– ఆయన వల్ల మా పార్టీ మరింత ఎదుగుతోంది
– ఆర్‌ఎన్ రవి తీరుపై స్టాలిన్ వ్యంగ్యాస్త్రాలు !
చెన్నై : తమిళనాడు గవర్నర్‌గా ఆర్‌ఎన్ రవిని మార్చకుండా ఆ పదవిలోనే కొనసాగించాలంటూ డిఎంకె అధ్యక్షులు, తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకె స్టాలిన్ శుక్రవారం ప్రధాని మోడీని, కేంద్ర హోం మంత్రి అమిత్ షాను ఉద్దేశించి వ్యంగంగా వ్యాఖ్యలు చేశారు. గవర్నర్‌ను ఆ పదవిలోనే కొనసాగించడం రాష్ట్రంలో డిఎంకె మరింతగా వృద్ధి చెందడానికి సాయపడుతోందని వ్యాఖ్యానించారు. రవికి వ్యతిరేకంగా డిఎంకెకు చాలా అభ్యంతరాలు వున్నాయని, అయినా ఆయనను కొనసాగించడంతో తమ పార్టీ రాష్ట్రంలో అభివృద్ధి చెందడానికి దోహదపడుతోందని స్టాలిన్ అన్నారు. ”గవర్నర్‌ను మార్చాలని కోరుతూ అసెంబ్లీలో ఎన్నడైనా మేం తీర్మానాన్ని ఆమోదించామా? లేదు, అలాంటి తీర్మానాన్ని మేం ఎన్నడూ తీసుకురాలేదు. ఆయన ఆ పదవిలోనే కొనసాగాలి. ఆయన వల్లే డిఎంకె బాగా ఎదుగుతోందని స్టాలిన్ వ్యంగాస్త్రాలు విసిరారు. చెన్నైలోని పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలనుద్దేశించి ఆయన ప్రసంగించారు. త్వరలో జరగబోయే అసెంబ్లీ సమావేశాల గురించి మాట్లాడుతూ, ”సభ నుద్దేశించి గవర్నర్ సాంప్రదాయానుసారం ప్రసంగించాలి. ఆయన సభకు వస్తారు. మేం ముందుగా సిద్ధం చేసిన ప్రసంగం కాపీని ఆయనకు ఇస్తాం. ఆయన దాన్ని చదవరు, వాకౌట్ చేస్తారు. అదంతా ప్రజలు చూస్తూ వుంటారు.” అని స్టాలిన్ వ్యాఖ్యలు చేశారు.