాలు చేస్తున్నాయని విద్యాశాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ బుర్రా వెంకటేశం అన్నారు. మేడ్చల్ మల్కాజ్‌గిరి జిల్లా కాప్రాలో రెండు రోజలుగా నిర్వహిస్తున్న జన విజ్ఞాన వేదిక మహాసభ రెండో రోజున జరిగిన సభలో ఆయన మాట్లాడారు. ఎదుగుతున్న భారతదేశంలో సైన్స్ టెంపర్ లేకపోతే మూఢ నమ్మకాలు, అంధ విశ్వాసాలు అధికమవుతాయని తెలిపారు. మనిషి తన విజ్ఞానాన్ని అర్థం చేసుకుని ముందుకు సాగాలని సూచించారు. అనవసరపు ఖర్చులతో చేసే పండుగలపై ప్రశ్నించేతత్వం నేర్చుకోవాలనీ, విద్యార్థుల మైండ్‌లో ఇలాంటి వాటి గురించి ఆలోచనలను తీసుకురావాలన్నారు. అందరూ సైంటిఫిక్ టెంపర్‌ను అలవాటు చేసుకోవాలని తెలిపారు. పాజిటివ్‌ను పాజిటివ్‌గా.. నెగటివ్‌ను నెగటివ్‌గా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. సైంటిఫిక్ బేసిన్‌తో పెరుగుతున్న ఆకృత్యాలను ప్రశ్నించాలన్నారు. ప్రపంచంలో ఉన్న అన్ని కంపెనీలకు వచ్చే లాభాల్లో 90 శాతం.. 1 శాతం వర్గాల జేబుల్లోకి వెళ్తుందన్నారు. సైన్స్ ధనికుల చేతిలో బందీ కాకుండా చూడాల్సిన అవసరం ఉందన్నారు. సైన్స్ పేరుతో ప్రజలకు లాభం చేసే పనులకు ఆటంకం కలిగించొద్దనీ, ప్రజల నమ్మకాన్ని హర్ట్ చేయొద్దని సూచించారు.
సైన్స్, మతం మధ్య యుద్ధం సృష్టించొద్దు : ప్రొఫెసర్ నాగేశ్వర్
సైన్స్, మతం మధ్య యుద్ధం సృష్టించొద్దని ప్రొఫెసర్ నాగేశ్వర్ అన్నారు. ‘ప్రజా సైన్స్ ఉద్యమ దశ-దిశ’ అనే అంశంపై ఆయన మాట్లాడారు. ప్రజల విశ్వాసాలను గౌరవిస్తూ, శాస్త్రీయ విశ్వాసాలను కలిగించడం జేవీవీ పని అన్నారు. ప్రజా సైన్స్ కార్యకర్తలకు సహనం, ఓపిక ఉండాలని సూచించారు. సైన్స్ చెబితే అది ఆటోమేటిక్‌గా మూఢత్వం అవుతుందన్నారు. సైన్స్ నిరంతరం రియల్టీని నేర్పుతుందని అభిప్రాయపడ్డారు. కాలక్రమేణా కొన్ని నమ్మకాలు సన్నగిల్లుతున్నాయనీ, ఇతరుల నమ్మకాన్ని గౌరవించే సంస్కారం పెంచుకోవాలని సూచించారు. మూఢనమ్మకాలు జన జీవనానికి ప్రమాదమని, దీనిపై పోరాడాలని సూచించారు. సైన్స్ పెరుగుతున్న కొద్దీ ప్రజలే మారతారని తెలిపారు. సైన్స్ ఇనిస్టిట్యూషన్స్ ప్రజలకు దూరం అయ్యాయని తెలిపారు. సైన్స్‌ను ప్రజలకు అందకుండా చేస్తున్న ధోరణులపై పోరాటం చేయాలన్నారు. ఆధారం లేని ఆలోచనలు సమాజంలో తిరుగుతున్నాయని చెప్పారు.