మాతో ఒక సిరీస్‌ ఆడండి: నేపాల్‌

నవతెలంగాణ – హైదరాబాద్: ఆర్థికంగా బలమైన క్రికెట్‌ బోర్డుతో మ్యాచ్‌లు ఆడితే తమకు లబ్ది చేకూరుతుందని ప్రతి దేశం భావిస్తుంటుంది. ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యంత సంపన్న క్రికెట్‌ బోర్డు అయిన‌ భారత క్రికెట్‌ నియంత్రణా మండలితో సత్సంబంధాలు కొనసాగించాలని మిగతా జట్లన్నీ ప్రయత్నిస్తుంటాయి. తమ దేశంలో ఒకసారి పర్యటించినా.. తమతో ఒక సిరీస్‌ ఆడినా.. ఊహించనంత డబ్బు వచ్చి పడుతుందని వాటికి తెలుసు. ఆ ఉద్దేశంతోనే ప్రతి క్రికెట్‌ బోర్డు టీమిండియాతో సిరీస్‌ ఆడేందుకు ఉబలాటపడుతోంది. తాజాగా పొరుగు దేశమైన నేపాల్‌ క్రికెట్ ఆసోసియేష‌న్ కూడా ఇదే ఉత్సుకత చూపింది.అంతర్జాతీయ క్రికెట్‌ మండలిని సైతం ప్రభావితం చేయగల ఆర్థిక వనరులు బీసీసీఐకి ఉన్నాయి. అందుక‌ని భార‌త జ‌ట్టుతో ఒక సిరీస్‌ ఆడేందుకు ప్రయత్నిస్తున్నట్లు నేపాల్‌ క్రికెట్‌ బోర్డు అధ్యక్షుడు చతుర్‌ బహదూర్‌ చంద్‌ వెల్లడించాడు. విశ్వవ్యాప్తంగా విపరీతమైన అభిమానగణం ఉన్న భారత జట్టు, నేపాల్‌తో ఒక సిరీస్‌ ఆడితే.. తమ దేశంలో క్రికెట్‌కు క్రేజ్‌ పెరుగుతుందని ఆయన పేర్కొన్నాడు.

Spread the love